న్యూఢిల్లీ, మార్చి 12: పారిశ్రామిక రంగంలో అడుగంటిన వృద్ధి మళ్లీ పైకి లేస్తున్న సంకేతాలు వచ్చాయి. వరుసగా మూడు నెలలపాటు కనుమరుగైన వృద్ధిరేటు జనవరిలో స్వల్పంగా చిగురించింది. 0.1 శాతంగా నమోదై పారిశ్రామిక రంగంలో కొంగొత్త ఆశా కిరణాలను ప్రసరింపజేసింది. అధిక విద్యుత్ ఉత్పాదన, గనుల రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం వంటి జనవరిలో పారిశ్రామిక ప్రగతి గణాంకాలను స్వల్పంగా పెంచేందుకు దోహదపడ్డాయి. అయితే తయారీ రంగం మాత్రం ఇంకా కోలుకోలేదు. ఇదిలావుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి మధ్య పారిశ్రామిక ప్రగతి 1 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇది 1 శాతంగానే ఉండటం గమనార్హం. ఇక తాజా ఐఐపి గణాంకాలపై ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు మండలి చైర్మన్ సి రంగరాజన్ మాట్లాడుతూ ‘అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఫిబ్రవరి-మార్చి వ్యవధిలో తయారీరంగ కార్యకలాపాలు చెప్పుకోదగ్గస్థాయిలో పుంజుకునేందుకు కృషి జరగాల్సి ఉంది.’ అన్నారు. ఇదిలావుంటే గత ఏడాది జనవరిలో ఐఐపి గణాంకాలు 2.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా పారిశ్రామిక ప్రగతి క్షీణిస్తూ రాగా, జనవరిలో మాత్రం పెరిగినట్లు బుధవారం కేంద్ర గణాంక కార్యాలయం (సిఎస్‌ఒ) విడుదల చేసిన గణాంకాలతో స్పష్టమైంది. ఇకపోతే విద్యుత్ ఉత్పత్తి గత ఏడాది జనవరితో పోల్చితే ఈ జనవరిలో 6.4 శాతం నుంచి 6.5 శాతానికి వృద్ధి చెందింది. గనుల కార్యకలాపాల్లోనూ వృద్ధిరేటు మైనస్ 1.8 శాతం నుంచి 0.7 శాతానికి పెరిగింది. అయితే తయారీ రంగంలో మాత్రం వృద్ధిరేటు 2.7 శాతం నుంచి 0.7 శాతానికి క్షీణించింది. దీంతో తయారీ రంగం వృద్ధికి ప్రభుత్వం, ఆర్‌బిఐ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న విజ్ఞప్తులు పారిశ్రామిక రంగం నుంచి వినిపిస్తున్నాయి.
మూడు నెలల తర్వాత మళ్లీ వృద్ధి * జనవరిలో 0.1 శాతంగా నమోదు
english title:
c
Date:
Thursday, March 13, 2014