కోల్‌కతా, మార్చి 12: విజయ్ హజారే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్‌కు షాకిచ్చిన రైల్వేస్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ గట్టిపోటీని ఇవ్వలేకపోయిన పంజాబ్ 137 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 47.5 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. మహేష్ రావత్ 108 పరుగులతో రాణించగా, రొనె్సన్ జొనాథన్ 58 పరుగులు సాధించాడు. పంజాబ్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 47 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, రైల్వేస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, అతను కల్పించిన అవకాశాన్ని పంజాబ్ బౌలర్లలో ఎవరూ సద్వినియోగం చేసుకోలేకపోయారు. కాగా, 243 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 33.4 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. తరువార్ కోహ్లీ అజేయంగా 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో నిలబడడానికి ఇష్టం లేనట్టు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పంజాబ్‌కు పరాభవం తప్పలేదు. సర్వీసెస్ బౌలర్లలో ఆశిష్ యాదవ్ 12 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టాడు. అనురీత్ సింగ్ 26 పరుగులకు రెండు, కృష్ణకాంత్ ఉపాధ్యాయ 14 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు. పంజాబ్‌ను ఎవరూ ఊహించని రీతిలో చిత్తుచేసిన సర్వీసెస్ సెమీ ఫైనల్స్‌లో బలమైన బెంగాల్‌ను ఢీ కొనేందుకు సిద్ధమవుతోంది. సుమారు రెండు నెలల క్రితం జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఈరెండు జట్లు ఇదే వేదికలో తలపడ్డాయి. ఆ సమయంలో ‘మన్కడింగ్’కు పాల్పడిన మురళీ కార్తీక్ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విజయ్ హజారే టోర్నీ సెమీ ఫైనల్‌లో మరోసారి ఈ రెండు జట్లే తలపడనున్న నేపథ్యంలో, పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అభిమానుల్లో చోటు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభా గాలతో పోలిస్తే రైల్వేస్ ఫీల్డింగ్ విభాగంలో పటిష్టంగా ఉం ది. అద్వితీయమైన ఫీల్డింగ్ ఈ జట్టుకు అదనపు బలంగా చెప్పుకోవాలి. కాగా, సొంత గడ్డపై మ్యాచ్ ఆడుతున్న బెం గాల్‌కు అభిమానుల మద్దతు లభించడం ఖాయం. అయ తే, అదే సమయంలో అభిమానుల అంచనాలకు తగ్గట్టు రాణించాలన్న ఒత్తిడి ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశా లు లేకపోలేదు.
చాంపియన్స్ లీగ్ సాకర్
క్వార్టర్స్‌లో బయెర్న్, అట్లెటికో
పారిస్, మార్చి 12: డిఫెండింగ్ చాంపియన్ బయెర్న్ మ్యూనిచ్, అట్లెటికో మాట్రిడ్ జట్లు చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్ చేరాయి. గత రెండేళ్లు వరుసగా ఫైనల్ చేరిన బయెర్న్ మరోసారి ఫైనల్‌లో స్థానం సంపాదించే దిశగా అడుగు ముందుకేస్తున్నది. ఈ క్రమంలోనే ఆర్సెనెల్‌తో జరిగిన మ్యాచ్‌ని డ్రా చేసుకొని, క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి. బయెర్న్ తరఫున బాస్టియన్ ష్వెన్‌స్టెర్‌జర్ గోల్ చేస్తే, ఆర్సెనెల్‌కు లుకాస్ పొడొల్‌స్కీ ఈక్వెలైజర్‌ను అందించాడు. మరో మ్యాచ్‌లో అట్లెటికో మాడ్రిడ్ 4-1 ఆధిక్యంతో మిలాన్‌పై ఘన విజయం సాధించి, క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. అట్లెటికో విజృంభణకు మిలాన్ సమాధానం ఇవ్వలేకపోయంది.