శ్రీకాకుళం, మార్చి 8: ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. ఈ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఇంతవరకు ఓటరుగా నమోదు కాని వారు అందరూ నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలో 2540 పోలింగ్ కేంద్రాల్లో బూత్‌స్థాయి అధికారులు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు లభ్యంగా ఉంటారని చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో ఫారం-6ను అందుబాటులో ఉంచామన్నారు. వాటిని పూర్తి చేసి రెండు ఫోటోలతో సమర్పించాలని సూచించారు. కళాశాలల్లో క్యాంపస్ అంబాజిడర్‌లను ఏర్పాటు చేశామని, వారందరూ విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించాలని ఆదేశించారు. ఓటుహక్కు అనేది ప్రజాస్వామ్యానికి పునాది అని, దానిని అర్హులైన ప్రతి ఒక్కరూ పొందాలన్నారు. ఓటుహక్కు కలిగి ఉండటం, ఓటును వేయడం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. యువత ఓటరుగా నమోదుకు మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
* బిజెపి రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలం
శ్రీకాకుళం, మార్చి 8: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం అన్నారు. పట్టణంలో వాంబే కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాయత్రీ మహిళా స్వచ్చంధ సంస్థ, భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ వేధింపులు కొనసాగుతున్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇటీవల మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి ముగ్గురికి, ద్వితీయ బహుమతిని ఐదుగురికి, కన్సులేషన్ బహుమతులు 28 మంది మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూడి తిరుపతిరావు, శవ్వాన ఉమామహేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యులు సువ్వారి వెంకటసన్యాసిరావు, పట్టణ అధ్యక్షుడు శవ్వాన వెంకటేశ్వరరావు, జి.జగదాంబ, కోట సావిత్రి, సూరి చంద్రశేఖర్, మహిళలు పాల్గొన్నారు.
ఠాణాకు చేరిన ఇంటర్ పరీక్షాపత్రాలు
జలుమూరు, మార్చి 8: ఈ నెల 12వ తేదీన జరుగనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఠాణాకు చేరాయి. ఈ ప్రశ్నాపత్రాలను సరిచూసి భద్రపరిచారు. గతంలో కంటే ఈ ఏడాది అదనంగా కరవంజ మోడల్ స్కూల్‌కు పరీక్షాకేంద్రాన్ని కేటాయించారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి గాను 223 మంది పరీక్షల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు జరిగే పరీక్షకు ఒక్క నిముషం ఆలస్యమైనా లోపలకు హాజరుపరచరని, ప్రతీ విద్యార్థి 8.30 గంటలకు పరీక్షాకేంద్రంలో హాజరు కావాలన్నారు.
వైభవంగా వరదావెంకటేశ్వరుని కల్యాణం
శ్రీకాకుళం, మార్చి 8: పట్టణంలో నానుబాలవీధి వేణుగోపాలస్వామి వారి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం పద్మావతి సమేత వరదా వెంకటేశ్వరస్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది. దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఉదయం ఆగమ పండితులు ఆరవల్లి లక్ష్మణాచార్యులు పర్యవేక్షణలో రోహిణీ నక్షత్రయుత, వృషభ లగ్నమందు స్వామితోపాటు పద్మావతి అమ్మవారు, గరుడాళ్వార్లు, ధ్వజస్తంభ, బలపీఠ, వేణుగోపాలస్వామి, విగ్రహ, విమాన, గోపుర ప్రతిష్ఠలను శాస్రోక్తంగా జరిపారు. బాలసీమవాసులు చామర్తి జగ్గప్పలాచార్యులు, టిటిడి దేవస్థానం దేవాదాయ శాఖ ప్రతినిధి శ్రీనివాసాచార్యులు, చెరువు నారాయణశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎం.చంద్రశేఖరరావు, డి.కృష్ణారావు, చల్లా శ్రీనివాసరావు, అధ్యక్షులు రమణమూర్తి, సోమేశ్వరరావు, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారి నెమలపురి విద్యాంజలి అభినయించిన కూచిపూడి నృత్యం భక్తులను అలరించింది.
శ్రీకూర్మం ఆలయ వివాదంపై విచారణ జరపాలి
*శరణ్యాశ్రమం నిర్వాహకులు బాల బ్రహ్మానందసరస్వతీ
శ్రీకాకుళం, మార్చి 8: జిల్లాలో శ్రీకూర్మం ఆలయంలో మూలవిరాట్‌కు అచ్చుతీసిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని నందిగాం నయిని శరణ్యాశ్రమం నిర్వాహకులు బాల బ్రహ్మానందసరస్వతీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక టిటిడి కల్యాణ మండపంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. సంఘటనపై ప్రభుత్వం ఆదేశాల మేరకు గతంలో అర్చకుని సస్పెండ్ చేస్తూ తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి విచారణకు మంగళం పాడారని ఆరోపించారు. భక్తుల మనోభావాలకు సంబంధించి ఈ ఆధ్యాత్మిక ఘటనపై ఉన్నత దర్యాప్తు సంస్థలచే విచారణ చేయాలని రాష్టప్రతిని ఎన్.రాజశేఖర్ నివేదించారన్నారు. ఈ కార్యక్రమంలో సూరు చంద్రశేఖర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట జెడ్పిటిసి స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలి
మన్యసీమ రాష్ట్ర సాధన సమితి
శ్రీకాకుళం, మార్చి 8: జిల్లాలో 300 ఆదివాసీ గ్రామాలున్నప్పటికీ సీతంపేట జడ్పీటిసి స్థానాన్ని గిరిజనేతరులకు కేటాయించడం పట్ల మన్యసీమ రాష్ట్ర సాధన సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. సమితి కోకన్వీనర్ మాలువ సింహాచలం కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించినట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. గిరిజన స్థానాన్ని, గిరిజనేతరులకు కేటాయించడం తగదని పేర్కొన్నారు. వార్డుమెంబర్ల నుండి ఎమ్మెల్యే వరకు ఆదివాసీయులే ఉండాలని 1/70 చట్టం, అటవీ, వీసా చట్టం స్పష్టంగా ఆదివాసుల హక్కులని చెప్పినప్పటికీ దానిని విస్మరించి అధికారులు జెడ్పీటిసి స్థానాన్ని గిరిజనేతరులకు కేటాయించడం అన్యాయమని అన్నారు. వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఎంపిడిఒను బదిలీ చేసి ఆదివాసుల హక్కులను కాపాడాలని కోరారు.
శతశాతం అంధత్వ నివారణ లక్ష్యం
శ్రీకాకుళం, మార్చి 8: రాష్ట్ర వ్యాప్తంగా శతశాతం అంధత్వ నివారణ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర అంధత్వ నివారణాధికారి, రాష్ట్ర ఉపసంచాలకులు డాక్టర్ పి.వి.నందకుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన జిల్లా పర్యటనలో బాగంగా జిల్లా అంధత్వ నివారణ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న కళ్లద్దాల నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో సమీక్షించి కాటరాక్టు శస్త్ర చికిత్సలు శతశాతం నిర్వహించి లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది నుండి 15వ తేదీ వరకు గ్లకోమా నివారణా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని పలు పారామెడికల్ కేంద్రాలను సందర్శించి అవసరమైన పరికరాల కొరకు సిపార్సు చేశారు. ఆయనతో పాటు జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి.వి.రమణకుమార్, నేత్ర వైద్యులు బి.శివప్రసాద్ తదితరులున్నారు.
మహిళలకు చట్ట సభల్లో సముచిత స్థానం
* టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు కళావతి
శ్రీకాకుళం, మార్చి 8: మహిళలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీయే అని ఆ పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు బలివాడ కళావతి అన్నారు. శనివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మరుగున పడిపోయిందని, రాష్ట్ర విభజన బిల్లు పట్ల ఉన్న శ్రద్ధ మహిళా రిజర్వేషన్ బిల్లుపై లేకపోయిందని వాపోయారు. మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లను పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ అని, అదే విధంగా మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఐసిడియస్ కార్యక్రమాలకు నాంది పలికినది చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. తిరిగి వాటిని పునర్నిర్మాణం గావించడానికి బాబు నాయకత్వం అవసరమని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతోనే మహిళలకు మేలు చేకూరగలదని తెలిపారు. మహిళల పట్ల పార్టీ ముందంజలో ఉందని, ఇందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవిని ప్రకటించారని చెప్పారు. సమావేశంలో అంబటి లక్ష్మీరాజ్యం, ఎన్.విజయ, కె.కమల, పుష్పాల చినమహాలక్ష్మి, కొవ్వాడ సుశీల తదితరులు పాల్గొన్నారు.
నూరుశాతం రాయితీపై గడ్డివిత్తనాలు
సారవకోట, మార్చి 8: రైతులకు శతశాతం రాయితీపై గడ్డి విత్తనం అందజేస్తున్నామని, అదేవిధంగా 50 శాతం రాయితీపై పొట్టేళ్లను అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు పెరుమాళ్ల నాగన్న స్పష్టంచేశారు. పశువైద్య కేంద్రంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 50 శాతం రాయితీపై 400 పాడిపశువులు నేరుగా రైతుకు అందజేస్తున్నామన్నారు. సునందిని పథకంలో జిల్లాలో 4,235 లేగదూడలకు బీమా పథకం వర్తింపజేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 3,818 లేగదూడలకు బీమా పథకం వర్తింపజేసి లక్ష్యాలకు చేరువలో ఉన్నామన్నారు.
ప్రజల తలరాతను మార్చేది ఓటే
* లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు పోలినాయుడు
శ్రీకాకుళం, మార్చి 8: ప్రజల తలరాతను మార్చేది ఓటని, ప్రజాస్వామ్యంలో బుల్లెట్ చేయలేని పనిని బ్యాలెట్ చేస్తుందని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట పోలినాయుడు అన్నారు. శనివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదివ తేదీన ఎన్నికల కమీషన్ నూతనంగా ఓటు నమోదుకు ఇచ్చిన అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలని సూచించారు. రాయితీల బతుకులు తప్ప ఎదిగే అవకాశాలను ఇవ్వలేని సాంప్రదాయ రాజకీయ పార్టీలు ప్రజల సొత్తును దోచుకోవడానికే అధికారాన్ని చేక్కించుకుంటున్నాయని అన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంచాది రాంబాబు, కె.స్వామి, బి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళలతోనే దేశ పురోభివృద్ధి
శ్రీకాకుళం, మార్చి 8: మారుతున్న సామాజిక పరిస్థితుల్లో మహిళ సాధికారితతోనే అన్ని రంగాల్లో దేశం పురోగభివృద్ధి సాధిస్తోందని సెట్‌శ్రీ సి.ఇ.ఒ వి.వి.ఎస్.ఎన్.మూర్తి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెప్మా సహకారంతో శనివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. . సవాళ్లను అధిగమిస్తూ అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ విజయపథంలో నడుస్తున్నారన్నారు. విశిష్ట అతిథి డిపిఆర్వో రమేష్ మాట్లాడుతూ సమాజంలో విజయ పథంలో నడుస్తున్న మహిళలనే తోటి మహిళలు స్పూర్తిగా తీసుకుని ప్రగతిని సాధించాలన్నారు. తాజాగా స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించనున్న నేపథ్యంలో విజ్ఞతతో ఓటు వేయడం ద్వారా మేలైన సమాజానికి పునాది వేయడానికి వీలవుతుందని గుర్తించాలన్నారు. సభాధ్యక్షత వహించిన మెప్మా పి.డి మునుకోటి సత్యనారాయణ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యాలపట్ల శ్రద్ధ వహించడం ద్వారా మానసికస్థితి, సమాజాభివృద్ధి తోడ్పడాలన్నారు.
ఈ సందర్భంగా గత వారం రోజులుగా జె.సి.ఐ ఫెమీనా, స్ర్తినిధి పట్టణ మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మురికివాడల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులందించారు. ఫెమీనా వ్యవస్థాపక అధ్యక్షురాలు నీలిమా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వి.వి.ఎస్.ప్రకాష్, వెంకటలక్ష్మీ, సుగుణ, ఫెమీనా అధ్యక్ష, పూర్వాధ్యక్షులు రేవతి, శోభ, రేపాక రోజా, మహలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఆటల పోటీలు
పాతపట్నం, మార్చి 8: జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తలపెట్టిన ఆటలపోటీలు శనివారం నాటికి ముగిసాయి. గత వారం రోజులుగా గిరిజన ప్రభావిత గ్రామాల్లో గిరిజన యువకులతో నిర్వహిస్తున్న ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన గిరిజన యువకులకు బహుమతి ప్రధానం చేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడల్లో జిల్లా గిరిజన యువకులు ముందంజలో ఉన్నారన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుడ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. డిఎస్పీ దేవానంద్‌శాంతో మాట్లాడుతూ క్రీడాప్రాముఖ్యతతో ఉన్నత శిఖరాలను అవలంభించవచ్చునని విద్యార్థి దశతోపాటు క్రీడావిభాగం కూడా పుష్కలంగా ఉండాలన్నారు. సి.ఐ జె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాలీబాల్, క్రికెట్ పోటీలు జరిగాయి. వాలీబాల్ పోటీలో వీరఘట్టం పోలీస్‌స్టేషన్ పరిధి తిట్టంగి ప్రథమస్థానం కైవసం చేసుకోగా దోనుబాయ్ పరిధి నిమ్మలవలస ద్వితీయ స్థానం సాధించింది. తృతీయ స్థానాన్ని కొత్తూరు పోలీస్‌స్టేషన్, నాల్గవ స్థానాన్ని సీతంపేట పోలీసుస్టేషన్ పరిధి గిరిజనులు కైవసం చేసుకున్నారు. క్రికెట్‌ను పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో గిరిజన యువకులు మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. వీరికి ఎస్పీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.