న్యూఢిల్లీ, మార్చి 16: ఈ వారం దేశీయ స్టాక్‌మార్కెట్ల ట్రేడింగ్‌ను అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావితం చేస్తాయని నిపుణులు విశే్లషిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా ముఖ్యమేనన్నారు. కాగా, మార్కెట్లు ఒడిదుడుకులకూ లోనయ్యే వీలుందని వారు అభిప్రాయపడుతున్నారు. ‘అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌లో నెలకొనే పరిస్థితులు, దేశీయంగా రిజర్వ్ బ్యాంకు ద్రవ్యసమీక్ష కీలకం. వీటినే ఇప్పుడు మదుపర్లు ఆసక్తితో గమనిస్తున్నారు.’ అని ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ కొటక్ సెక్యురిటీస్ అధిపతి దీపెన్ షా అన్నారు. క్రిమియా వ్యవహారం ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తకర వాతావరణానికి దారి తీసిన క్రమంలో గతవారం స్టాక్‌మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిని సూచీలు తాకినప్పటికీ చివరకు నష్టాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలావుంటే ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 25 నెల కనిష్టానికి తగ్గడం, టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఆర్‌బిఐ ఈసారి జరపబోయే సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మార్కెట్ పెరుగుదలకు దోహదం చేస్తుందన్న అభిప్రాయాన్ని బొనాంజా పోర్ట్ఫొలియో లిమిటెడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాకేష్ గోయల్ వెలిబుచ్చారు. ఏప్రిల్ 1న ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష జరుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఈ నెల 18-19 తేదీల్లో చేయనున్న ద్రవ్యసమీక్ష కూడా మార్కెట్లను ప్రభావితం చేయనుంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రవేశపెట్టిన 85 బిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాలను ఫెడరల్ రిజర్వ్ నెలకో 10 బిలియన్ డాలర్ల చొప్పున ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చర్య భారత్‌తోసహా అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపి విదేశీ పెట్టుబడులను అంతకంతకూ దూరం చేస్తోంది. ఈ క్రమంలో ఫెడర్‌ల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తమ ద్రవ్యసమీక్షలో తీసుకునే నిర్ణయాలు దేశీయ స్టాక్‌మార్కెట్లపై సహజంగానే ప్రభావం చూపనున్నాయని నిపుణులు అంటున్నారు.
నేడు మార్కెట్లకు సెలవు
హోళీ పండగ సందర్భంగా సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో సోమవారం ట్రేడింగ్ జరగదు. తిరిగి మంగళవారం స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్ యథాతథంగా జరుగుతుంది. ఈ మేరకు స్టాక్‌మార్కెట్లు స్పష్టం చేశాయి.
చోటా బీమ్‌కు
ఫిక్కీ బిఏఎఫ్ అవార్డు
హైదరాబాద్, మార్చి 16: హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ చోటా బీమ్‌కు ఫిక్కీ బిఏఎఫ్ అవార్డు లభించింది. ముంబాయిలో ఎవిజిసి ఇండస్ట్రీకి సంబంధించి ఫిక్కీ ఫ్రేమ్స్ 2014 అవార్డు లభించడంపట్ల చోటా బీమ్ సృష్టికర్త, రాజీవ్ చిల్కా, ఆయన బృందం హర్షం వ్యక్తం చేసింది. కాగా, ఈ అవార్డును ఫిక్కీ ఫ్రేమ్స్ కో చైర్మన్ అశిష్ కులకర్ణి చేతుల మీదుగా రాజీవ్ చిల్కా స్వీకరించారు.
గీతం విద్యార్థులకు ఎసిసిఏ కోర్సు
గీతం వర్శిటీలో బికామ్ ఆనర్స్ చదువుతున్న విద్యార్థులకు ఎసిసిఏ (ది అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్) కోర్సును కూడా చదివే అవకాశం కల్పిస్తున్నట్లు గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె శివరామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గీతం, ఎసిసిఏతో భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. ఎసిసిఏలో 162 మంది సభ్యులున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 4,28,000 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. గీతంలో బికామ్ ఆనర్స్ చదువుతున్న విద్యార్థులకు ఎసిసిఏ చదివే అవకాశం లభిస్తుందన్నారు. పైగా బిఎస్‌సి అప్లైడ్ అకౌంటింగ్ డిగ్రీ ఆక్స్‌ఫర్డ్ బ్రోకర్స్ యూనివర్శిటీ నుంచి లభిస్తుందన్నారు.
కార్బన్, లావా
విండోస్ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ, మార్చి 16: దేశీయ మొబైల్ తయారీ సంస్థలైన లావా, కార్బన్ రాబోయే కొద్ది నెలల్లో విండోస్ ఆధారిత స్మార్ట్ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నాయి. కార్బన్ విడుదల చేసే విండోస్ ఫోన్లు రూ. 6000- 12,000 మధ్యగల ధరల శ్రేణిలో ఉంటుండగా, లావా విండోస్ ఫోన్లు రూ. 6,500 ధరతో మొదలుకానున్నాయి. కాగా, మే నెల చివర్లోగానీ, జూన్ ఆరంభంలోగానీ ఈ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెస్తామని కార్బన్ ఎండి ప్రదీప్ జైన్ పిటిఐకి తెలిపారు. జూలైలో పరిచయం చేస్తామని లావా అంతర్జాతీయ సిఇఒ, ఎండి హరి ఓం రాయ్ తెలిపారు.
బంగారంపై పెరిగిన దిగుమతి టారిఫ్ విలువ
న్యూఢిల్లీ, మార్చి 16: బంగారంపై దిగుమతి టారిఫ్ విలువను ప్రభుత్వం పెంచింది. 10 గ్రాములపై ఇంతకుముందున్న 433 డాలర్లను 445 డాలర్లకు పెంచింది. మరోవైపు కిలో వెండి దిగుమతిపై ఇంతకుముందున్న 699 డాలర్ల టారిఫ్ విలువను 694 డాలర్లకు తగ్గించింది.