హైదరాబాద్, మార్చి 10: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) చెల్లింపుపై యాజమాన్యం అలసత్వాన్ని నిరసిస్తూ గుర్తింపు కార్మిక సంఘాలు నిరాహార దీక్షకు దిగాయి. కార్మిక సంఘాలతో యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 27 శాతం ఐఆర్ చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఐఆర్ చెల్లింపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకుంటే ఈనెల 12 నుంచి రాష్టవ్య్రాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద సోమవారం ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఐక్య కూటమి నేతలు అశ్వత్థామరెడ్డి, ఎస్. బాబు నిరాహార దీక్షకు దిగారు. దీక్షలను ప్రారంభిస్తూ ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పద్మాకర్, టిఎంయు నేత తిరుపతిలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ఒప్పందం మేరకు ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన ఐఆర్‌పై స్పష్టమైన ఆదేశాలావ్వాలని, లేనిపక్షంలో బుధవారం ఉదయం నుంచి రాష్టవ్య్రాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం, యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ఐఆర్‌పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, సమ్మెను నిలువరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని వారు పేర్కొన్నారు. ఐఆర్ వల్ల ఆర్టీలోని అన్ని వర్గాల కార్మికులకు లబ్ధి చేకూరనున్నందునా క్లరికల్, సూపర్ వైజర్ సంఘాలు సమ్మెకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా ఉన్న 217 డిపోల్లోని 23 వేల బస్సులు రోడ్డెక్కవని ఐక్య కూటమి నాయకులు స్పష్టం చేశారు. కార్మిక నాయకుల దీక్ష మంగళవారం కూడా కొనసాగుతుందని, దీక్షలకు సంఘీభావంగా రాష్టవ్య్రాప్తంగా అన్ని డిపోల ఎదుట ధర్నాలు చేపట్టాలని ఈయు ఉప ప్రధాన కార్యదర్శి పి. దామోదరరావు పిలుపునిచ్చారు. ఇలా ఉండగా కార్మిక శాఖ ఆర్టీసీ యాజమాన్యాన్ని, గుర్తింపు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కార్మిక శాఖ కార్యాలయంలో జరగనున్న చర్చల్లో ఐఆర్, సమ్మె సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు, ఆర్. లక్ష్మయ్య, పార్దసారథి, ఈయు నేతలు రాఘవేంద్రరావు, జిడి. ప్రసాద్‌రెడ్డి, టిఎంయు నేతలు బివిరెడ్డి, థామస్‌రెడ్డి, ఎల్. మారయ్య తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఆర్టీసీ ఈయు, టిఎంయు ఐక్య కూటమి హెచ్చరిక నిరాహార దీక్షకు దిగిన కార్మిక నాయకులు
english title:
ir
Date:
Tuesday, March 11, 2014