అనంతపురం, మార్చి 3: అనంతపురం నగరంలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో పడిన వడగండ్ల వాన జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులకు దుమ్మంతా పైకి లేవడంతో దారి కనపడక వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. ఈదురుగాలులకు తోడు వడగండ్లు తోడవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు నేలకూలాయి. మురికికాలువలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై మోకాళ్లలోతు నీరు పారింది. వాహనాలు నీట మునిగాయి. పలు చోట్ల వాహనాలపై విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు పడడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరవాసులు అంధకారంలో మగ్గిపోయారు. సుమారు 40 విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గాలివానకు గుత్తిరోడ్డులో ఏర్పాటుచేసిన తాజ్‌మహల్ ఎగ్జిబిషన్ కుప్పకూలింది. ఇందులో ఏర్పాటుచేసిన జెయింట్ వేల విరిగిపోవడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. జిల్లాలోని బుక్కరాయసముద్రం, నార్పల ప్రాంతాల్లో కురిసిన గాలివానకు అరటితోటలకు భారీ నష్టం జరిగింది. బుక్కరాయ సముద్రంలో చెట్టుపడి ఒక వ్యక్తి మృతి చెందాడు.
అనంతపురం నగరంలో గాలివానకు కూలిపోయిన జెయింట్‌వీల్. సాయినగర్‌లో జీపుపై పడిన విద్యుత్ స్తంభం