
లక్నో, మార్చి 15: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి నిరాశ తప్పదంటున్న సర్వేలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సర్వేలు నిర్వహించేందుకు అనుసరించిన పద్ధతులను, వీటిద్వారా వెల్లడైన వాస్తవాలను ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గాను గత ఎన్నికల్లో 23 స్థానాలను గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సంద్భంగా శనివారం ఆయన తన కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ సర్వేలు ఎలా నిర్వహించారో, ఎన్ని శాంపిళ్లు సేకరించారో తమకు తెలుసని, కన్నౌజ్, మణిపురి, ఎటావాలలో ఎవరూ శాంపిళ్లు సేకరించనే లేదని, మరి ఈ శాంపిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ‘ఈ సర్వేలన్నీ వట్టి బూటకమని ఇటీవల ఒక వార్తాపత్రిక స్పష్టం చేసింది. ఇది వాస్తవమే. ఎన్నికల్లో అసలు సిసలైన పోరు బూత్ స్థాయిలోనే జరుగుతుంది’ అని అఖిలేష్ అన్నారు. సర్వేలను ప్రాతిపదికగా చేసుకుని ఎన్నికలపై సమాజ్‌వాదీ పార్టీ అంచనాలు వేయబోదని, అసలు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీని ఢీకొనే పార్టీయే లేదని, గత ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ ఈ సందర్భంగా ఏకరవు పెడుతూ, ఈ పథకాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి మంచి ఫలితాలు చేకూర్చుతాయన్న ధీమాను వ్యక్తం చేశారు. సమాజంలోని వివిధ వర్గాల అభ్యున్నతికి తాము ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.