మచిలీపట్నం (కల్చరల్), మార్చి 15: ఈ నెల 16న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎపి టెట్) విజయవాడలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి దేవానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి 12గంటల వరకు తొమ్మిది కేంద్రాల్లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5గంటల వరకు 67 కేంద్రాల్లో పేపర్-2 పరీక్ష ఉంటాయన్నారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 12 మంది రూట్ అధికారులు, 748 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
కమనీయం..
మల్లేశ్వరుని కల్యాణం
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 15: స్థానిక బచ్చుపేట శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణం కన్నులపండువగా జరిగింది. పోపూరి శ్యామ్‌ప్రసాద్ దంపతులు భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణ కార్యక్రమాన్ని ముట్నూరి దుర్గా నాగేశ్వర శాస్ర్తీ నేతృత్వంలో రాళ్ళపల్లి ఆంజనేయ శాస్ర్తీ బ్రహ్మత్వంలో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి శ్రీనివాసరావు, వంశపారంపర్య ధర్మకర్త ఎం రవికాంత్, అన్నంభొట్ల బ్రహ్మానంద శాస్ర్తీ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఉడాలో అవినీతి వృక్షాలు!
విజయవాడ (క్రైం), మార్చి 15: కొందరు లాంచావతారాలకు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటి (ఉడా) కేరాఫ్ అడ్రస్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ అరోపణలు ఇప్పటివి కావు. గతంలో కూడా పలువురు అధికారులు, ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన దాఖలాలు లేకపోలేదు. మరోవైపు కార్యాలయ కార్యకలాపాలపై అవినీతి ఆరోపణలు నిత్యకృత్యమే. అందినకాడికి లంచాలు దండుకోవడంలో కొందరు ఉద్యోగులు అందె వేసిన చేయి అనడానికి తాజా ఘటనే అద్దం పడుతోంది. ఓ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్స్‌మెన్‌ను శనివారం ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉడా పరిధిలోని ఏ కార్యకలాపాలైనా చక్కబెట్టాలన్నా, కాంట్రాక్టర్లకు అనుకూలంగా పనులు జరగాలంటే చేయి తడపాల్సిందే. ఒక్క ఉడాలోనే కాదు, పలు ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తీరు. విద్యుత్‌శాఖ, పోలీసు, ఎక్సైజ్, రెవిన్యూ, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, వాణిజ్య పన్నుల విభాగం తదితర విభాగాల్లో ఇప్పటికే ఏసిబి అధికారులు కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. ఆయా శాఖల్లో లంచాలు మరిగి బల్ల కింద చేతులు పెట్టే అధికారులపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే వలపన్ని పట్టుకున్న దాఖలాలు గతంలో మెండుగా ఉన్నాయి. ఇలా ప్రభుత్వ శాఖల జాబితాలోనే ఉడా సంస్థ కూడా ఎప్పుడో చేరిపోయింది. అవినీతి మరకలు ఉడా గోడలపై దర్శనమిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. కార్యాలయంలో పని చేసే మెజార్టీ అధికారులు, ఉద్యోగుల తీరే ఇదని, ఇక వీరిని కట్టడి చేసేదెవరనే వ్యాఖ్యలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఏసిబి అధికారులకు అందిన ఫిర్యాదుపై కొరఢా ఝుళిపించడంతో ఉడాలో కలకలం రేగింది. ఇదే తరహా మరికొందరి లంచాలు మెక్కే అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఇబ్రహీంపట్నం శ్రీనివాస క్రషర్స్ నిర్వహకునికి ఎన్‌ఓసి జారీ చేసేందుకు ఉడా ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్స్‌మెన్ పి మధుసూదనరావు లక్షన్నర డిమాండు చేయడం గమనార్హం. సిద్ధార్ధ కాలనీ ఆరోలైన్‌కు చెందిన సాయిబాబారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏసిబి అధికారులు డిఎస్పీ ఆర్ విజయపాల్ నేతృత్వంలో సిఐలు నాగరాజు, శ్రీనివాస్, రవి తదితర బృందం శనివారం ఉడా కార్యాలయంలో లంచం తీసుకుంటున్న మధుసూదనరావును వలపన్ని పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ తెలిపారు. ఒక్క ఉడా కాకుండా, జిల్లాలోని ఏ ప్రభుత్వ శాఖలోనైనా, ఏ ప్రభుత్వ అధికారి, ఉద్యోగైనా ఎవరినుంచైనా లంచం అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఇందుకుగాను 94404 46164, 69, 33, 67 తమ ఫోన్‌నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.