కేసముద్రం, మార్చి 3: ఇంట్లో నిల్వచేసిన పత్తి రాసి (కూటు) కూలి ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలైన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోర్కొండపల్లిలో సోమవారం సాయంత్రం జరిగింది. బేతు వెంకటయ్య కొడుకు, కూతురు సుజాత పిల్లలైన ఇద్దరు మనుమలు బేతు విక్కి (3), చిట్యాల వేణు (11), మనుమరాలు చిట్యాల భద్రకాళీ (5) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బాధితులు, గ్రామస్తుల కధనం ప్రకారం బేతు వెంకటయ్య కుమారుడైన వీరన్న భార్య భవాని కాన్పు కోసం మహబూబాబాద్ ఆసుపత్రిలో చేరగా.. సమీప బంధువైన మరొకరు పురుగులమందు తాగి ఆసుపత్రిలో చేరగా వెంకటయ్యతో పాటు ముగ్గురు పిల్లల్ని ఇంటి వద్ద వదిలి కుటుంబ సభ్యులంతా మహబూబాబాద్ వెళ్లారు. ఉదయం గదిలో ఆడుకుంటామని గదిలోకి వెళ్లిన పిల్లలను సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వెంకటయ్య తలుపు తట్టగా లోనుంచి గడియవేసి ఉండటం.. ఎంత పిలిచినా పిల్లలకు పలకకపోవడంతో అనుమానం వచ్చి కిటికిలోంచి తొంగిచూడగా పత్తిరాసి కూలిపడిపోయి ఉండటంతో ఇరుగుపొరుగువారిని పిలిచి తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి చూడగా ముగ్గురు పిల్లలు పత్తికింద విగతజీవులై కనిపించారు. రాసిగా పోసిన పత్తి మీదపడటంతో పాటు పత్తికి అడ్డుగా కట్టిన ప్లాస్టిక్ పరదా వీరిని ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన తెలుసుకొని వచ్చిన కుటుంబ సభ్యుల రోధనలతో గ్రామం పూర్తిగా శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్ సిఐ సతీష్‌వాసాల సంఘటనా స్థలిని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.
విగతజీవులైన బేతు విక్కి (3), చిట్యాల వేణు (11), చిట్యాల భద్రకాళీ (5)