న్యూఢిల్లీ, మార్చి 16: ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ మదుపర్లు దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు. ముఖ్యంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెల్చుకున్న పార్టీనే ఓ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఆశ విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) నుంచి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వారు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇదిలావుంటే మార్చి ప్రారంభం నుంచి 14 వరకు మొత్తం 42,035 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టిన ఎఫ్‌ఐఐలు.. తిరిగి 36,967 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో నికర పెట్టుబడుల విలువ 5,068 కోట్ల రూపాయలు (828 మిలియన్ డాలర్లు)గా ఉందని స్టాక్‌మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటిదాకా ఎఫ్‌ఐఐల పెట్టుబడుల విలువ 7,186 కోట్ల రూపాయలుగా ఉంది. ఫిబ్రవరిలో 1,404 కోట్ల రూపాయలు, జనవరిలో 714 కోట్ల రూపాయలను తెచ్చారు. మరోవైపు ఇదే సమయంలో దేశీయ రుణ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల విలువ 14,140 కోట్ల రూపాయలు (2.3 బిలియన్ డాలర్లు)గా ఉండటం విశేషం. ఇక గత ఆర్థిక సంవత్సరం ప్రమాదకర స్థాయికి చేరి ప్రభుత్వ వర్గాల్లో దడ పుట్టించిన కరెంట్ ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి తగ్గడం మార్కెట్‌కు లాభిస్తోందని నిపుణులు విశే్లషిస్తున్నారు. క్రిందటిసారి 88 బిలియన్ డాలర్లుగా నమోదైన కరెంట్ ఖాతా లోటు ఈసారి 45 బిలియన్ డాలర్లకు పడిపోతుందన్న అంచనాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సైతం కరెంట్ ఖాతా లోటు తగ్గడం మూలంగా ఏడాదిన్నర క్రితంతో పోల్చితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు. దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వల రాకపోకలకు సూచికైన కరెంట్ ఖాతా లోటు ఎగుమతుల కంటే దిగుమతులు అదికంగా ఉంటే పెరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశీయ దిగుమతుల్లో ముడిచమురు తర్వాతి స్థానంలో ఉన్న బంగారం దిగుమతులపై దృష్టిసారించిన ప్రభుత్వం, ఆర్‌బిఐ.. పసిడి దిగుమతులపై సుంకం, మరికొన్ని ఆంక్షలను ప్రవేశపెట్టింది. ఫలితంగా భారీగా పడిపోయిన పుత్తడి దిగుమతుల కారణంగా ఇప్పుడు కరెంట్ ఖాతా లోటు ఊహించనిస్థాయిలో తగ్గుముఖం పట్టగా, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని, తద్వారా మార్కెట్లూ లాభాల్లో కదలాడతాయని నిపుణులు చెబుతున్నారు. దిగివస్తున్న ద్రవ్యోల్బణం గణాంకాలూ ఆర్‌బిఐ అవలంభిస్తున్న కఠిన ద్రవ్య విధానానికి బ్రేకులేస్తుందని, తగ్గే కీలక వడ్డీరేట్లు బ్యాంకుల నుంచి పరిశ్రమలకు చౌకగా రుణాలు అందించి పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తాయంటున్నారు.
* దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి విదేశీ మదుపర్ల పెట్టుబడులు
english title:
r
Date:
Monday, March 17, 2014