
14న తమ్ముడొస్తున్నాడు
============
తమిళనాట ముందు నుంచే సినిమా రంగం, రాజకీయం కలిసిపోయాయి. తెలుగు నాట కూడా ఇది కొత్తదేమీకాదు. ఏకంగా పార్టీలు చేసి అధికారంలోకి వచ్చిన వారున్నారు, పార్టీలు ఏర్పాటు చేసి చేతులు కాల్చుకున్నవారు ఉన్నారు. చివరకు పవన్ రాజకీయ ప్రవేశం సైతం ఇదేం కొత్త కాదు. చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీలో పవన్ కీలక పాత్ర వహించారు. యువరాజ్యం అధ్యక్షునిగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజారాజ్యం ప్రయోగం విఫలం అయిన తరువాత ఇప్పటి వరకు పవన్ రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ ఏర్పాటు లేదా? స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.
=================
టాలీవుడ్‌లోనే కాదు తెలుగునాట ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తాడా? ఎన్నికల్లో పోటీ చేస్తాడా? ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలే. అన్నీ ప్రశ్నలే కొన్నింటికి ట..ట.. అనే సమాధానాలు. ఏం చేస్తాడో తమ్ముడే చెప్పాలి. తమిళనాట ముందు నుంచే సినిమా రంగం, రాజకీయం కలిసిపోయాయి. తెలుగు నాట కూడా ఇది కొత్తదేమీకాదు. ఏకంగా పార్టీలు చేసి అధికారంలోకి వచ్చిన వారున్నారు, పార్టీలు ఏర్పాటు చేసి చేతులు కాల్చుకున్నవారు ఉన్నారు. చివరకు పవన్ రాజకీయ ప్రవేశం సైతం ఇదేం కొత్త కాదు. చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీలో పవన్ కీలక పాత్ర వహించారు. యువరాజ్యం అధ్యక్షునిగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజారాజ్యం ప్రయోగం విఫలం అయిన తరువాత ఇప్పటి వరకు పవన్ రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ ఏర్పాటు లేదా? స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయాలపై తన ఆలోచనలతో ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని విడుదల చేయడం, రాజకీయాలపై నిర్ణయం ప్రకటించడం ఒకే వేదికపై నుంచి జరుగుతుంది. ఈనెల 14న పవన్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. తొలుత 12న ప్రకటించాలని భావించినా, అదే రోజు కిరణ్ కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ప్రకటన ఉండడం వల్ల రెండు రోజులు వాయిదా వేసుకున్నారు.
స్వాతంత్య్రానికి ముందు నుంచే సినిమా, రాజకీయ రంగాల మధ్య తెలుగు నాట మంచి సంబంధాలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎంతో మంది జన నాట్యమండలి ద్వారా ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు సినిమా రంగంవైపు ఆకర్శితులు అయ్యారు. ఆ దేశానికి స్వాతంత్య్రం లభించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలనాటి తెలుగు హీరో జగ్గయ్య కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 82లో ఎన్టీఆర్ ఏకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. అయితే కేవలం సినిమా గ్లామర్ వల్లనే కాక ఆనాటి రాజకీయ పరిస్థితులు ఎన్టీఆర్ విజయానికి దోహదం చేశాయి. అదే స్ఫూర్తితో చిరంజీవి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేత వైఎస్‌ఆర్ జనాకర్శణ పథకాలు, మరోవైపు బలమైన పార్టీ వ్యవస్థ ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయాల ముందు చిరంజీవి నిలువలేకపోయారు.
అన్న రాజకీయాల్లో విఫలం అయ్యాక తమ్ముడేం చేస్తాడు అనేది కొందరి ప్రశ్న. చిరంజీవి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. సీమాంధ్రలో ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపి, కాంగ్రెస్, కిరణ్ కుమార్‌రెడ్డి కొత్తగా ఏర్పాటు చేసే పార్టీ, బిజెపి, వామపక్షాలకు తోడుగా ఇప్పుడు పవన్ రంగ ప్రవేశం చేయనున్నారు. పవన్ ప్రభావం కొన్ని ప్రాంతాల్లోనైనా కొంత వరకు ఉంటుంది. సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల నుంచి పవన్ పోటీ చేస్తారని వినిపిస్తోంది. పవన్ రాజకీయ ప్రవేశాన్ని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ నిర్ధారించారు.
తెలుగు తారల్లో మిగిలిన హీరోల కన్నా పవన్ భిన్నంగా కనిపిస్తారు. ఆయనకు బాగా చదివే అలవాటుంది. చెగువేరా సిద్ధాంతాలను బాగా అభిమానిస్తాడు. గతంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తరువాత ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టారు. పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనం అయినా పవన్ మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.
గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాల ద్వారా మంచి ఫామ్‌లో ఉన్న పవన్‌కు రాజకీయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉంది. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం కాకుండా ఒక బృందంగా ఏర్పడి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది. పవన్ తన రాజకీయ ప్రస్తానాన్ని ఈనెల 14న జరిగే సమావేశంలో వివరిస్తారు. రాజకీయాలపై సుదీర్ఘంగా తన అభిప్రాయాలను ఆ రోజు వెల్లడించనున్నారు. తమ పార్టీలో చేరాల్సిందిగా పవన్‌కు ఇప్పటికే టిడిపి, లోక్‌సత్తా ఆహ్వానాలు అందజేసింది. మరోవైపు బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగింది. పవన్ రాజకీయ ప్రవేశంతో ప్రధానంగా సీమాంధ్రలో బహుముఖ పోటీతో రాజకీయం రంజుగా మారనుంది.