
ఆల్కా ఫిలింస్ పతాకంపై జనార్దన్‌రావు చల్లా దర్శకత్వంలో కథానాయిక లక్ష్మి రూపొందిస్తున్న చిత్రం ‘వాట్ హ్యాపెన్ 6 టు 6’. వెంకీ, లక్ష్మి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోవిడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ సీడీ లోగో ఆవిష్కరించగా, కె.వి.వి.సత్యనారాయణ సీడీని విడుదల చేసి తొలి కాపీని కథానాయకుడు మనోజ్ నందంకు అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, కథానాయిక లక్ష్మి మాట్లాడుతూ- తనని హీరోయిన్‌గా చూడాలనుకున్న తనవారి ప్రోద్బలంతో ఈ చిత్రంలో తాను నటించి నిర్మించానని, సినిమా తీయడంలో సాధక బాధకాలు తెలుసుకున్నానని అన్నారు. చిన్న సినిమాగా ప్రారంభించినా ఈ చిత్రాన్ని పెద్ద సినిమాగా రూపొందించామని, సినిమా విజయవంతం కావడానికి తనకు అందరూ సహకరించాలని ఆమెకోరారు. అండమాన్ నికోబార్ దీవులలో ప్రతికూల పరిస్థితులలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను చేశామని, హీరోయిన్‌గా, నిర్మాతగా లక్ష్మి రెండు పాత్రలు సమర్థవంతంగా నిర్వహించారని కథానాయకుడు వెంకి తెలిపారు. కార్యక్రమంలో ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఇసనాక సునీల్‌రెడ్డి జె.వి.రెడ్డి, ఎస్.కె.అర్జున్, బాబ్జి, వెంకటరెడ్డి, రామ్‌మోహన్‌గౌడ్, సింగయ్యపల్లి గోపి, ఇంద్రారెడ్డి, మాధవ్, నిరంజన్, వసంత్‌రావు, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.