రాజమండ్రి, మార్చి 11: తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సజీవ దహనమైన వారిలో తట్టా మార్తమ్మ(48), బీర వసంత(28), శ్రీలక్ష్మి(18), వసంత కుమార్తెలు గ్రేషు(10), శ్రావణి(8) ఉన్నారు. తట్టా మార్తమ్మ కుమార్తె భర్తతో గొడవ పడి పిల్లలతో కలిసి వచ్చి తల్లి దగ్గర ఉంటోంది. పెద్ద కుమార్తె మార్తమ్మ, చిన్న కుమార్తె శ్రీలక్షి, పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో రాత్రి సుమారు ఒంటిగంటకు ఇంటికి నిప్పంటుకుంది. ఇంటి ముందు భాగంలో అద్దెకు ఉంటున్న తట్టా రాజేష్, వెంకటలక్ష్మి మంటలను చూసి భయంతో తమ కుమారుడిని తీసుకుని బయటకొచ్చారు. తమ దగ్గర బంధువులే అయిన మార్తమ్మ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చేందుకు రాజేష్, వెంకటలక్ష్మి ప్రయత్నించారు. తలుపు బలవంతంగా తోసి లోపలకు వెళ్లే సరికి కళ్ల ముందు ఏడేళ్ల సునంద కనిపించాడు. వెంటనే ఆ బిడ్డను తీసుకుని రాజేష్ బయటకు రాగానే ఇంటి కప్పు కూలిపోయింది. అప్పటికే భయంతో లోపల ఉన్న ఐదుగురు ఒకరినొకరు పట్టుకుని ఉన్నారు. బయటకు రమ్మని కేకలు వేసినా, బయటకు రాలేకపోయారు. చివరకు చూస్తుండగానే సజీవదహనమయ్యారు. ఈ సంఘటన అందర్నీ కలచివేసింది. మంటలను అదుపుచేసి లోపలకు వెళ్లి చూసేసరికి, ఐదుగురు ఒకరినొకరు పట్టుకుని మాంసపు ముద్దల్లా ఉన్నారు. మార్తమ్మ భర్త ముత్యాలరావు చర్చిలో వాచ్‌మేన్‌గా విధుల్లో ఉండటం వల్ల ప్రమాదం నుండి తప్పించుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
- తూర్పుగోదావరిలో ఘోర దుర్ఘటన-
english title:
eg
Date:
Wednesday, March 12, 2014