రాజమండ్రి, మార్చి 10: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేష్ మంగళవారం పోలవరం వెళ్లనున్నారు. రాజమండ్రి చేరుకుని, పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళతారు. మధ్యాహ్నానికి తిరిగి రాజమండ్రి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం కాకినాడ బయలుదేరి వెళతారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్రను పోషించటంతో పాటు, జిఒఎం సభ్యుడిగా వ్యవహరించిన జైరాం రమేష్ రాజమండ్రి వస్తున్నారని తెలుసుకున్న సమైక్యవాదులు అడుగడుగునా ఆయనకు నిరసన తెలపాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనేకసార్లు అడ్డంకులు సృష్టించింది కూడా జైరాం రమేషేనన్న ఆగ్రహంతో సమైక్యవాదులు ఉన్నారు. గతంలో ఓసారి సందర్శించటం పట్ల సీమాంధ్ర ప్రజలు ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ తరువాత నుండి ఆయన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వ్యవహరించటం మొదలుపెట్టారు. దాంతో అప్పటి నుండి జైరాంరమేష్‌పై పోలవరం ప్రాజెక్టును కోరుకుంటున్న ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఇన్‌ఫార్మర్ నెపంతో
సిఐటియు నేత హత్య
చింతూరు, మార్చి 10: ఖమ్మం జిల్లా చింతూరు మండలం తుమ్మల గ్రామానికి చెందిన సిఐటియు నేత పట్రా ముత్యం(45)ను ఇన్‌ఫార్మర్ నెపంతో ఆదివారం అర్థరాత్రి మావోయిస్టులు కాల్చిచంపారు. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేసే ఏ ఇన్‌ఫార్మర్‌కైనా ఇదే గతి పడుతుందని సంఘటనా స్థలంలో ఓ లేఖను వదిలివెళ్లారు. తుమ్మల బ్రాంచ్ పోస్టుమాస్టర్‌నూ పనిచేసే ముత్యం అలియాస్ మాలా భిక్షం తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని మావోలు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి చినభార్య జయమ్మ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న సుమారు 20మంది సాయుధ మావోయిస్టులు తలుపులుకొట్టి లోపలికి ప్రవేశించారు. నీతో మాట్లాడే పని ఉంది, బయటకు రా ముత్యం అంటూ మావోలు హెచ్చరించినట్లుగా అనడంతో కంగారుపడిన జయమ్మ, కొడుకు రమేష్ ఇక్కడే మాట్లాడాలని కోరారు. బయటకు తీసుకెళ్లవద్దని భార్య వారించగా ఆమెను పక్కకునెట్టేసి ముత్యంను, రమేష్‌ను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అనంతరం కొందరు మావోలు రమేష్‌ను అక్కడే కూర్చోబెట్టి ముత్యంను మరికొంత దూరం తీసుకెళ్లి చంపేశారు.