కాకినాడ, మార్చి 11: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంతమాత్రం లేదని, ఈ ప్యాకేజీ కేవలం కాంగ్రెస్ వలనే సాధ్యమైందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేష్ వ్యాఖ్యానించారు. 60 ఏళ్ళుగా సీమాంధ్రలో నెలకొనివున్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ విభజన ద్వారా పరిష్కరించిందన్నారు. ఇప్పుడు ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేసే బృహత్తర బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని, దీనిని తమ కర్తవ్యంగా భావిస్తున్నామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజుతో కలసి జైరాం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైరాంరమేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై బిజెపి పార్లమెంట్‌లో ఒకలా, రాజ్యసభలో మరోలా మాట్లాడిందన్నారు. తమ వల్లే సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని చెబుతున్న బిజెపి వాదనలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. సీమాంధ్రలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 16వేల కోట్ల వ్యయం అవుతుందని, అందులో కేంద్రం 14వేల కోట్ల నిధులను విడుదల చేస్తుందని చెప్పారు. సీమాంధ్రలో ఒక ఐఐటి, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఆరోగ్య విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, సీమాంధ్రకు కొత్త రైల్వేజోన్, చెన్నై నుండి విశాఖకు కోస్టల్ కారిడార్‌తో పాటు పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు రానున్నట్టు ఆయన తెలియజేశారు. పదేళ్ళలో సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో ముందుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఈ విషయంలో విద్యార్థులు అధైర్య పడొద్దని తెలిపారు. పదేళ్ళ పాటు ఇదే తరహా విద్యా విధానాలు అమలవుతాయన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగదని, దీనికి ప్రత్యేకంగా ఒక బోర్డును కేంద్రం ఆధీనంలో నియమిస్తుందని అది ఇరు ప్రాంతాలకు చెందిన రైతులకు నష్టం లేకుండా బచావత్, బ్రజేష్‌కుమార్ జల విధానాలను అమలు చేస్తుందన్నారు.
బిజెపి వాదనలను తోసిపుచ్చిన కేంద్ర మంత్రి
english title:
ramesh
Date:
Wednesday, March 12, 2014