న్యూఢిల్లీ, మార్చి 12: ఉల్లిగడ్డ, బంగాళదుంప ధరలు శాంతించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టానికి తగ్గింది. గత నెలలో 8.1 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 8.79 శాతంగా ఉంది. బుధవారం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం కూరగాయల ధరలు జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో 21.91 శాతం నుంచి 14.04 శాతానికి పడిపోయాయి. అలాగే ఆహారం, శీతల పానియాల ధరలు 9.9 శాతం నుంచి 8.57 శాతానికి, గుడ్లు, చేపలు, మాంసం ధరలు 11.69 శాతం నుంచి 9.69 శాతానికి దిగివచ్చాయి. తృణధాన్యాల ధరలు కూడా 11.42 శాతం నుంచి 9.93 శాతానికి తగ్గాయి. అయితే పాలు, దాని ఆధారిత ఉత్పత్తుల ధరలు మాత్రం జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో 9.82 శాతం నుంచి 10.37 శాతానికి ఎగబాకాయి. పండ్ల ధరలు సైతం పెరిగాయి.
వడ్డీరేట్లను తగ్గించాలి
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యవిధాన సమీక్షలను చేస్తున్న రిజర్వ్ బ్యాంకు ఇకనైనా కీలక వడ్డీరేట్లను తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 1న జరిపే ద్రవ్యసమీక్షలో ఫిబ్రవరి ద్రవ్యోల్బణ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని వడ్డీరేట్లను తగ్గిస్తే పారిశ్రామిక రంగాభివృద్ధికి దోహదం చేసినట్టవుతుందని చెబుతున్నాయి. అధిక వడ్డీరేట్ల కారణంగా పారిశ్రామిక ప్రగతి మందగించి పెట్టుబడులు రావడం లేదని, కొనుగోళ్లపై వినియోగదారులు దృష్టి పెట్టడం లేదని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గినందున వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్‌బిఐని కోరారు. తయారీ రంగపైనా అధిక వడ్డీరేట్ల ప్రభావం పడుతోందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ కోరారు. అలాగే కీలక వడ్డీరేట్లు తగ్గితే పారిశ్రామికరంగ కార్యకలాపాలను ప్రోత్సహించినట్లవుతుందని పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శరద్ జైపురియా అన్నారు.
ఫిబ్రవరిలో 8.1 శాతానికి చేరిక * 25 నెలల కనిష్టానికి గణాంకాలు
english title:
s
Date:
Thursday, March 13, 2014