న్యూఢిల్లీ, మార్చి 12: డిమాండ్ల సాధనలో భాగంగా బుధవారం ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక సంస్థ కోల్ ఇండియా ఉద్యోగులు మూడు రోజుల సమ్మె నోటీసును ఇచ్చారు. గురువారం నుంచి శనివారం వరకు ఉద్యోగులు విధులను బహిష్కరిస్తున్నారు. కొత్త పెన్షన్ పథకంతోపాటు పనికితగ్గ వేతనం వంటి డిమాండ్లతో ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. కాగా, ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కోల్ ఇండియా పెట్టుకున్న 482 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం నెరవేరడం కష్టతరంగా మారనుంది. కోల్ ఇండియాలో 18,000 ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటుండగా, మూడు రోజుల విధుల బహిష్కరణతో 4 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఆగిపోనుంది. ఇదిలావుంటే సమ్మెపై స్పందించేందుకు కోల్ ఇండియా సిఎండి ఎస్ నర్సింగ్ రావు నిరాకరించారు.
ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్లు
ముంబయి, మార్చి 12: ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎడాపెడా ఆఫర్లను ప్రకటిస్తుండటంతో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా సైతం అదేదారిలో నడవడం ప్రారంభించింది. ఇందులోభాగంగానే స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు ప్రకటించిన ఆఫర్ వ్యవధిలోనే 60 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే ఢిల్లీ-ముంబయి టిక్కెట్ 3,881 రూపాయలేనని, 30 రోజుల ముందు బుక్ చేసుకుంటే 4,983 రూపాయలని ఎయిరిండియా బుధవారం ప్రకటించింది. జనవరి నుంచి మొదలైన ఆఫర్ల యుద్ధంలో ఈ ఆఫర్ నాలుగోది.
మహింద్ర ఇంజినీరింగ్
విలీనానికి టెక్ మహింద్రకు అనుమతి
ముంబయి, మార్చి 12: టెక్ మహింద్రలో మహింద్ర ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ విలీనానికి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఆమోదం తెలిపాయి. నవంబర్‌లోనే ఈ విలీనానికి టెక్ మహింద్ర, మహింద్ర ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిడెడ్ బోర్డులు అంగీకరించాయి. ఈ క్రమంలో బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలు తాజాగా అనుమతినిచ్చాయి.