
అమ్మాయికి ముద్దు పెట్టడం -ఆర్ట్. ఈ విషయాన్ని ‘బావగారూ బాగున్నారా!’ సినిమాలో చిరంజీవి చెప్పకనే చెప్పాడు. అక్కడితో ఆగకుండా రంభకు ముద్దు పెట్టి మరీ చూపించాడు. ముద్దు పెట్టుకునే అవకాశం వచ్చిన శ్రీహరికి -ఆర్ట్ తెలీదు కనుక చోద్యం చూస్తూ నిలబడ్డాడు. సీన్ రివర్స్ అయ్యి -అబ్బాయి లిప్స్‌ని అమ్మాయి లాక్ చేయాలన్నా ఒకింత భయమో, కంగారో సహజం. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే -ముద్దు ప్రాక్టీస్ చేస్తే మంచిదనుకుంటున్నారా? ఆలోచన బాగానే ఉంది, అమ్మాయిని అడిగితేనే చెప్పు చేతిలోకి తీసుకుంటుంది. అబ్బాయిని అడగాలంటే -అమ్మాయికి సిగ్గు. అందుకే -ముద్దే చేతగాని మొద్దబ్బాయిలు, అమ్మాయిల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఫ్లోరిడాకు చెందిన ఎమిలీ కింగ్ ఓ ప్లాస్టిక్ డిజైన్‌కు ప్రాణం పోశాడు. అదే -మేక్ అవుట్ ప్రాక్టీస్ పిల్లో. మెత్తటి దిండు మధ్యలో సుతిమెత్తని ప్లాస్టిక్‌తో -కోటేరులాంటి ముక్కు, దొండపండులాంటి పెదాలు అమర్చాడు. అబ్బాయిల ముక్కూ, పెదాలు అమర్చీ కూడా పిల్లోలు డిజైన్ చేశాడు. -‘పిల్లో కొనండి. ప్రాక్టీస్ మొదలెట్టండి’ నినాదంతో 31 డాలర్లకు మార్కెట్లోకి వదిలాడు. ముద్దంటే చేదనేవాళ్లెవరు? అందుకే -గాళ్‌ఫ్రెండ్ ఉన్నవాళ్లు, గాళ్‌ఫ్రెండ్‌ని పికప్ చేసుకోవాలని ఆశించే వాళ్లు, బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్ మొదలెట్టినోళ్లు.. ఇలా కుర్రకారు ఎగబడి మరీ పిల్లోలు కొని పట్టుకుపోతున్నార్ట. ఈ ఆలోచన ఎందుకొచ్చిందయ్యా కింగూ? అంటే -పెద్దకథే చెప్తున్నాడు ఎమిలీ. కాలేజ్ డేస్‌లో ఉన్నపుడు గాళ్‌ఫ్రెండ్‌ని ఊహించుకుంటూ దిండుని ముద్దు పెట్టుకునేవాడిని. అది చూసి స్నేహితులంతా ఎగతాళి చేసేవారు. అయితే, పైకి ఎగతాళి చేసినా అందరి అనుభవం అదేనన్న విషయం అర్థమై -పిల్లో ప్లాన్‌కు ప్రాణం పోశాను’ అంటున్నాడు ఎమిలీ. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందేమో.. ఓసారి ట్రైచేస్తే బెటర్. ఏమంటారు?
ప్రకృతి ఇచ్చిన దౌవ్యౌషధాల్లో ఒకటి -తేనె. అమృతం కోసం సురలు సముద్రాన్ని చిలికారుగానీ, తేనె విషయం ముందే తెలిస్తే కచ్చితంగా అక్కడే ఆగిపోయేవారు. మనిషికి తేనె సులువుగానే దొరుకుతున్నా దాని విలువ మాత్రం ఇంకా పూర్తిగా గుర్తించలేకపోతున్నాడు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే -తేనెను మనిషి పాడు చేస్తున్నాడుగానీ, ఏ మనిషినీ తేనె పాడుచేసిన దాఖలాలు లేవు.
***
టర్కీలో ఒక రకమైన తేనె కొనాలంటే -5వేల యూరోలు ఉండాలట. అంటే 6.8 వేల అమెరికన్ డాలర్లన్న మాట. -కేజీ తేనె ఇంత ఖరీదా? మా ఊళ్లో రెండొందల పారేస్తే -బెల్లం పాకంలాంటి తేనె బోల్డంత దొరుకుతుంది? అనిపిస్తోంది కదూ! అలా ఆలోచించకుండా టర్కీ తేనె -విశేష గుణాలు తెలుసుకోండి. టర్కీలో గుండే గుండుజ్ అనే వ్యక్తి కుటుంబం దగ్గర దొరికే తేనె -ప్రపంచంలోనే అపురూపమైంది. ఆ తేనె పేరు ‘ఎల్విష్’. ఏమిటీ దాని స్పెషాలిటీ అంటే -1800 మీటర్ల లోతులోని ఓ గుహలో దొరికిన తేనె అది. ఈశాన్య టర్కీలోని ఆర్టివిన్ సిటీకి కొంచెం దూరంలో సరికాయిర్ లోయ ఉంది. ఆ లోయలోని ఓ గుహలో ఈ తేనె దొరికిందట. అదీ -ఏడేళ్ల క్రితం. ఎన్నో ఔషధ గుణాలున్న, అపురూపమైన తేనె -ఇప్పుడు గుండుజ్ జీవితానే్న మార్చేసింది. మూడు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సమకూర్చిపెట్టింది.
గుండే గుండుజ్ అనే వ్యక్తి తేనె పట్టుని పట్టి తేనె తీసుకుని అమ్ముకునే వాడు. ఒకసారి తేనె పట్టుల కోసం చూస్తుంటే -ఓ గుహలోకి తేనెటీగలు వచ్చిపోతుండటం అతని కంట పడింది. అక్కడ పట్టు దొరకొచ్చని లోపలికి దూరాడట. ఎంత ప్రయాణం చేసినా అతనికి గుహ అంతు దొరకలేదు. పట్టు చిక్కలేదు. ‘పట్టు’వదలని విక్రమార్కుడిలా లోకల్ ప్రొఫెషనల్ క్లైంబర్స్ సాయం తీసుకుని గుహ అంచులకు వెళ్లాడు. 1800 మీటర్లు ప్రయాణం చేసిన తరువాత అక్కడ కనిపించింది ఓ తేనె పట్టు. ఆ పట్టునుంచి 18 కేజీల తేనె మాత్రమే లభించింది. దాన్ని బయటకు తీసుకొచ్చి ఫ్రెంచ్ ల్యాబ్‌లో పరీక్షలు జరిపితే -ఎన్నో మినరల్స్‌కు ఆలవాలమైన గుహలో తేనె మరీ విలువైన ఔషధ గుణాలు కలిగిన దానిగా మారినట్టు తేలింది. అంతే -గుండుజ్ జీవితం మారిపోయింది. మొట్టమొదట కేజీ తేనెను 2009లో ఫ్రెంచ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 45వేల యూరోలకు అమ్మాడు. తరువాత మరో కేజీ తేనెను -చైనా ఫార్మాసిస్ట్‌కు 28వేల యూరోలకు అమ్మాడట. ఇప్పుడు దివ్యమైన ఔషధ గుణాలున్న తేనెను -కేజీ 5వేల యూరోలకు అమ్ముతున్నాడు. ఎందుకంటే -ఎన్నో మినరల్స్ ఉన్న ఆ గుహలో పట్టు తేనె, పుట్ట తేనె ఎక్కడెక్కడ దొరుకుతుందో గుండుజ్‌కు పూర్తిగా తెలిసిపోయింది. అందుకే వ్యాపారం విస్తృతం చేయడానికి ‘ఎల్విష్’ తేనెను విరివిగా అమ్ముతున్నాడు. చిన్న ముక్తాయింపు ఏంటంటే -ఎవరైనా కారులో వెళ్లి తేనె బాటిల్ కొనుక్కుని తెచ్చుకుంటారు. కానీ, గుండుజ్ దగ్గర తేనె కొనాలంటే కారు కొనుక్కునే సొమ్ముతో వెళ్లి తేనె బాటిల్ తెచ్చుకోవాలి. అదృష్టం -తేనె పట్టినట్టు పట్టడం అంటే ఇదేనేమో.