విజయవాడ, మార్చి 15: త్వరలో మున్సిపల్ మరియు ప్రాదేశిక నియోజకవర్గాలకు నిర్వహించనున్న ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి పి రమాకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ముందస్తుగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ స్టేషన్లు అవసరం ఉన్న ఏడల తగు ప్రతిపాదనలను వెంటనే పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. సాధారణ ఎన్నికల తరహాలోనే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తింపు చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలన్నారు. పరీక్షల నిర్వహణలోవున్న మున్సిపల్, ఇతర పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించే సందర్భంలో ఆయా భవనాలను 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకల్లా స్వాధీనం చేసుకోవడానికి ముందస్తుగానే సామగ్రి, సిబ్బంది తదితర తరలింపులకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గతంలో ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా నిర్ణయించాలని, అంతేకాక ఎక్కువ మంది ఓటర్లు పాల్గొనే పోలింగ్ కేంద్రాల పట్ల సెక్యూరిటీ ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. సాధారణ పోలింగ్ కేంద్రాలకు 1+10+2 తరహాలోను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో 1+3, అత్యంత సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలలో 1+4 విధానంలో బందోబస్తు ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు సూచించారు. జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసామని, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను మార్చే దిశగా రాజకీయ పార్టీలతో చర్చించి ప్రదేశం మార్పుకు చెందిన నివేదికను తమ ఆమోదం కోసం పంపుతామని తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్లు, ఓటర్ లిస్టుల పబ్లికేషన్లకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలకు సంబంధించి అదనంగా వెయ్యికుపైగా బ్యాలెట్ బాక్సులు అవసరం ఉందని, ఇందుకు సంబంధించి సమక్ర నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని కలెక్టర్ తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉడా విపి పి ఉషాకుమారి, జాయింట్ కలెక్టర్ జె మురళి, నగర పోలీసు కమిషనర్ బి శ్రీనివాసరావు, ఎస్పీ జె ప్రభాకరరావు, ట్రైనీ జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీ్ధర్, మున్సిపల్ కమిషనర్ సి హరికిరణ్, సబ్ కలెక్టర్ డి హరిచందన, జడ్‌పి సిఇఓ డి సుదర్శన్, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, కలెక్టరేట్, మున్సిపల్, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాళ్లరిగేలా తిరిగా...
కోట్లు కుమ్మరించా!
* వైకాపా అధినేత తీరుపై శీలం ఆవేదన
* రక్షణనిధికి తిరువూరు వైకాపా టికెట్?
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 15: సాధారణ ఎన్నికలు తరుముకొస్తుంటే వివిధ రాజకీయ పక్షాల్లో వివాదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. అసలు అధికారపక్ష కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే నాథుడే కన్పించకపోతే తెలుగుదేశం, వైకాపాల తరపున అనూహ్య రీతిలో పోటీ నెలకొంటున్నది. ఎస్‌సి రిజర్వ్ తిరువూరుకు తోట్లవల్లూరు జడ్‌పిటిసి మాజీ సభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి సమన్వయకర్తగా నియమించనున్నారని తెలిసింది. దీనికి వీరి సమీప బంధువు ఆదాయపు పన్ను శాఖ అధికారి పావులు కదుపుతున్నారని తెలిసింది. ముందస్తుగా ఈ సమాచారం తెలిసిన వెంటనే ఇప్పటి వరకు ఈ సీటు ఆశించిన దళిత ఎన్‌ఆర్‌ఐ శీలం రాజా దిగ్భాంతికి గురై పార్టీలో తన పదవులన్నింటితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. 1995లో అమెరికా వెళ్లి అక్కడ స్థిరబడ్డ రాజా వైఎస్ పట్ల గల అభిమానంతో ఆయన ఆశయసాధన నిమిత్తం జగన్‌తో కలిసి పని చేసేందుకుగాను అక్కడి వైట్ కాలర్ జీవితాన్ని, అమెరికా పౌరసత్వాన్ని వదలుకొని 2010లో స్వదేశానికి వచ్చానన్నారు. పెనమలూరుకు చెందిన రాజా ఎస్‌సి రిజర్వ్ తిరువూరు నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. జగన్‌తో సన్నిహితంగా మెలుగుతూ ఆయనతోపాటు ఓదార్పు యాత్రలోనూ, ఉప ఎన్నికల్లోనూ, దీక్షలల్లోనూ, ధర్నాల్లోనూ, షర్మిల మరో ప్రజాస్థానంల్లోనూ క్రీయాశీలకపాత్ర వహించానన్నారు. అలాగే తిరువూరులో నిస్తేజంగా ఉన్న పార్టీ అభివృద్ధికి అవిరళ కృషి చేసినట్టు రాజా చెప్పారు. తాజాగా సమన్వయకర్తగా నియామకం కోసం ఐదు కోట్లు డిమాండ్ చేసారంటూ శనివారం మీడియా ఎదుట బోరున విలపిస్తూ తెలిపారు. ఇప్పటికే తాను ఆరుకోట్ల రూపాయలుపైగా నష్టపోయానని అన్నారు. కేవలం దళితుడనే చిన్న చూపుతో అడిగినంత ముట్టచెప్పలేదనే కక్షతో తన కష్టానికి, తన త్యాగానికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ వాపోయారు. జగన్‌ను హీరోను చేసిందీ, వైఎస్‌ను దేవుడుని చేసింది వైఎస్ విగ్రహావిష్కరణలలో గిన్నిస్ బుక్‌లో రికార్డు కెక్కడానికి దళితులు, క్రైస్తవులు మాత్రమేనన్నారు. అసలు ఈ వర్గాల కోసం తాము గెలిస్తే ఏమి చేస్తామన్నది ఎన్నికల ప్రణాళికలలో పొందుపరచలేదని దీని వల్ల వైకాపా నేతలు దళితులు క్రైస్తవుల ఓటు అడిగే నైతికత కోల్పోయారని శీలం రాజా అన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన క్రైస్తవ సోదరి కుమారి ఎస్తేర్ అనూహ్య దారుణ హత్యకు గురైతే జగన్‌లేదా విజయమ్మగాని వారి కుటుంబ సభ్యులుగాని ఏ ఒక్కరు నేటికి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవటం చూస్తే క్రైస్తవుల పట్ల వారి కపట ప్రేమ ఏమిటో ఇట్టే తేటతెల్లమవుతున్నదన్నారు.
బాధ్యతగా ప్రాదేశిక ఎన్నికలు
రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ రఘునందనరావు ఆదేశం
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 15: జిల్లాలో త్వరలో జరిగే మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలను సక్రమంగా, సజావుగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎలక్షన్ అథారిటీ అధికారి ఎం రఘునందనరావు పేర్కొన్నారు. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నిర్వహణపై నియమింపబడిన రిటర్నింగ్ అధికారులకు నగరంలోని కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ రఘునందనరావు మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎన్నికల ముగింపు వరకూ రిటర్నింగ్ అధికారులే బాధ్యతగా వ్యవహిరించి ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచడమైందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం, నియమనిబంధనలపై రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. మండల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉన్నాయో, లేదో అన్న విషయాలను పరిశీలించాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మకగా ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్లు ప్రక్రియ జరుగుతుందని, 21వ తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ నుంచి అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్, 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ బిఎల్ చెన్నకేశవరావు, జెడ్‌పి సిఇఓ డి సుదర్శన్, డిపిఒ ఆనంద్ తదితరులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను వివరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ సి హరికిరణ్, సబ్ కలెక్టర్ డి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
వద్దన్నా వదిలిపెట్టడం లేదు!
పాపం... కాంగ్రెస్ అభ్యర్థులు!
పాతబస్తీ, మార్చి 15: సార్ నాకు కాంగ్రెస్ అభ్యర్థిగా సీటు ఇచ్చారు... ఏం చేయాలో అర్ధం కావడం లేదు... ఎవ్వరూ ముందుకు రాకుంటే కాంగ్రెస్ నాయకులు నన్ను బలవంతంగా బరిలోకి దించుతున్నారు... ఇది ఓ కాంగ్రెస్ అభ్యర్థి హితులకు, సన్నిహితులకు, స్థానిక పెద్దలకు చెప్పుకుంటూ దీనాతిదీనంగా అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు వ్యతిరేకత వచ్చిన తీరుని జీర్ణించుకోలేని ఓ మాజీ కార్పొరేటర్ తనకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఇష్టం లేకపోయినా బలవంతంగా బరిలోకి దించుతున్నారని ఏడుపుముఖంతో తన గోడు వెళ్లబోసుకున్నారు.