న్యూఢిల్లీ, మార్చి 15: జెడి(యు) శనివారం లోక్‌సభ ఎన్నికలకు తన తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీహార్‌తోపాటుగా నాలుగు ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న 15 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ పోటీ చేస్తున్న ససారాం నుంచి పార్టీ మాజీ బ్యూరోక్రాట్ కెపి రామయ్యను నిలబెట్టింది. రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన ససారాంలో బిజెపి సంజయ్ పాశ్వాన్‌ను నిలబెట్టింది. వివిధ రాష్ట్రాల్లో అనేక స్థాయిలలో పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి కెపి రామయ్య బరిలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరిని పార్టీ రిజర్వ్‌డ్ స్థానమైన జముయి నుంచి అభ్యర్థిగా నిలబెట్టంది. ఇక్కడ లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. కాగా, సుధాంశు శేఖర్ భాస్కర్ ఇక్కడ ఆర్‌జెడి అభ్యర్థిగా ఉన్నారు. ఎల్‌జెపికి భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండగా ఆర్‌జెడికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్న విషయం తెలిసిందే.
కాగా, జార్ఖండ్ పార్టీ విభాగం అధ్యక్షుడు జలేశ్వర్ మహతోను జార్ఖండ్‌లోని గిరిధ్ నియోజకవర్గం నుంచి, చాప్రా నుంచి మహేశ్ యాదవ్‌ను పార్టీ బరిలోకి దింపింది. మోడీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో నాలుగు స్థానాలకు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఒక్కో నియోజకవర్గానికి కూడా అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. బీహార్‌లో అధికారంలో ఉన్న జెడి(యు) రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో 38 స్థానాలకు పోటీ చేస్తుండగా, బెగుసరాయ్, బంకా స్థానాలను మిత్రపక్షమైన సిపిఐకి వదిలిపెట్టాలని నిర్ణయించింది. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీహార్‌లోని ఆరు లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపి మహాబలి సింగ్ కరకత్ లోక్‌సభ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు తిరిగి టికెట్ లభించిన సిట్టింగ్ ఎంపి సింగ్ ఒక్కరే కావడం గమనార్హం. ఔరంగాబాద్ నుంచి బాగీ కుమార్ వర్మను పార్టీ బరిలోకి దించింది. ఇక్కడ పార్టీ సిట్టింగ్ ఎంపి సుశీల్ కుమార్ ఇప్పుడు బిజెపి టిక్కెట్‌పై పోటీ చేస్తుండగా, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేరళ గవర్నర్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపి నిఖిల్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. కాగా, కుశాల్ యాదవ్‌ను నవాడానుంచి జెడి(యు) అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ససారాం, కరకత్, ఔరంగాబాద్, గయ, నవాడా నియోజకవర్గాల్లో ఏప్రిల్ 10న పోలింగ్ జరగనుంది.
జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ విలేఖరుల సమావేశంలో పార్టీ నిర్ణయాలను ప్రకటిస్తూ తాను తిరిగి తన స్థానమైన మాధేపుర నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మాధేపురలో ఆర్‌జెడి ఈ సారి పప్పూయాదవ్ అలియాస్ రాజేష్ రంజన్‌ను బరిలోకి దించినందున ఈసారి శరద్ యాదవ్ గెలుపొందడం కష్టం కావచ్చని, అందువల్ల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు గట్టిపట్టు ఉన్న నలంద నుంచి ఆయన పోటీ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే తన సీటు విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, రెండో జాబితా వెలువడినప్పుడు ఈ స్థానం నుంచి తన పేరును ప్రకటించడం జరుగుతుందని శరద్ యాదవ్ చెప్పారు. గుజరాత్‌లో జెడి(యు) తరఫున బరోడా నుంచి జాదవ్ అంబాలాలా కనాభాయ్, రిజర్వ్‌డ్ స్థానమైన చోటా ఉదయ్‌పూర్ నుంచి వాసవ్ ఎ ప్రఫుల్ భాయ్, బార్డోలి నుంచి వాసవ జగత్ సింగ్, సూరత్‌నుంచి వాసవ కిశోర్ భతి ఛోటు భాయ్, వల్సాడ్ నుంచి శైలేష్ జీ పటేల్ పోటీ చేయనున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని రట్లాంనుంచి నారాయణ్ మైదా, రాజస్థాన్‌లోని బనస్వాడానుంచి భంజీభాయ్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.
ససారాంలో మీరాకుమార్‌పై మాజీ ఐఏఎస్ అధికారి పోటీ * పాశ్వాన్ కుమారుడితో అసెంబ్లీ స్పీకర్ ఢీ
english title:
sasaram
Date:
Sunday, March 16, 2014