విశాఖపట్నం, మార్చి 8: త్వరలో జరగనున్న మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష స్థానాల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం శనివారం ఖరారు చేసింది. 39 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు గాను ఎస్టీలకు 12 స్థానాలు, ఎస్సీలకు 3 స్థానాలు, బిసిలకు 9 స్థానాలు, జనరల్‌కు 15 స్థానాలుగా ఖరారు చేశారు. మొత్తం 39 మండలాలకు గాను 21 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఎంపిటిసి ఎన్నికల అనంతరం గెలుపొందిన అభ్యర్థులు మండలాధ్యక్షుని ఎన్నుకుంటారు.
జిల్లాలోని మండలాధ్యక్ష పదవికి రిజర్వేషన్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి
మండలం రిజర్వేషన్
1) పెదబయలు ఎస్టీ జనరల్
2) జి.మాడుగుల ఎస్టీ జనరల్
3) అరకువేలీ ఎస్టీ జనరల్
4) జి.కె.వీధి ఎస్టీ జనరల్
5) కొయ్యూరు ఎస్టీ జనరల్
6) అనంతగిరి ఎస్టీ జనరల్
7) హుకుంపేట ఎస్టీ మహిళ
8) డుంబ్రిగుడ ఎస్టీ మహిళ
9) ముంచిగ్‌పుట్ ఎస్టీ మహిళ
10) చింతపల్లి ఎస్టీ మహిళ
11) పాడేరు ఎస్టీ మహిళ
12) వి.మాడుగుల ఎస్టీ మహిళ
13) నక్కపల్లి ఎస్సీ మహిళ
14) బుచ్చెయ్యపేట ఎస్సీ మహిళ
15) ఆనందపురం ఎస్సీ జనరల్
16) పద్మనాభం బిసి మహిళ
17) పెందుర్తి బిసి మహిళ
18) రోలుగుంట బిసి మహిళ
19) అనకాపల్లి బిసి మహిళ
20) కశింకోట బిసి మహిళ
21) పరవాడ బిసి జనరల్
22) నాతవరం బిసి జనరల్
23) గొలుగొండ బిసి జనరల్
24) పాయకరావుపేట బిసి జనరల్
25) కె.కోటపాడు జనరల్ మహిళ
26) నర్సీపట్నం జనరల్ మహిళ
27) మాకవరపాలెం జనరల్ మహిళ
28) చీడికాడ జనరల్ మహిళ
29) కోటవురట్ల జనరల్ మహిళ
30) రాంబిల్లి జనరల్ మహిళ
31) చోడవరం జనరల్ మహిళ
32) యలమంచిలి జనరల్ మహిళ
33) మునగపాక జనరల్
34) అచ్యుతాపురం జనరల్
35) దేవరాపల్లి జనరల్
36) సబ్బవరం జనరల్
37) భీమునిపట్నం జనరల్
38) ఎస్.రాయవరం జనరల్
39) రావికమతం జనరల్
ఘనంగా సెయిల్‌లో మహిళా దినోత్సవం
విశాఖపట్నం , మార్చి 8: ప్రతి మహిళ స్వయం ప్రతిపత్తి స్వావలంబన సాధించిన నాడే మహిళా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని సెయిల్ ప్రాంతీయ మేనేజర్ అనిల్‌కుమార్ గుప్తా పేర్కొన్నారు. శనివారం హార్బరు వద్ద సెయిల్, బిటిఎస్‌ఓ కార్యాలయ ప్రాంగణంలో ఆయన ముఖ్య అతిథిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని ప్రారంభించారు. అబాంచి మేనేజర్ అనిల్ భట్నాగర్ మట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అభిలషించారు. అనంతరం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులైన అనామిక ఘోష్, కె.గౌతమిలను ముఖ్య అతిథిగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ మహిళా నేత పాట్నూరు జయలక్ష్మి సహా ఉద్యోగినులైన జి.సూర్యకాంతం రవికుమార్, సుధారాణి తోడ్పాటుతో ఒప్పంద కార్మికులకు రంగవల్లిక పోటీలు, లక్కీడిప్ నిర్వహించి విజేతలకు ఆర్‌ఎం. చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అంతకు ముందు కేట్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపి ఉద్యోగినులకు బిఎం పుష్పగుచ్ఛాలు అందించారు. మహిళా నేత అధికారులకు జ్ఞాపికలందించి కృతజ్ఞతలు అర్పించారు. కార్యక్రమంలో ఎన్.అరవింద్, ఎం.్భరత్‌కుమార్, టి.శ్రీనివాస్, ఎన్‌కె.పాండే, జోగారావు తదితర అధికారులు, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఎన్.సింహాచలం, కార్యదర్శి నాగులాపల్లి రామలింగేశ్వరరావు సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు.
యువత సృజనశీలురుగా ఎదగాలి
* ఘనంగా ప్రారంభమైన ఏక్మీ యువజనోత్సవాలు
విశాలాక్షినగర్, మార్చి 8: విద్యార్థులు సృజనాత్మకత శక్తితో విభిన్న రంగాలలో రాణించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్‌ఎన్.రాజు అన్నారు. శనివారం ఉదయం ఎయు ఇంజనీరింగ్ కళాశాలలోని వైవిఎస్.మూర్తి ఆడిటోరియంలో యువజనోత్సవాలు ఏక్మీ-2014ను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో ప్రతిభ చూపుతూ ముందుకు సాగాలని సూచించారు. విద్యతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలను, క్రీడా, సాంస్కృతిక, సాహిత్యరంగాలకు సమ ప్రాధాన్యం అందిస్తూ ముందుకు నడవాలని అన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా యువతను తయారు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులు తమలో అంతర్గతంగా దాగివున్న నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విభిన్న ప్రాంతాలకు చెందిన, కళాశాల విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తూ బృంద, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్‌వి.రామచంద్రమూర్తి మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో ముందుంచే విధంగా కళాశాల ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కృతిక విభాగం డీన్ ఆచార్య పి.బాబివర్థన్ మాట్లాడుతూ యాంత్రికంగా మారుతున్న మానవ జీవితంలో సాంస్కృతిక ఉత్సవాల ద్వారా కొత్త ఉత్సాహాన్ని నింపాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ సిహెచ్.ఇమ్మానియేల్‌రాజు మాట్లాడుతూ 50 విభాగాల్లో విద్యార్థులకు పోటీలు జరుపుతామన్నారు. సాయంత్రం ఇంజనీరింగ్ కళాశాల వేదికగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ యువజనోత్సవాల్లో ఎయు రెక్టార్ ఆచార్య ఇఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కట్టా రామ్మోహన్‌రావు, కో కన్వీనర్ డాక్టర్ ఎన్‌ఎం.యుగంధర్, ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ డీన్ వై.రామకృష్ణ, విద్యర్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరిప్రకాష్, స్టూడెంట్స్ కన్వీనర్ గొంప హరి తదితరులు పాల్గొన్నారు.
వ్యర్ధాల నిర్వాహణలో మున్సిపాలిటీలు భేష్
* సాలూరు, బొబ్బిలి మున్సిపాల్టీల్లో జివిఎంసి కమిషనర్
విశాఖపట్నం, మార్చి 8: ఘన వ్యర్థాల నిర్వాహణ, తడి పొడి చెత్తల సేకరణ విషయంలో విజయనగరం జిల్లా సాలూరు,బొబ్బిలి మున్సిపాలిటీల్లో అనుసరిస్తున్న విధానాలు ఆచరణీయమని జివిఎంసి కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఘన వ్యర్థాల నిర్వాహణ తీరును శనివారం ఆయన స్వయంగా పరిశీలించారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని ఐటిఐ కాలనీలో పర్యటించిన కమిషనర్ అక్కడ ఇళ్లనుంచి తడిపొడి చెత్తల సేకరణను పరిశీలించారు. గృహయజమానులు తడిపొడి చెత్తలను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేసే విషయంలో అనుసరించిన విధానాలను మున్సిపల్ కమిషనర్ ఎం చంద్రికను అడిగి తెలుసుకున్నారు. ఈవిషయంలో ప్రజలను చైతన్య పరిచేవిషయంలో అక్కడి యంత్రాంగం విజయం సాధించినట్టు గుర్తించారు. ఘన వ్యర్థాలను నిర్వహించే పార్కులో తడిపొడి చెత్త సేకరణ, వాటిని రీసైక్లింగ్ చేస్తున్న తీరు, వాటిద్వారా లభిస్తున్న బై ప్రోడక్ట్స్, సమకూరుతున్న ఆదాయం వంటి అంశాలను కమిషనర్ సత్యనారాయణ ఆరాతీశారు. దీనికోసం అనుసరిస్తున్న విధానాలు, ఉపయోగిస్తున్న యంత్ర సామాగ్రి, మానవ వనరులను ఆయన పరిశీలించారు. తడి చెత్తను పల్వరైజింగ్ మెషీన్‌తో పిప్పిచేసి ఎరువుగా మారుస్తున్న విధానంతో పాటు పొడి వ్యర్ధాలను హైడ్రాలిక్ బేలర్‌ను ఉపయోగిస్తున్న తీరును ఆరాతీశారు. తడి వ్యర్ధాలతో వర్మీ కంపోస్టు, కంపోస్టు ఎరువును తయారు చేయడంతో పాటు వాటిని విక్రయిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఘనవ్యర్థాల నిర్వాహణ చేస్తున్న పార్కును సందర్శించారు. ఎనిమిదెకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కును అత్యంత సుందరమైన నందనవనంగా మార్చిన తీరును మెచ్చుకున్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించిన ఆయన పలు అంశాలను మున్సిపల్ కమిషనర్ షేక్ సుభానీని అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ నగర పరిధిలో జోన్ 4లో విశ్వం పేరిట తడిపొడి చెత్తల సేకరణ చేపట్టినట్టు వెల్లడించారు. ఘన వ్యర్థాలతో పాటు చెత్త నిర్వాహణ సక్రమంగా ఉంటే పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని అన్నారు. ఈ మున్సిపాలిటీల సందర్శనలో ఆయన వెంట జివిఎంసి సిఎంఓ డాక్టర్ సత్యనారాయణ రాజు, జోనల్ కమిషనర్లు ఎ.శ్రీనివాస్, వి.రవీంద్ర, రామ్మోహనరావు తదితరులు ఉన్నారు.
మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే బిజెపిలో చేరికలు
* పురంధ్రీశ్వరి రాకను స్వాగతిస్తున్నాం
* విశాఖ టికెట్ ఆమెకింకా కేటాయించలేదు
* బిజెపి సీనియర్ నేత కె.హరిబాబు
విశాఖపట్నం, మార్చి 8: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నాయకత్వంపై అపారమైన నమ్మకంతోనే ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు బిజెపిలో చేరుతున్నారని ఆపార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యుడు కె.హరిబాబు అన్నారు. మోబైల్ మోడీ టీస్టాల్‌ను శనివారం నాడిక్కడ హరిబాబు ప్రారంభించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 272 ప్లస్ సీట్లను సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మోడీ ప్రధాని కావాలని దేశం యావత్తూ భావిస్తోందని, మోడీకి ఒక్కరే దేశాన్ని అగ్రగామిగా నిలపగలరన్న నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు. మోడీ ప్రధాని అయితే సీమాంధ్రను గుజరాత్ తరహాలో అభివృద్ధి చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర సహాయ మంత్రి పురంధ్రీశ్వరి బిజెపిలో చేరడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పురంధ్రీశ్వరి పోటీ చేస్తారన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు. ఇంకా టికెట్‌ల కేటాయింపుపై పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే పురంధ్రీశ్వరి విజయవాడ లేదా నర్సారావుపేట స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
పోలీసు అవుట్ పోస్టులు వద్దు
పెదబయలు, మార్చి 8: బాక్సైట్ తవ్వకాలకు పోలీస్ బలగాలు మోహరింపు కోసం ఏర్పాటు చేస్తున్న పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మండలంలోని మారుమూల గ్రామాల గిరిజనులు డిమాండ్ చేశారు. మండలంలోని లింగేటి, గోమంగి, బొంగరం పంచాయతీ వాసులు శనివారం పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు, బాక్సైట్ తవ్వకాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో బాక్సైట్ తవ్వకాల కోసమే పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంటుందన్నారు. పెదబయలు మండలంలోని 23 పంచాయతీలలో 16 పంచాయతీలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయని, కనీస వౌళిక సదుపాయాలు కూడా లేక అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోమంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని, ఉన్న సిబ్బంది కూడా ప్రజలు అందుబాటులో లేక పంచాయతీ వాసులు సరైన వైద్య సేవలు పొందలేకపోతున్నారని వారు తెలిపారు. కొన్ని గ్రామాల్లో పాఠశాలలు ఉన్నప్పటికీ పక్కా భవనాలు లేక పూరిపాకల్లోనే విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. మరికొన్ని గ్రామాల్లో రహదారి సౌకర్యం కూడా లేదని, రహదారి సౌకర్యం ఉన్న గ్రామాలకు రవాణా సౌకర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అనేక పంచాయతీల్లో సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం పోలీస్ అవుట్ పోస్టుల ఏర్పాటుకు మాత్రం తహతహలాడుతోందని వారు విమర్శించారు. గిరిజనులను అభివృద్ధికి ఉపయోగపడని కార్యక్రమాలను చేపడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. ప్రభుత్వానికి గిరిజనులపై శ్రద్ధ ఉంటే బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలు, పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటును మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ప్రజలంతా బొంగరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
గణేష్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు ?
* ఎన్నికల ప్రచారం చేసుకోవాలని సూచించిన జగన్
నర్సీపట్నం, మార్చి 8: నర్సీపట్నం నియోజకవర్గం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆపార్టీ ఇన్‌చార్జ్ పెట్ల ఉమాశంకర్ గణేష్ పేరును అధిష్టానవర్గం ఖరారు చేసింది. శుక్రవారం రాష్ట్ర రాజధానిలో జరిగిన పార్టీ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో పార్టీ అధినేత వై. ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఈమేరకు నిర్ణయించినట్లు ఆపార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గత కొంత కాలంగా నర్సీపట్నం ఎమ్మెల్యే టిక్కెట్‌కు సంబంధించి వై ఎస్సార్ సి.పి.లో పలు ఊహాగానాలు వినిపించాయి. తాజామాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప వై ఎస్సార్ సి.పి.లోకి చేరే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం సాగింది. ఆమె పార్టీలో చేరితే టిక్కెట్ కేటాయించడం ఖాయంగా పలువురు భావించారు. దీనికి తోడు ఎమ్మెల్యే ముత్యాలపాప వియ్యంకుడైన ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాదరావులు ప్రస్తుతం వై ఎస్సార్ సి.పి.లోనే కొనసాగుతుండడంతో వీరి మద్దతుతో పార్టీ టిక్కెట్ ముత్యాలపాపకు వస్తుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వీటిని పటాపంచలు చేస్తూ గణేష్ అభ్యర్థిత్వాన్ని శుక్రవారం జరిగిన సమావేశంలో ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని జగన్ సూచించినట్లు గణేష్ సన్నిహితులు తెలిపారు. అయితే గణేష్ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి దారి వారిదే
* ఒంటరిగా పోటీకి దిగుతున్న కాంగ్రెస్, వై ఎస్సార్ కాంగ్రెస్
నర్సీపట్నం, మార్చి 8: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు వేసేందుకు గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకులు తలమునకలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం మున్సిపాలిటీలో ఉమ్మడిగా పోటీ చేయాలని భావించిన పై రెండు పార్టీల నాయకులు తాజాగా ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో ఒప్పందం చేసుకుంటే దీని ప్రభావం మరో రెండు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని వై ఎస్సార్ సి.పి. నాయకులు భయపడుతున్నారు. ఈ నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని పార్టీ ఇన్‌చార్జ్ పెట్ల ఉమాశంకర్ గణేష్ పలువురు నాయకులు సూచిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆపార్టీ నాయకులు యోచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పి.సి.సి. అధ్యక్షుడి నుండి డి.సి.సి. అధ్యక్షుడు వరకు ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా నర్సీపట్నం , యలమంచిలి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని, అన్ని వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపుతామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే అభ్యర్థులను కౌన్సిలర్లుగా పోటీకి నిలిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డులకు గాను 25 వార్డులకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. ఈరెండువార్డుల్లో పోటీ చేసేందుకు పలువురు పోటీ పడుతుండడంతో ఏకాభిప్రాయం కోసం అయ్యన్నసోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా రెండు, మూడు రోజులుగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్లు వేసేందుకు ముహూర్తం కుదిరిన అనంతరం అదే రోజున కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి.
నమ్మించి....లక్షన్నర తీసుకొని...
* జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ళు ఇప్పిస్తానని మోసం
* జివిఎంసిలో దళారీల హల్‌చల్
* దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బాధితులు
విశాఖపట్నం , మార్చి 8: నమ్మించాడు....లక్షన్నర వరకూ తీసుకున్నాడు....మారికవలసలో ఉన్న గృహ సముదాయాలలో ఇళ్ళు ఇప్పిస్తానని చెప్ప మోసగించడంతో బాధితులు ఆ దళారికి దేహశుద్ధి చేసి స్థానిక రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే....మల్కాపురంలో ఉంటున్న పి.్భరతి అనే ఆమె దగ్గర నేను జివిఎంసి యుసిడి విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి , వారితో స్నేహం ఏర్పర్చుకుని మీకు మారికవలసలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహాన్ని కేటాయించేలా మా అధికారులతో మాట్లాడి ఒక ప్లాట్ ఇప్పిస్తానని నమ్మకండా చెప్పడంతో దఫదఫాలుగా వారు సుమారు 1.50 లక్షలు ఇచ్చేసారు. రేపు మాపు అంటూ కాలయాపన చేయడంతో దళారి నాగభూషణరావుపై అనుమానం వచ్చి వారు పోలీసులు, మీడియా వారిని ఆశ్రయించారు. దీంతో శనివారం ఉదయం జివిఎంసి సౌకర్యం కేంద్రాల వద్ద సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటనతో అసలు విషయం బైటకు వచిచంది. దళారి నాగభూషణరావు బాధితులకు భారతికి ఫోన్ చేసి 20 వేల రూపాయలు ఇస్తే మీకు ఇంటి తాలూకా కాగితాలను అప్పగిస్తానని శనివారం చెప్పడంతో వారు కూడా డబ్బు తీసుకొని జివిఎంసికి వచ్చారు. గంటల కొద్దీ సమయం గడుస్తున్నప్పటికీ ఏమీ తేలకపోవడంతో అక్కడున్న వారికి స్థానిక మీడియా సిబ్బందికి తెలియజేయడంతో చివరకు దళారీ పోలీసులకు చిక్కాడు. దీంతో ఆ దళారీకి దేహశుద్ధి చేసి రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
అధికారుల అండదండలతోనే...
జివిఎంసిలో యుసిడి విభాగంలో వున్న పలువురు ముఖ్య అధికారుల అండదండలతోనే ఇటువంటి దళారీల మితిమీరినతనం బయటకు వస్తుందని ఆ శాఖకు చెందిన అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతోనే జివిఎంసి ప్రధాన కార్యాలయంలోనే దళారీలు ఈ హల్‌చల్ చేస్తున్నారు.
దళారులను నమ్మద్దు: కమిషనర్
జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహాల కేటాయింపు తదితర విషయాలపై ఎటుంవటి దళారులను నమ్మవద్దని, ఏదైనా జివిఎంసి అధికారులతోనే సంప్రదించాలని అన్నారు. గృహాలను మంజూరు చేయిస్తామంటూ ప్రజల నుండి వసూళ్ళకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఐరిష్ తీస్తూ తప్పుడు కేటాయింపు పత్రాలను ఇస్తున్నారని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
జిల్లా ఎస్పీ ఎదుట 18మంది మిలీషీయా సభ్యుల లొంగుబాటు
విశాఖపట్నం, మార్చి 8: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఎదుట 18మంది మావోయిస్టు మిలీషీయా సభ్యులు లొంగిపోయినట్టు శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం, కొత్తబంద గ్రామానికి చెందిన 18మంది మిలీషీయా సభ్యులు ఏడాది జనవరి 28న చాపగెడ్డలోని కాఫీసల్పర్ యూనిట్‌ను, గోదామును, ట్రాక్టర్‌ను ధ్వంసం చేసిన సంఘటనల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. వీరందరిని బలవంతంగా మావోయిస్టులు కొత్తబంద గ్రామం నుండి తీసుకుని పోయి పై అసాంఘిక కార్యాక్రమాలను చేయించినట్టు ఎస్పీ వివరించారు. గత 40సంవత్సరాలుగా చాపగెడ్డ కాఫీసల్ఫర్ యూనిట్‌లో పని చేసి జీవనం సాగిస్తున్నామని, అటువంటి దానిని ధ్వంసం చేయడంలో తాము ఉపాధి కొల్పోయమన్న విషయాన్ని గ్రహించి, లొంగిపోవడానికి మిలీషీయా సభ్యులు ముందుకు వచ్చినట్టు చెప్పారని ఎస్పీ తెలిపారు. ఆమాయక గిరిజనులను భయపెట్టి, బలవంతంగా ఈ విధంగా చేయించడం చట్ట విరుద్ధమని, కాబట్టి మావోయిస్టులు మిలీషీయా సభ్యులతో పాటు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.