న్యూఢిల్లీ, మార్చి 15: ఢిల్లీ సహా 18 రాష్ట్రాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 9, 10 తేదీల్లో జరిగే రెండవ, మూడవ విడత ఎన్నికల కోసం రాష్టప్రతి శనివారం నోటిఫికేషన్ జారీ చేసారు. ఏప్రిల్ 9న అయిదు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాలకు, ఏప్రిల్ 10న ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలు సహా 13 రాష్ట్రాల్లోని 86 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 10న బీహార్‌లోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నప్పటికీ, పరిపాలనాపరమైన సమస్యల కారణంగా ఈ నియోజకవర్గాలకు గురువారమే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. చత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లో కూడా ఏప్రిల్ 10న పోలింగ్ జరగనుంది. హర్యానా (10 స్థానాలు), కేరళ (20 స్థానాలు), చండీగఢ్ (ఒక స్థానం)లో ఏప్రిల్ 10న ఒకే రోజు పోలింగ్ జరగనుంది. ఆరు లోక్‌సభ స్థానాలున్న జమ్మూ, కాశ్మీర్‌లో ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7 తేదీల్లో అయిదు రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 10న జమ్మూలో పోలింగ్ జరుగుతుంది. అలాగే జార్ఖండ్‌లోని 14 స్థానాల్లో అయిదు సీట్లకు ఏప్రిల్ 10న పోలింగ్ జరుగుతుంది. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7, 12 తేదీల్లో ఆరు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 10న పశ్చిమ యుపి, పొరుగున ఉన్న ఘజియాబాద్, గౌతమ్ బుద్ద నగర్ నియోజకవర్గాలతో కలిసి మొత్తం 10 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీలో ఏప్రిల్ 10న ఎన్నికలు జరిగే చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, తూర్పు డిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ మార్చి 22 కాగా, 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మార్చి 26లోగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
ప్యాకేజీలుంటేనే మేలు
* వి.నారాయణ స్వామి
పుదుచ్చేరి, మార్చి 15: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం కన్నా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినపుడే ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి వి.నారాయణ స్వామి అన్నారు. పుదుచ్చేరి నుంచి లోక్‌సభకు మళ్లీ పోటీ చేస్తున్న ఆయన శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తేనే అభివృద్ధి జరుగుతుందనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంగా ఆవిర్భవిస్తే రాజకీయ పరమైన లబ్ధి తప్ప ఉద్యోగులకు, ప్రజలకు ఆశించిన మేరకు ప్రయోజనం ఉండదన్నారు. కేంద్రం 30 శాతం నిధులను మాత్రమే ఇస్తుందని, మిగతా 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా గనుక లభిస్తే అనేక ప్యాకేజీలు లభిస్తాయని, 47 శాతం నిధులను కేంద్రం ఇస్తుందన్నారు. పుదుచ్చేరిలో ఎఐఎన్‌ఆర్‌సి పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రంగస్వామి ఎలాంటి అభివృద్ధిని సాధించలేకపోయారని ఆయన ఆరోపించారు. రంగస్వామి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల వల్లే ఎంతోకొంత ప్రగతి సాధ్యమైందన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ప్రలోభపెడితే ఫోన్ చేయండి
* ఢిల్లీలో టోల్‌ఫ్రీ నెంబరును ప్రారంభించిన ఐటి శాఖ
న్యూఢిల్లీ, మార్చి 15: ఎన్నికల సమయంలో దేశ రాజధానిలో అనుమానాస్పదంగా పెద్ద మొత్తాల్లో నగదు తరలింపునకు సంబంధించి తమను ప్రజలు అప్రమత్తం చేయడానికి వీలుగా ఆదాయం పన్ను విభాగం ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. ఎన్నికలల్లో ప్రలోభాలను అరికట్టాలనుకుంటున్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదాయం పన్ను శాఖలోని దర్యాప్తు విభాగం తమ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఫిర్యాదుల పరిశీలన విభాగాన్ని ఏర్పాటు చేసింది. రోజులో 24 గంటలూ టోల్‌ఫ్రీ నంబర్-1800110132-ను పెట్టడం జరుగుతుందని, ఆదాయం పన్ను శాఖ జాయింట్ డైరెక్టర్ ర్యాంక్‌లోని సీనియర్ అధికారి దాన్ని పర్యవేక్షిస్తారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఎంపిక చేసిన అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్లధనాన్ని, ఓటర్లకు లంచాలు ఇవ్వడంపై నిఘా పెట్టి ఉంచడం కోసం ఎన్నికల కమిషన్ సైతం తమ వ్యవస్థలో ఒక ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసింది.
కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ కోర్టు జరిమానా
న్యూఢిల్లీ, మార్చి 15: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రివాల్, మనీష్ శిశోడియాలపై కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబల్ కుమారుడు, న్యాయవాది అమిత్ సిబల్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ముందు హాజరు కానందుకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం వారికి చెరి రూ.2,500 జరిమానా విధించారు. ఈ ఒక్క రోజుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వారు చేసుకున్న అభ్యర్థనను అంగీకరిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సునీల్ కుమార్ శర్మ వారిపై ఈ జరిమానా విధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం తాను బెంగళూరులో ఉన్నానంటూ కేజ్రివాల్ మినహాయింపు కోరగా, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో తమ పార్టీ నాయకుడు కుమార్ బిశ్వాస్, మరికొంతమంది పార్టీ సభ్యులపై జరిపిన దాడిలో వారు గాయపడినందున తాను ఆమేథీ హడావుడిగా వెళ్లాల్సి వచ్చిందని శిశోడియా కోర్టుకు తెలియజేసారు. కాగా, కోర్టుకు హాజరయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశాంత్ భూషన్, షాజియా ఇల్మిలు కేసు విచారణ జరిగే ప్రతిరోజూ కోర్టుకు హాజరవుతామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో కోర్టు వారిని విడిచిపెట్టింది. కోర్టు కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 19కు వాయిదా వేసింది. అదే రోజు అమిత్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. తాను తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కోర్టు కేసుల్లో ఒక టెలికాం కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారంటూ అమిత్ వారిపై పరువు నష్టం దావా వేయడంతో కోర్టు గత ఏడాది జూలై 24న ఈ నలుగురికి సమన్లు జారీ చేసింది.