న్యూఢిల్లీ, మార్చి 12: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్‌కు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే చమురు శాఖ మంత్రి పదవిని మణి శంకర్ అయ్యర్, ఎస్ జైపాల్ రెడ్డి కోల్పోయారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖండించింది. ఆమ్ ఆద్మీ ఆరోపణలు పూర్తిగా వాస్తవ విరుద్ధమన్న ఆ సంస్థ.. మాపై దుష్ప్రచారం చేసేందుకు ఆమ్ ఆద్మీ ఈ తరహా ప్రకటనలు చేస్తోందని పేర్కొంది. కాగా, కెజి-డి6 పెట్టుబడి వ్యయాన్ని 2.5 రెట్లు పెంచాలన్న రిలయన్స్ చర్యను వ్యతిరేకించి మణి శంకర్ చమురు శాఖ మంత్రి పదవికి దూరమయ్యారని ఆమ్ ఆద్మీ ఆరోపించింది. అయితే కెజి-డి6 అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పెట్టుబడి వ్యయాన్ని 8.8 బిలియన్ డాలర్లకు పెంచాలంటూ తాము ప్రతిపాదించింది 2006 అక్టోబర్‌లో అని, మణి శంకర్ అయ్యర్ 2006 జనవరిలో చమురు శాఖ మంత్రి పదవిని వీడారని రిలయన్స్ గుర్తుచేసింది. అలాగే రిలయన్స్ కోసం గ్యాస్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకించడం వల్లే జైపాల్ రెడ్డి చమురు శాఖ మంత్రిగా వైదొలగాల్సి వచ్చిందని ఆప్ ఆరోపించగా, రంగరాజన్ కమిటీ 2012 మేలో ఏర్పడటానికి కారణమే జైపాల్ రెడ్డి చేసిన విజ్ఞప్తి అని, ఆ కమిటీ 2014 ఏప్రిల్ నుంచి గ్యాస్ ధరలను పెంచాలని సిఫార్సు చేసిందని, దీనికి సిసిఇఎ ఆమోదం కూడా లభించిందని రిలయన్స్ తెలియజేసింది.
సుబ్రతా రాయ్ విడుదల
పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ, మార్చి 12: నిబంధనలకు విరుద్ధంగా మదుపర్ల నుంచి వేల కోట్ల రూపాయల నిధులను సేకరించారన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటూ జైలుపాలైన సహారా అధినేత సుబ్రతా రాయ్ విడుదలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరపనుంది. గురువారం మధ్యాహ్నం ఈ విచారణ జరుగుతుందని సుప్రీం బుధవారం స్పష్టం చేసింది. ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసం సుబ్రతా రాయ్ నిర్భందానికి జారి చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ బుధవారం ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. కెఎస్ రాధాకృష్ణన్, జెఎస్ ఖెహర్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 4న సుబ్రతా రాయ్‌తోపాటు మరో ఇద్దరు సహారా గ్రూప్ డైరెక్టర్లను తీహార్ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. మదుపర్లకు 20,000 కోట్ల రూపాయల మేర తిరిగి చెల్లించాల్సిన కేసులో సుబ్రతా రాయ్‌కి ఈ సమస్యలు వచ్చిపడ్డాయి. సహారా గ్రూప్ లోని 2 సంస్థలు మార్కెట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధులు సేకరించాయని సెబీ ఆరోపిస్తోంది.