భువనేశ్వర్, మార్చి 15: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒడిశాలో కాంగ్రెస్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ భార్య, మాజీ ఎంపీ హేమా గమాంగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార బిజూ జనతాదళ్ (బిజెడి)లో చేరుతున్నట్లు శనివారం ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడు జయ్‌దేవ్ జెనా నిరంకుశ వైఖరికి నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హేమా గమాంగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. బిజెడ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె విలేఖరులకు తెలిపారు. కాంగ్రెస్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక ఆ పార్టీ నుంచి బయటపడ్డానని చెప్పారు. బిజెడి తరఫున కొరాపుట్ నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. కొరాపుట్ నుంచి 1972-1998 మధ్య కాలంలో గిరిధర్ గమాంగ్ ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచారు. కాగా, ఆమె భర్త గిరిధర్ గమాంగ్‌కు కొరాపుట్ సీటును కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ‘్భర్తపైనే పోటీ చేస్తారా?’ అని విలేఖరులు ప్రశ్నించగా, ‘కుటుంబ విషయాలు అడగొద్దు, నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం’ అని ఆమె స్పష్టం చేశారు. హేమ చేరికతో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కొరాపుట్ ప్రస్తుత ఎంపీ జయరాం పంగీ తెలిపారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసానికి హేమతో పాటు జయరాం కూడా కలిసి వెళ్లారు. 1999లో ఆమె కొరాపుట్ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లోనూ అదే స్థానం నుంచి పోటీచేశారు. 2009లో గుణుపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
బిజెడి గూటికి హేమా గమాంగ్
english title:
contest against husband
Date:
Sunday, March 16, 2014