
అరుణాచలం అడవుల్లోని ఒక జంతు రాజ్యానికి సింహం రాజుగా ఉండేది. పుట్టింది సింహ జాతిలోనైనా మెతక ధోరణి కలిగి ఉండేది. వంశపారంపర్యంగా దక్కిన పదవి కాబట్టి.. తప్పనిసరై రాజరికం వెలగబెట్టడం తప్ప, రాజుకు ఉండాల్సిన లక్షణాలు లేవు. సింహం మెతకదనం తెలుసుకున్న అనేక జంతువులు దానిని లెక్కచేయక స్వేచ్ఛగా తమకు నచ్చిన రీతిలో ప్రవర్తించసాగాయి. దీంతో ఆ జంతు రాజ్యంలో ఆటవిక న్యాయం దెబ్బతింది. తమకు కావల్సిన మేరకే జంతువులను వేటాడాలన్న నియమానికి విరుద్ధంగా విచ్చలవిడిగా వేటాడసాగాయి. దీంతో అనేక సాధు జంతువులకు రక్షణ కరవైంది. ఇలా ఉండగా రెండు గుంట నక్కలు సింహం పంచన చేరి.. ఆ మాటా ఈ మాటా చెబుతూ దాని ప్రాపకం సంపాదించాయి. అంతేకాక రాజుగారి అండతో కొన్ని క్రూరమృగాలను తమ అదుపులోకి తెచ్చుకున్నాయి. అవి వాటితో ... రాజుగారికి ఆహారం కావాలి. వెంటనే ఏదయినా జంతువును వేటాడి తీసుకురమ్మని పురమాయించేవి. అవి వేటాడి తెచ్చిన వాటిలో కొంత తాము స్వాహా చేసేవి. తనకు కష్టం లేకుండా ఆహారాన్ని సేకరించి పెడుతున్న గుంటనక్కలపై సింహానికి అభిమానం పెరిగింది.
అయితే అదే అడవిలో వుంటున్న ఒక పులికి ఇదంతా నచ్చేది కాదు. సింహరాజు అలసత్వం వల్ల ఆటవిక న్యాయం దెబ్బతిందనీ.. దీన్ని అరికట్టకపోతే అమాయక జంతువులు ఎన్నో సింహరాజుకీ.. గుంట నక్కలకూ బలి కావాల్సి ఉంటుందని బోధించింది.
ఇది నచ్చని గుంట నక్కలు వెళ్లి సింహంతో ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పాయి.
* * *
పులిని పిలిచి నోటికొచ్చినట్లు తిట్టింది సింహం. తనని ఏదో చేసి, రాజరికం కోసం కుట్ర పన్నుతావా అని నిందించింది. అన్నీ ఓపిగ్గా భరించిన పులి ‘మీ అతి మంచితనం, చెప్పుడు మాటలు వినే మనస్తత్వం, పరిపాలనా సంబంధమైన విషయాలలో జోక్యం లేకపోవడం వల్ల.. సాధు జంతువులు కష్టాలకు లోనవుతున్నాయి’ అని వివరించినప్పటికీ.. మరింత హీనమైన మాటలతో పులి మనసును గాయపరచింది.
ఎలాగైనా సింహానికి కళ్లు తెరిపించాలని నిర్ణయించుకున్న పులి.. సింహం గుహ ముందు నిరాహారదీక్ష చేయ నారంభించింది. దానికి తోడుగా మిగతా జంతువులు తోడయ్యాయి. అడవి దద్దరిల్లింది. వాటి ఐకమత్యాన్ని చూసి.. పులి ధైర్యాన్ని చూసి సింహంలోని మంచితనం మేల్కొంది. తనలోని తప్పులు, అలసత్వం వల్ల జరిగిన నష్టాన్ని, గుంటనక్కల చెప్పుడు మాటల వల్ల ఎలా మోసపోయిందో అర్థమైంది. దాంతో అడవిలో శాంతియుత వాతావరణం నెలకొంది. ఆటవిక న్యాయం పరిఢవిల్లింది.
*