
మెల్బోర్న్, మార్చి 16: మెర్సిడిజ్ డ్రైవర్ నికో రోజ్‌బెర్గ్ ఆదివారం ఇక్కడ జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ టైటిల్‌ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించాడు. 57 ల్యాప్స్‌ను అతను ఒక గంట, 32 నిమిషాల, 58.710 సెకన్లలో పూర్తి చేసి, కెరీర్‌లో నాలుగో ఫార్ములా వన్ టైటిల్ సాధించాడు. రెడ్ బుల్ రెనాల్ట్ డ్రైవర్ డానియల్ రికార్డో 24.5 సెకన్లు ఆలక్ష్యంగా లక్ష్యాన్ని చేరుకొని ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాడు. మెక్‌లారెన్ మెర్సిడిజ్ డ్రైవర్ కెవిన్ మాగ్నసెన్‌కు తృతీయ స్థానం దక్కింది. అతను రోజ్‌బెర్గ్ కంటే 26.7 సెకన్లు ఆలక్ష్యంగా గమ్యాన్ని చేరాడు. ప్రపంచ చాంపియన్, గత సీజన్‌లో వరుసగా 10 రేసులు గెల్చుకొని రికార్డు సృష్టించిన సెబాస్టియన్ వెటల్ (రెడ్ బుల్), శనివారం నాటి క్వాలిఫయింగ్ రేస్‌లో పోల్ పొజిషన్ సాధించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడిజ్) ఈ రేసును పూర్తి చేయకుండా రిటైర్ కావడం గమనార్హం. జెన్సన్ బటన్ (మెక్‌లారెన్-మెర్సిడిజ్), ఫెర్నాండొ అలాన్సో (ఫెరారీ), వాల్టెరీ బొటాస్ (విలియమ్స్) వరుసగా నాలుగు నుంచి ఆరు స్థానాల్లో నిలిచారు.
హకెన్‌బర్గ్‌కు ఏడో స్థానం
ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హకెన్‌బర్గ్ ఈ రేసులో రోజ్‌బెర్గ్ కంటే 50.7 సెకన్లు ఆలస్యంగా లక్ష్యాన్ని చేరాడు. అతనికి ఏడో స్థానం దక్కింది. ఈ సీజన్ ప్రారంభంలోనే మెరుగైన ఫలితాన్ని రాబట్టి, ఐదు పాయంటుల సాధించినందుకు ఫోర్స్ ఇండియా ఆనందం వ్యక్తం చేస్తున్నది. కిమీ రైకోనెన్ (ఫెరారీ), జీన్-ఎరిక్ వెర్నే (టోరో రొసో), డానిల్ యాట్ (టోరో రొసో) వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలను సంపాదించారు. రేస్‌ను పూర్తి చేసిన సెర్గీ పెరెజ్ (్ఫర్స్ ఇండియా), ఆడ్రియన్ సటిల్ (సాబెర్), ఎస్టెబన్ గటిరెజ్ (సాబెర్), మాక్స్ చిలియన్ (మరుసియా), జూలెస్ బియాన్జీ (మారుసియా) రేస్‌ను పూర్తి చేసిన వారిలో ఉన్నారు. కాగా, వెటెల్, హామిల్టన్‌తోపాటు మరో ఐదుగురు డ్రైవర్లు, రొమైన్ గ్రాస్‌జీన్, పొస్టర్ మల్డొనాడో, మార్కస్ ఎరిక్సన్, ఫెలిప్ మస్సా, కొనీ కొబయాషి రేస్‌ను పూర్తి చేయలేక రిటైర్ అయ్యారు.