విశాఖపట్నం, మార్చి 8: ఆన్ లైన్ లావాదేవీలు జరిపే వారు జాగ్రత్త పడాలి. ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీని నిరోధించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దేశంలోని అన్ని బ్యాంకుల నుంచి రోజువారి లావాదేవీలను రప్పించుకుని పరిశీలిస్తోంది. ఏ ఖాతాదారుడైనా 10 లక్షలకు దాటి ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తే, ఆ ఖాతాను గుర్తిస్తారు. అలాగే ఒక ఖాతాదారుడు, కొంతమందికి ఆయా మొత్తాలను అదేపనిగా బదిలీ చేస్తున్నా, అటువంటి ఖాతాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి బ్యాంకు రోజువారి ఆర్థిక లావాదేవీల జాబితాను ఇన్‌కంటాక్స్ అధికారికి అందచేయాల్సి ఉంటుంది. ఏ ఖాతాపైనైనా అనుమానం వస్తే, అదికారులు దానిపై విచారణ జరపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నగదు బదిలీ చేసే వారి ఆటకట్టించేందుకు అనేక ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆరోఖ్యరాజ్ తెలియచేశారు. ఎన్నికలలో మీడియా ప్రవర్తనా నియమావళికి సంబంధించి శనివారం కలెక్టరేట్‌లో ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా డబ్బు పంపిణీ జరుగుతోంది, లేకుంటే కార్యకర్తలు మద్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిసే, వెంటనే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూంకు తెలియచేయాలని ఆయన సూచించారు. ఆయా గ్రామాలకు వెళ్లే మార్గాల్లో కూడా స్క్వాడ్‌లు ఆకస్మిక తనిఖీలు చేస్తాయని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా పత్రికల్లో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే కథనాలపై ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు విధించిందని, వాటిని విధిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డిఆర్‌ఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
* రూ.10 లక్షల లావాదేవీలు దాటితే ఆరా
english title:
online
Date:
Sunday, March 9, 2014