న్యూఢిల్లీ, మార్చి 16: మదుపర్లకు సాధికారత కల్పించడం, వారి సామర్థ్యాన్ని పెంచడం, నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి వాటిపై స్టాక్‌మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టిపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సెబీ తమ అజెండాను ప్రకటించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తున్న క్రమంలో రాబోయే 2014-15 ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులు, సాధించాల్సిన లక్ష్యాలపై సెబీ నడుం బిగించింది. ప్రస్తుతం ఉన్న మదుపర్లతోపాటు, కొత్తగా వచ్చే మదుపర్లకు స్టాక్‌మార్కెట్ తీరుతెన్నులపై అవగాహన పెంచే కార్యక్రమాలను మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని చూస్తున్నట్లు సెబీ తెలిపింది. ఈ వారం చివర్లో జరిపే బోర్డు సమావేశంలో వీటన్నిటిపై సమగ్ర చర్చ జరుగుతుందని సెబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే మార్కెట్‌లో జరుగుతున్న మోసాల నుంచి మదుపర్లను రక్షించేలా పనిచేస్తూ విప్లవాత్మక మార్పులకు సెబీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘిస్తే చిన్న సంస్థ అయినా, పెద్ద సంస్థ అయినా ఊరుకునేది లేదని సహారా విషయంలో సెబీ నిరూపించింది కూడా. మరెన్నో సంస్థలపై రోజూ జరిమానాలను విధిస్తున్నదీ చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరంలోనూ అక్రమార్కులపై పంజా విసిరేందుకు సెబీ సిద్ధమవుతోంది.
కార్వి స్టాక్ బ్రోకింగ్‌పై కొరడా
ముంబయి: 2003-05 సంవత్సరాల్లో జరిగిన ఐపిఒ కుంభకోణానికి సంబంధించి కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌పై సెబీ కొరడా ఝుళిపించింది. ఈ కుంభకోణంలో స్టాక్ బ్రోకర్‌గా కార్వి పాత్రకుగానూ ఆర్నెళ్లు కొత్త పథకాలను ప్రారంభించకూడదని ఆదేశించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్యసాధనపై సెబీ దృష్టి
english title:
m
Date:
Monday, March 17, 2014