కోల్‌కతా, మార్చి 15: పార్టీ ఫిరాయింపులు, తిరుగుబాట్లు, సంస్థాగత లోపాలు లాంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న వామపక్షాలు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తన ఉనికిని తిరిగి చాటుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. లెఫ్ట్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, బిజెపి, అధికార తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య చీలిపోవడం వల్ల తమకు లబ్ధి చేకూరుతుందని కూడా ఈ కూటమి ఆశలు పెట్టుకొంటోంది. తృణమూల్ కాంగ్రెస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేస్తుండడం వామపక్షాలకు మేలు చేస్తుందని ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ అభిప్రాయపడుతున్నారు. ‘2009 లోక్‌సభ ఎన్నికలు, 2011 అసెంబ్లీ ఎన్నికలు సిపిఎంకు, లెఫ్ట్‌ఫ్రంట్‌కు గడ్డుకాలం. ఈసారి లెఫ్ట్ పార్టీలు బెంగాల్‌లో మంచి ఫలితాలు సాధిస్తాయి’ అని సిపిఎం నాయకుడు మహమ్మద్ సలీమ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1977 నుంచి 34 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నిరాఘాటంగా పాలించిన తర్వాత సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. బలవంతపు భూసేకరణ అంశం ఇప్పటికీ ఓటర్ల మనస్సుల్లోంచి చెదిరిపోలేదు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్‌కు తొలిసారి గట్టిదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో ఆ కూటమి సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్-టిఎంసి కూటమికి కోల్పోవలసి వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయానికి లెఫ్ట్ కంచుకోట పూర్తిగా బద్దలైంది. అధికార తలబిరుసుతనం, సంస్థాగతంగా కిందిస్థాయి కార్యకర్తల్లో నెలకొన్న తమకు ఎదురులేదన్న భావన ప్రధాన కారణాలని గుర్తించిన సిపిఎం ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి చర్యలు ప్రారంభించింది. అట్టడుగుస్థాయి కార్యకర్తల్లో తిరిగి ఉత్సాహాన్ని నింపడానికి అది ఏమాత్రం ఉపయోగపడలేదని భారీగా తగ్గిపోయిన పార్టీ సభ్యత్వాలు చెబుతున్నాయి. 2010లో 84 లక్షలున్న సిపిఎం యువజన కార్యకర్తల సభ్యత్వం 2011లో 58 లక్షలకు పడిపోగా, 57 లక్షలున్న మహిళా విభాగం సభ్యత్వం 41 లక్షలకు తగ్గిపోయింది.
అయితే ప్రత్యర్థులు చీలిపోయి ఉండడం రాజకీయాల్లో ఎప్పుడూ లాభమేనని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్యామల్ చక్రబర్తి అంటున్నారు. సిపిఐ నాయకుడు బర్దన్ కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు లభించిన ఓట్ల శాతం 41 కాగా, టిఎంసి-కాంగ్రెస్ కూటమికి లభించిన ఓట్లు 49 శాతమని, కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని దానిలో నుంచి తీసివేస్తే ఇప్పటికీ తమ కూటమి ఓట్ల శాతమే ఎక్కువని అన్నారు. అయితే ఈ వాదనలో పస లేదని ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు లెఫ్ట్ పార్టీల బలానికి ఎంతమాత్రం కొలమానం కాదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు నీలోత్పల్ బసు వాదిస్తున్నారు. గత నెల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో ముగ్గురు సిపిఎం ఎమ్మెల్యేలు టిఎంసికి ఫిరాయించారు. 1972 నుంచి సిపిఎం ఎమ్మెల్యేగా ఉంటున్న మైనార్టీ నాయకుడు రజాక్ మొల్లా పార్టీని వదిలిపెట్టి కొత్త పార్టీని స్థాపించారు. దీని ప్రభావం రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లపై తప్పకుండా ఉండే అవకాశముంది. పశ్చిమ బెంగాల్‌లో గ్రామీణ, మైనార్టీ ఓటర్లే ప్రధాన అంశాలు. ఈ రెండు వర్గాలు కూడా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నాయని ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ధోరణిని బట్టి అర్థమవుతోంది.
పార్టీ ఫిరాయింపులు, తిరుగుబాట్లు, సంస్థాగత
english title:
left patlu
Date:
Sunday, March 16, 2014