న్యూఢిల్లీ, మార్చి 12: గత రెండేళ్లుగా ఇన్ఫోసిస్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి బుధవారం అన్నారు. సంస్థ పనితీరు అతిగా సంతోషించే స్థాయిలో లేదన్నారు. సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాలు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పుంజుకోగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం సంస్థ ఆదాయం తక్కువగానే ఉండొచ్చని ఇన్ఫోసిస్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌డి శిబులాల్ అన్నారు. నాలుగో త్రైమాసికం లో రిటైల్, సిపిజి విభాగాల్లో మందగమనాన్ని చవిచూస్తున్నామని, క్లయిం ట్లు వ్యయ నియంత్రణపై ఆసక్తి ప్రదర్శిస్తుండటంతో వ్యాపారంపై వచ్చే రెవిన్యూ పడిపోయే వీలుందని చెప్పారు. ఇక ఇన్ఫోసిస్ అభివృద్ధికి ఇన్నాళ్లూ తోడ్పడిన సీనియర్లు ఒక్కొక్కరుగా దూరమవడం కూడా ప్రస్తుతం సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతోంది. గత నెలలో మూర్తి మదుపర్లతో మాట్లాడుతూ ఏడాది వ్యవధిలో మరో ముగ్గురు సీనియర్లు సంస్థకు దూరం కానున్నారని చెప్పారు. అందులో శిబులాల్ 2015 మార్చిలో పదవీ విరమణ చేయనుండగా, సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్ గోపాలకృష్ణన్, వైస్ చైర్మన్ శ్రీనాథ్ బట్ని నవంబర్‌లో వెళ్లిపోనున్నారు. కాగా, శిబులాల్ వైదొలిగిన తర్వాత ఆ స్థానంలో కొత్త సిఇఒను మూర్తి ప్రకటించనున్నారు. దేశీయ ఐటి రంగంలో టిసిఎస్ తర్వాత ఇన్ఫోసిస్ రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూర్తి పదవీ విరమణ అనంతరం సంస్థ ప్రదర్శన దిగజారడంతో బోర్డు సభ్యులు, మదుపర్ల కోరిక మేరకు మూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.
* గత రెండేళ్ల ఇన్ఫోసిస్ పనితీరుపై నారాయణ మూర్తి పెదవి విరుపు
english title:
a
Date:
Thursday, March 13, 2014