కరాచీ, మార్చి 12: ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టుకు ధైర్యం, తెగువ గలిగి, ఎలాంటి నిర్ణయాన్నయనా తీసుకోగల దమ్మున్న కెప్టెన్ అవసరమని, 2015 ప్రపంచ కప్ నాటికి ఆ లక్షణాలు ఉన్న నాయకుడిని పిసిబి నియమించాలని కోరుకుంటున్నానని మాజీ పేసర్ వసీం అక్రం అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, దూకుడుగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గల నాయకుడు ఉంటేనే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ముందంజ వేయగలుగుతందని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రస్తుత కెప్టెన్ మిస్బా ఉల్ హక్ సామర్థ్యంపై అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశాడు. బ్యాట్స్‌మన్‌గా మిస్బాను ఎవరూ తక్కువ అంచనా వేయలేరని అక్రం అన్నాడు. అయితే, అతనిలో నాయకత్వ లక్షణాలు ఎంత వరకూ ఉన్నాయన్నదే అనుమానమని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ పోటీల్లో పాక్ జట్టుకు షాహిద్ అఫ్రిదీ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు అతను నేరుగా సమాధానం చెప్పలేదు. అయితే, దూకుడుగా వ్యవహరించే లక్షణం ఉన్న నాయకుడు పాక్‌కు అవసరమంటూ, పరోక్షంగా అఫ్రిదీ పేరును బలపరిచాడు. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ జట్టు కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకుందని అభిప్రాయపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని మిస్బా పొరపాటు చేశాడని అన్నాడు. ఆ టోర్నీలో అప్పటి వరకూ కీలక విజయాలను సాధించిన విధానాన్ని పక్కకుపెట్టి, శ్రీలంకపై ముందు బ్యాటింగ్‌ను ఎంచుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, టి-20 వరల్డ్ కప్ పోటీల్లో టైటిల్‌ను సాధించే అవకాశాలు పాకిస్తాన్, భారత్, వెస్టిండీస్ జట్లకే ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. పాక్ జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికైనా ఫాస్ట్ బౌలర్లను సక్రమంగా ఉపయోగించుకోవాలని సలహా చెప్పాడు. జునైద్ ఖాన్ సేవలను జట్టు సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నదని అన్నాడు. ప్రస్తుతం పాక్ జట్టులోని ఉత్తమ బౌలర్లలో జునైద్ ఒకడని, అతనికి సరైన గుర్తింపు ఇవ్వకుండా జట్టు మేనేజ్‌మెంట్ పొరపాటు చేస్తున్నదని చెప్పాడు. పొరపాట్లు సవరించుకుంటే, టి-20 ప్రపంచ కప్, 2015 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీల్లో పాక్ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని జోస్యం చెప్పాడు. జట్టు మేనేజ్‌మెంట్ ఈ దిశగా దృష్టి సారించాలన్నాడు.
పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రం
english title:
d
Date:
Thursday, March 13, 2014