
ముంబయి, మార్చి 12: స్టాక్‌మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం మనీ లాండరింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిబంధనలను కఠినతరం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు స్టాక్‌మార్కెట్లను ఓ ఆర్థిక వనరుగా ఉపయోగించడంపైనా దృష్టిపెట్టిన సెబీ.. ఆ దిశగా కూడా చెక్‌పెట్టేందుకు నిబంధనావళిని సవరించింది. తమతమ క్లయింట్ల రిస్క్ అసెస్‌మెంట్ వివరాలను తెలుసుకోవాలని మార్కెట్‌లోని ఆయా సంస్థలను కోరింది. అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన వివరాలపైనా కనే్నసిన సెబీ.. కొత్త నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్ స్థాయి నియామకాలు జరపాలని, ఆర్నెళ్లకోసారి తప్పకుండా అంతర్గత ఆడిటింగ్ చేయాలని సంస్థలకు సూచించింది. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో సెబీ కొత్త నిబంధనలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సెబీ.. మదుపర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది.