
గత వారం రోజులుగా తన కూతురు వైభవి డల్‌గా ఉండటం వైభవి తల్లి గమనించింది. ఆదివారం ఎప్పటిలా వైభవి బయటికి వెళ్లి తోటి పిల్లలతో ఆడుకోలేదు. హోంవర్క్ చేసుకుని నిద్రపోయింది. సోమవారం ఉదయం కూడా వైభవి అలాగే ఉంది. సాయంత్రం స్కూల్ నించి వచ్చిన వైభవి నిస్త్రాణగా పడుకోవడం చూసి తల్లి అడిగింది.
‘ఎందుకలా ఉన్నావు?’
వైభవి జవాబు చెప్పకపోవడంతో మళ్లీ ప్రశ్నించింది.
‘నాన్న నువ్వు అడిగిన సైకిల్ కొనివ్వలేదనా?’
‘అవును. నాన్న నాకు సైకిల్ ఎందుకు కొనివ్వలేదు?’ వైభవి అడిగింది.
‘కేంప్ నించి వచ్చాక కొనిస్తానని చెప్పారుగా?’
‘కొనిచ్చి వెళ్లచ్చుగా?’ వైభవి దుఃఖంగా చెప్పింది.
‘సరే. లేచి మొహం కడుక్కో. నీకు తలనొప్పిగా ఉన్నట్లుంది?’ తల్లి ప్రశ్నించింది.
‘అవును’
‘కాఫీ కలిపి ఇవ్వలేను. అది తాగితే వెంటనే తగ్గేది’
‘ఏం? ఇంట్లో కాఫీ పొడి లేదా?’
‘లేదు’
‘నేను షాప్‌కి వెళ్లి తెస్తాను’
‘చక్కెర, పాలు కూడా లేవు’
‘అవీ తెస్తాను’
‘ఇంట్లో గేస్ స్టౌ లేదు’
‘మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టచ్చుగా?’
‘అదీ లేదు’
వైభవి తల్లి వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.
‘అదీ పాడైందా? ఫ్రిజ్‌లో మజ్జిగ ఉంటుందిగా. అదివ్వు’
‘మనింట్లో ఫ్రిజ్ లేదు. మజ్జిగ లేదు’
‘మన ఇంట్లో అన్నీ ఉన్నాయిగా? ఇవాళ నీకేమైంది?’ వైభవి తల్లిని చిరుకోపంతో ప్రశ్నించింది.
‘నీ పద్ధతినే పాటిస్తున్నాను’ తల్లి చెప్పింది.
‘నా పద్ధతా? అంటే?’
‘ఇంట్లో ఉన్నవాటికి సంతోషించే బదులు లేనివాటిని తలచుకుని బాధపడడం. దీనే్న ఇంగ్లీష్‌లో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని అంటారు. గేస్‌స్టౌ, ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్ లేని వాళ్లు పడే బాధ నీకు అర్థం కావడంలేదు. అవి ఉంటే కలిగే ఆనందం కూడా తెలియడం లేదు. ఉన్న ఆనందాన్ని వదులుకుని లేని సైకిల్ తలచుకుని దుఃఖపడుతున్నావు.’ తల్లి వివరించింది.
వైభవికి తల్లి మాటల్లోని గూఢార్థం స్ఫురించింది.
‘సారీ అమ్మా. నేను అనవసరంగా కంప్లైంట్ చేస్తున్నాను. మనకి కావలసినవన్నీ మనకి ఉన్నాయి. నాకు నువ్వు, నాన్న కూడా ఉన్నారు. నీ బోధ నాకు అర్థమైంది’
వైభవి ఉత్సాహంగా మంచం దిగి బాత్‌రూంలో మొహం కడుక్కుని ఆడుకోడానికి వెళ్లిపోయింది.
*