విశాఖపట్నం, గోపాలపట్నం, మార్చి 8: కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి, విభజన ముసుగులో పార్టీలు మారుతూ, రాజకీయ వ్యాపారం చేస్తున్న వారి ఆటలు సాగనీయబోమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గోపాలపట్నంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వలస నాయకులతో ఈ ప్రాంత ప్రజలు విసిగి వేసారిపోయారని అన్నారు. విభజన సున్నితమైన అంశమని అన్నారు. దీన్ని ఆసరాగా చూపి, స్వలాభం కోసం పార్టీ మారే వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. విభజన జరపకుండా ఉంటే, తమ పదవులను త్యాగం చేస్తామని చెప్పామని, కానీ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసకున్న తరువాతే, కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను పూర్తి చేసిందని బొత్స అన్నారు. సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తున్న టిడిపి, వైకాపాలను ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన చెప్పారు. తెలుగుదేశం, వైకాపాల అధ్యక్ష పదవులను బడుగు, బలహీనవర్గాల వారికి ఇవ్వగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలూ అనేక వాగ్దానాలు ఇస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. ఇక పురంధీశ్వరి కాంగ్రెస్ పార్టీలో పదేళ్ళపాటు పదవులను అనుభవించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో పార్టీ విఫలమైందని చెప్పి, బిజెపిలో చేరారని అన్నారు. రాష్ట్రాన్ని విభజించేందుకు బిజెపియే కదా సహకరించింది? మరి ఆపార్టీలో చేరడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తను పదవి లేకపోతే ఉండలేనని, తన స్వార్థం కోసం పార్టీ మారుతున్నానని చెప్పి పురంధ్రీశ్వరి వెళ్లిపోతే బాగుండేదని ఆయన అన్నారు. ఏదియేమైనా ఈ ప్రాంతాన్ని మహా నగరంగా తీర్చిదిద్దడానికి తాము కృషి చేస్తామని బొత్స అన్నారు.
మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ శాశ్వత అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమంది బాధ కలుగుతుందని అన్నారు. రాష్ట్ర విభజన వలన ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్న మాట వాస్తవమేనని అన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీయే కాదు, మిగిలిన పార్టీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అధికార పార్టీలో ఉన్నందుకు తాము అనేక అవమానాలను ఎదుర్కొన్నామని బాలరాజు చెప్పారు. కొంతమంది అవకాశవాద రాజకీయం కోసం పార్టీలు మారుతున్నారని, వారిలా తాము చేయలేమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు పదవుల కోసం పనిచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అవకాశవాద రాజకీయాలు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు.
మంత్రి కృపారాణి మాట్లాడుతూ ప్రజలను అడ్డంపెట్టుకుని కొంతమంది నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ద్రోణారాజు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని, అధినేతను కాలదన్ని ప్రజారాజ్యం పార్టీలో చేరి, ఆతరువాత కాంగ్రెస్‌లో విలీనమై, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదని తిరిగి టిడిపిలోకి వెళ్లిన నేతలను చూస్తే బాధ అనిపిస్తోందని అన్నారు. విశాఖ జిల్లాలో ఎప్పుడూ ఇంతటి దిగజారుడు రాజకీయాలు చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని ఎప్పుడూ చెప్పలేదే? మరి విభజన వలన అన్యాయం జరిగిపోయిందని చెప్పుకుంటున్న వారంతా ఇప్పుడు ఆయన పంచన ఎలా చేరారని ద్రోణంరాజు ప్రశ్నించారు. తాం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న అతి నమ్మకంతో ఉన్నారని, ప్రజలే వీరికి బుద్ధి చెపుతారని ద్రోణంరాజు చెప్పారు. సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలోకి పురంధ్రీశ్వరి చేరడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎంపి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తను విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేయాలనుకున్నానని, కానీ, పురంధ్రీశ్వరి అడ్డుపడ్డారని అన్నారు. అధిష్ఠానం ఆమెను పిలిచి, రెండు, మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోమని కోరితే, తను విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పారని, అప్పుడు తనకు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారని సుబ్బరామిరెడ్డి చెప్పారు. ఇంత జరిగినా, తను ఎప్పుడూ ఎవ్వరినీ విమర్శించలేదని అన్నారు. కడవరకూ తాను విశాఖ ప్రజలకు సేవ చేస్తునే ఉంటానని సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ రాజధాని కావడానికి అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియచేశారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డిని సన్మానించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్లిపోయిన వారంతా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఇప్పుడు పార్టీని విడిచి వెళ్లినవారే, కొద్ది రోజుల తరువాత మళ్లీ సభ్యత్వం తీసుకునేందుకు తన వద్దకు వస్తారని బెహరా ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పల్లా శ్రీను, పేడాడ రమణ కుమారి, గుంటూరు నరసింహమూర్తి, ప్రభాగౌడ్, డిసిసి అధ్యక్షుడు ధర్మశ్రీ, భోగసముద్రం విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఈ సమావేశానికి గైర్హాజరు కావడం గమనార్హం.
* పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ
english title:
pcc
Date:
Sunday, March 9, 2014