రాజమండ్రి , మార్చి 11: సీమాంధ్రకు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం నిర్మించి తీరుతుందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోనవసరం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేష్ భరోసా ఇచ్చారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి వచ్చిన అనంతరం రాజమండ్రిలో విలేఖర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ తదితర అనుమతులను సాధించటంతో పాటు, నిర్మాణ పనులను పూర్తిచేయించే బాధ్యతను కూడా భారత ప్రభుత్వానికే అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచినట్టు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని 6మండలాలను పూర్తిగా, ఒక మండలాన్ని పాక్షికంగా విలీనం చేయాలన్న ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదించిందన్నారు. ముంపు మండలాల ఆర్డినెన్స్ జారీ తన చేతుల్లో లేదని, రాష్టప్రతి ఆర్డినెన్స్‌ను జారీచేస్తారని సమాధానం చెప్పారు. వందేళ్లయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదని కేంద్రమంత్రి బలరాం నాయక్ చెప్పలేదని జైరాంరమేష్ అన్నారు. దీనిపై తాను వివరణ కోరినపుడు, తానలా అనలేదని మంత్రి చెప్పారన్నారు. ముంపు బాధితులకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు.
తాను పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. సీమాంధ్రలో విలీనంచేసిన పాల్వంచ డివిజన్‌లోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు సీమాంధ్ర నుండి వెళ్లేందుకు అవసరమైన కనెక్టివిటీకి చర్యలు తీసుకుంటామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని అందమైన కైలాస భూమి ఉన్న రాజమండ్రిలో ప్రారంభించనున్నారని కేంద్రమంత్రి జైరాంరమేష్ అన్నారు. రాజమండ్రిలో గోదావరి గట్టున కైలాస భూమి పేరుతో అందమైన స్మశానవాటిక ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టే అందమైన స్మశానవాటికకు వెళుతుందన్న అర్ధంలో జైరాంరమేష్ పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీనికి విలేఖర్లు అభ్యంతరం వ్యక్తంచేసినపుడు, తాను హాస్యానికి అలా అన్నానని సర్దిచెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుండి కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఎంపిలు వెళ్లినప్పటికీ నష్టమేదీ లేదని జైరాంరమేష్ చెప్పారు. పాత వారు వెళ్లిపోవటం వల్ల 35 నుండి 50ఏళ్ల వయస్సున్న యువకులు ముందుకొచ్చి ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల పేర్లు చెబుతున్నపుడు చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ, ఆయన తమను చాలా సార్లు ఇబ్బందిపెట్టారన్నారు. కొన్ని సార్లు సమైక్యాంధ్ర అని, మరికొన్ని సార్లు హైదరాబాద్‌ను యుటి చేయాలంటూ బౌన్సర్లు వేసారన్నారు. అన్ని పార్టీలకు కాంగ్రెస్ పార్టీయే జన్మనిచ్చిందని, నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లినవారేనన్నారు.
===============
కేంద్ర పరిశీలనలో ‘పోలవరం’ ఎత్తు తగ్గింపు
పోలవరం, మార్చి 11: పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక మీటరు తగ్గిస్తే ముంపు ప్రాంతాలు ఎంత వరకూ తగ్గించవచ్చుననే విషయం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అయితే 45వేల కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయని, ఒక మీటరు తగ్గిస్తే ముంపు ప్రాంతాన్ని ఎంత తగ్గించవచ్చుననే విషయం ఇంజనీర్లను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణా ప్రాంత ప్రజల కలల ప్రాజెక్టు అని, ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించినట్లు మంత్రి జైరాం రమేష్ తెలిపారు. . ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను తూర్పుగోదావరి జిల్లాలో కలపడం జరుగుతుందని తెలిపారు. 300 టిఎంసిల నీరు నిలువ ఉండే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణా ప్రాంతం 45 టిఎంసిల నీరు వాడుకునే అవకాశం ఉంటుందన్నారు.
కాంగ్రెస్ నుంచే ప్రాంతీయ పార్టీలు పుట్టాయి: కేంద్ర మంత్రి జైరాం రమేష్
english title:
p
Date:
Wednesday, March 12, 2014