రాజమండ్రి, మార్చి 10: కొత్త పార్టీ విధి విధానాలను ప్రకటించడానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 12వ తేదీన రాజమండ్రి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. ఇసి ప్రకారం ప్రభుత్వ విద్యాసంస్థల మైదానాలను రాజకీయ పార్టీల ప్రచార సభలకు అనుమతించకూడదన్న ఉద్దేశ్యంతోనే అనుమతినివ్వటం లేదని జిల్లా కలెక్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. రాజమండ్రిలో 12న సభను ఏర్పాటుచేసి పార్టీ విధానాన్ని ప్రకటిస్తామని ప్రకటించిన తరువాత, ఈ నెల 7నే అమలాపురం ఎంపి హర్షకుమార్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సభ నిర్వహణకు అనుమతినివ్వాల్సిందిగా రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ అందించారు. ఈ లేఖను కళాళాల విద్యా కమిషనర్‌కు పంపించామని, అయితే ఆ లేఖను జిల్లా కలెక్టర్‌కు పంపించాల్సిందిగా కళాశాల విద్యా కమిషనర్ సూచించటంతో, మళ్లీ కలెక్టర్‌కు పంపించారు. దీనిపై కలెక్టర్ స్పందించి అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ నుండి ఈ లేఖ హర్షకుమార్‌కు ఆదివారం సాయంత్రం అందింది. దాంతో సోమవారం ఉదయం నుండి అప్పటి కప్పుడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మైదానాలను హర్షకుమార్, ఆయన అనుచరులు పరిశీలించారు. చివరకు ఆర్టీసీ కాంప్లెక్సు రోడ్డులోని జెమిని గ్రౌండ్స్ బహిరంగ సభకు అనువుగా ఉంటుందని గుర్తించి, అక్కడే ఏర్పాట్లు మొదలుపెట్టారు. సుమారు 15ఎకరాల్లోని ఈ స్థలాన్ని బహిరంగ సభకు అనువుగా మార్చుకునేందుకు కిరణ్ వర్గీయులు నానా తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను నిలిపివేసి, సామగ్రిని జెమిని గ్రౌండ్స్‌కు తరలించారు.
- జెమిని గ్రౌండ్స్‌కు మారిన వేదిక -
english title:
k
Date:
Tuesday, March 11, 2014