కరాచీ, మార్చి 12: పాకిస్తాన్ జాతీయ జట్టుకు కోచ్ పదవిని స్వీకరించడానికి తాను సిద్ధంగా లేనని మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ స్పష్టం చేశాడు. పాక్ కోచ్‌గా వ్యవహరించడం సులభం కాదని ఒక ఇంటర్వ్యూలో అతను తెలిపాడు. గౌరవప్రదంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని అనుకుంటున్నానని, అందుకే కోచ్ పదవిని తాను చేపట్టబోనని యూనిస్ ఖాన్ అన్నాడు. భవిష్యత్తులో పాక్ కోచ్‌గా అతనిని నియమించే అవకాశాలు ఉన్నాయని పాక్ మీడియాలో కతనాలు వచ్చాయి. వీటిపై అతను స్పందిస్తూ, దేశానికి తాను శక్తి వంచన లేకుండా ఉత్తమ సేవలు అందించడానికి ప్రయత్నించానని చెప్పాడు. అందుకు ప్రతిఫలంగా లక్షలాది మంది ఆదరాభిమానాలను, పేరుప్రఖ్యాతులను పొందానని అన్నాడు. తనకు పాక్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, దీనిని పణంగా పెట్టి కోచ్‌గా బాధ్యతలు స్వీకరించబోనని తెగేసి చెప్పాడు. నిజానికి కోచ్‌గా తాను పనికిరానని అన్నాడు. మళ్లీ పాక్ జట్టులోకి వస్తారా? కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తారా? అన్న ప్రశ్నలకు యూనిస్ ఖాన్ నేరుగా సమాధానం చెప్పలేదు. భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా జరగవచ్చని అన్నాడు. ఇప్పటికే టి-20 ఫార్మెట్ నుంచి వైదొలగిన తాను సరైన సమయంలో కెరీర్‌కు గుడ్‌బై చెప్తానని అన్నాడు. ఇప్పటికీ తాను వనే్డ ఫార్మెట్‌లో రాణించగలనని, హనీఫ్ మహమ్మద్, ఇంజమాముల్ హక్ తర్వాత టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన పాక్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించిన యూనిస్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. అవకాశం లభిస్తే శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటానని అన్నాడు. వచ్చే ఏడాది ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సంయక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయంపై అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ, టోర్నీ ఎక్కడ జరిగినా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తనకు మ్యాచ్‌లు ఎక్కడ ఆడుతున్నామన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశాడు. స్వతఃసిద్ధమైన ఆటను కొనసాగించాలని, బ్యాటింగ్ శైలిని మార్చుకోవద్దని తనకు అత్యంత సన్నిహితుడు, సహచరుడు షాహిద్ అఫ్రిదీకి హితవు పలికాడు. అఫ్రిదీ వేగంగా పరుగులు చేయాలని, సిక్సర్లు సాధించాలని అభిమానులు కోరుకుంటారని అన్నాడు. అతని నుంచి వేరే విధమైన ఆటను ఊహించడం కష్టమని పేర్కొన్నాడు.
పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ స్పష్టీకరణ
english title:
c
Date:
Thursday, March 13, 2014