Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఫలక్‌నుమా రైలులో బాంబు కలకలం

$
0
0

నల్లగొండ, మార్చి 10: సికింద్రాబాద్ నుండి హౌరాకు వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టారన్న ఫోన్‌కాల్ ప్రయాణికులను వణికించింది. గుర్తు తెలియని వ్యక్తి రైలులో బాంబు పెట్టారంటు 100నెంబర్‌కు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు 5-40ప్రాంతంలో నల్లగొండ స్టేషన్‌లో నిలిపివేసి విస్తృత తనిఖీలు సాగించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది రైలు బోగీలన్నింటిలో తనిఖీలు చేశాక ఎలాంటి బాంబులు లేవని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా పోలీసులు నల్లగొండలో రైలును ఆపి ప్రయాణికులను బోగీలు ఖాళీ చేయాలని చెప్పి తనిఖీలకు దిగడంతో బెంబెలెత్తిన ప్రయాణికులు తమ లాగేజీ బ్యాగ్‌లు, పిల్లలతో రైలు దిగి దూరంగా చెట్లలోకి పరుగులు పెట్టారు. కొందరు ఈ కంగారులో తమ లాగేజీ బ్యాగ్‌లను రైలులోని వదిలి పరుగులు పెట్టారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నంత సేపు దూరంగా నిలుచుని చూసిన ప్రయాణికులు చివరకు బాంబు సమాచారం వట్టిదేనని పోలీసులు తేల్చాక పొలోమంటు మళ్లీ రైలుబోగీల్లోకి చేరిపోయారు.
రూ. కోటిన్నర విలువైన
ఎర్రచందనం స్వాధీనం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 10: వైఎస్సార్ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. గతంలో అధికారులు సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన బందోబస్తులో తలమునకలై ఉండగా స్మగ్లర్లు ఎర్రచందనాన్ని భారీగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఎడాపెడా ఎన్నికలు రావడంతో ఎన్నికలు రావడంతో యంత్రాంగం ఆ హడావుడిలో పడడంతో మళ్లీ అక్రమ రవాణా ఊపందుకుంది. అయితే అటవీశాఖాధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాజంపేట ఫారెస్టు డివిజన్ పరిధిలో సోమవారం అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక లారీ సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.1.50 కోట్లు చేస్తుందని ఫారెస్టు అధికారులు తెలిపారు. గుండ్లూరు, రామాపురం, సూరపరాజుపల్లె చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీల్లో డిఎఫ్‌ఓ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో
బంగారం బిస్కెట్లు పట్టివేత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 10: దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 22 బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల ఎనిమిదవ తేదీనే వీటిని పట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే సోమవారం ఈ విషయాన్ని బయటపెట్టారు. దుబాయ్‌లో 22 బిస్కెట్‌ల బంగారాన్ని తీసుకుని సయ్యద్ మహ్మద్ దేబిక్ అలీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో బయల్దేరాడు. విమానం హైదరాబాద్ రాగానే, మంజూర్ అలి, సగూల్ హమీద్, రావ్‌తర నయనా మహ్మద్, షేక్ మహ్మద్ ఖాసింబాబు అందులో ఎక్కారు. విమానం విశాఖకు చేరుకునే లోగానే మహ్మద్ దేబిక్ అలీ, హైదరాబాద్‌లో విమానం ఎక్కిన నలుగురికి ఆ బంగారు బిస్కెట్‌లు ఇచ్చేశాడు. ఒక్కొక్కరు ఐదు బిస్కెట్‌ల చొప్పున రహస్య ప్రదేశంలో దాచుకున్నారు. విమానం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకునేలోపే, నిఘా వర్గాలు ఇక్కడి కస్టమ్స్ అధికారులను హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, ఈ ఐదుగురిని గుర్తించి, విచారించడం మొదలు పెట్టారు. తొలి రోజు ఇద్దరు తమ వద్ద ఉన్న బిస్కెట్‌లను ఇచ్చేశారు. సోమవారం మిగిలిన వారు కూడా బిస్కెట్లను ఇచ్చినట్టు తెలిసింది. ఈ బిస్కెట్‌ల విలువ 66 లక్షల 29 వేల 979 రూపాయలుగా లెక్క వేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను హైదరాబాద్‌కు తరలించారు.
థర్మల్ ఉద్యమ నేత సుగ్గుపై
జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు
శ్రీకాకుళం(టౌన్), మార్చి 10: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వ్యతిరేక ఉద్యమ నేత సుగ్గు రామిరెడ్డిని ఆరు నెలల పాటు జిల్లా నుండి బహిష్కరిస్తున్నట్టు జిల్లా ఎస్‌పి నవీన్ గులాటీ సోమవారం ప్రకటించారు. సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన సుగ్గు రామిరెడ్డిని థర్మల్ వ్యితిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఆయనను జిల్లా నుండి బహిష్కరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. రామిరెడ్డిపై 2005 సంవత్సరంలో పోలీసులు రౌడీషీటు తెరిచారని, ఆయనపై 37 క్రిమినల్ కేసులు సంతబొమ్మాళి, నౌపడ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులన్నీ ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్నాయన్నారు. కేసులు నమోదు చేసినప్పటికీ, ప్రవర్తనలో మార్పు రానందున ఆంధ్రప్రదేశ్ గూండా యాక్ట్ చట్టం కింద జిల్లా బహిష్కరణ శిక్షను కలెక్టర్ విధించారని ఎస్పీ తెలిపారు.
ల్యాబ్ సౌకర్యం అడిగితే
21 మంది విద్యార్థుల సస్పెన్షన్
మదనపల్లె, మార్చి 10: క్యాడ్ ల్యాబ్ లేకుండా పరీక్షలు ఎలా రాయాలి.. సిలబస్ పూర్తికాలేదు.. ఎలా చదువుకోవాలి.. అంటూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సివిల్ డిపార్ట్‌మెంట్ హెడ్‌ను ప్రశ్నించిన పాపానికి 21మంది విద్యార్థులు పరీక్షల నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ను వేడుకున్నారు. జిఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, మెకానికల్, ఇసిఇ గ్రూపులలో మూడుసంవత్సరాలకు చెందిన 360మంది విద్యార్థులున్నారు. ఒకే గ్రూప్ హెడ్ ఆధ్వర్యంలో తరగతులు జరుగుతున్నాయి. కళాశాలలో సివిల్ డిపార్ట్‌మెంట్‌కు ప్రధానంగా క్యాడ్‌ల్యాబ్ లేకుండా విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత కాలేకపోతున్నారు. ఇటీవల కళాశాలకు మంజూరైన నిధులతో క్యాడ్‌ల్యాబ్ ఏర్పాటుచేయాలని సివిల్ విద్యార్థులు హెడ్ సావిత్రిని కోరారు. దీంతో ఆమె కక్షగట్టి విద్యార్థుల హాజరుకోత వేయడంతో సహా పలు విధాలుగా వేధించడం మొదలుపెట్టారు. సోమవారం ల్యాబ్‌లేకపోతే పరీక్షలు ఎలా రాయాలంటూ హెడ్ సావిత్రిని విద్యార్థులు నిలదీయంతో ఆమె ఏకంగా 21మంది విద్యార్థులను పరీక్షల నుంచి సస్పెండ్ చేసి బయటకు వెళ్లండని ఆదేశించడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థులంతా ప్రిన్సిపల్‌ను ఆశ్రయించారు. అయినా సివిల్ హెడ్ పట్టించుకోకపోవడం... మంగళవారం తేది పరీక్షలకు ఆఖరి తేది కావడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించారు.

నల్లగొండ స్టేషన్‌లో ఆపి తనిఖీలు
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>