
బెంగళూరు, మార్చి 15: కొన్ని రాజకీయ పార్టీలకు మీడియా అమ్ముడుపోయిందని ఆరోపణలు గుప్పించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్‌వింద్ కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేసి మీడియా శక్తి సామర్థ్యాలను ప్రశ్నించారు. బెంగళూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా శనివారం ఆయన పలుచోట్ల రోడ్ షోలు నిర్వహించారు. ప్రచారం ప్రారంభించడానికి ముందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గత చరిత్ర గురించి కానీ, గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి గురించి కానీ నిజాలను చెప్పే ధైర్యం మీడియాకు ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మీడియా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. గుజరాత్ అభివృద్ధి అసలు గుట్టును దేశ ప్రజల ముందు ఉంచే దమ్ము మీడియాకు లేదన్నారు. మీడియా అమ్ముడుపోయిందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏముంటాయని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కర్నాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో అవినీతి పాలన వల్ల జనం నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నీతివంతమైన పాలన కావాలనుకునే వారు తమ పార్టీని గెలిపించాలని కోరారు. అవినీతి, నేరమయ రాజకీయాలు, పెట్టుబడిదారుల ఆధిపత్యం పోవాలంటే సమర్థులైన వారిని ఎన్నుకోవాలన్నారు. దేశానికి తమ పార్టీ సరైన ప్రత్యామ్నాయని అన్నారు. లోక్‌సభలో తమ పార్టీ నాలుగో ఫ్రంట్‌గా అవతరిస్తుందన్నారు. కాగా, కేజ్రీవాల్ రోడ్ షోల కారణంగా బెంగళూరు నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
(చిత్రం) బెంగళూరులో శనివారం నిర్వహించిన ఒక రోడ్ షోలో అభివాదం చేస్తున్న కేజ్రీవాల్