న్యూఢిల్లీ, మార్చి 16: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో ఔషధ రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) గతంతో పోల్చితే రెట్టింపయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 589 మిలియన్ డాలర్లుగా ఉంటే, ఈసారి 1.26 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. ఈ మేరకు పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా బహుళజాతి సంస్థలు దేశీయ సంస్థలను తమ అధీనంలోకి తెచ్చుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎఫ్‌డిఐ నిబంధనలను కఠినతరం చేయాలనుకుంది. మితిమీరిన రీతిలో విదేశీ సంస్థల రాకతో దేశీయ ఔషధ సంస్థల ఉనికి ప్రమాదంలో పడుతోందని భావించే కఠిన నిబంధనలను తీసుకురావాలనుకుంది. అయితే దీన్ని కేంద్ర కేబినెట్ తిరస్కరించింది. ఈ నిబంధనలు దేశీయ మార్కెట్లలో విదేశీ సంస్థల పెట్టుబడులకు విఘాతం కలిగించేలా ఉందని, అదే జరిగితే అరుదైన, కీలకమైన ఔషధాల ఉత్పత్తి స్థానికంగా జరగబోదన్న ఆందోళనను ఈ సందర్భంగా కేబినెట్ వ్యక్తం చేసింది. అయితే 2012 ఏప్రిల్ నుంచి 2013 ఏప్రిల్ వరకు దేశీయ ఔషధ రంగంలోని సంస్థల్లోకి 96 శాతానికిపైగా ఎఫ్‌డిఐ వచ్చినట్లు అంచనా. దేశీయ ఔషధ సంస్థ అయిన అజిలా సెషియాల్టీస్‌ను 5,168 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి అమెరికాకు చెందిన ఔషధ సంస్థ మిలాన్‌కు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న దేశీయ ఔషధ సంస్థల్లో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే విదేశీ పెట్టుబడుల ప్రగతి బోర్డు (ఎఫ్‌ఐపిబి) అనుమతిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కొత్త ఔషధ ప్రాజెక్టుల్లోకి మాత్రం ఆటోమెటిక్ విధానం ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చింది. ఇదిలావుంటే ఇదే ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో సేవల రంగంలోకి 1.59 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ రంగంలోకి 871 మిలియన్ డాలర్లు, నిర్మాణ రంగంలోకి 914 మిలియన్ డాలర్లు, రసాయన రంగంలోకి 490 మిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్‌డిఐ వచ్చాయి. కాగా, విదేశీ మదుపర్లను ఆకర్షించడంలో భాగంగా పలు రంగాల్లోకి విదేశీ పెట్టుబడులకున్న నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దేశంలోకి ఎఫ్‌డిఐ వెల్లువ గతంతో పోల్చితే 2 శాతం తగ్గడం గమనార్హం.
ఏప్రిల్-డిసెంబర్‌లో 1.26 బిలియన్ డాలర్లుగా నమోదు
english title:
avushada
Date:
Monday, March 17, 2014