
హైదరాబాద్, మార్చి 16: రాష్ట్ర విభజన ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండగా, మరోవైపు గ్రామీణ బ్యాంకుల పునరేకీకరణలో సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామీణ బ్యాంకుల చట్టం ప్రకారం ఒక్కో రాష్ట్రంలో ఒకటి లేదా అంతకుమించి గ్రామీణ బ్యాంకులు ఉండవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ‘తెలంగాణ గ్రామీణ బ్యాంకు’ ఏర్పాటు దాదాపు ఖరారయింది. సీమాంధ్రకు సంబంధించి ఒకే గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలా? రెండు గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయాలా అన్న అంశంపై ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకోలేదు. ఈ అంశం చర్చల్లోనూ, పరిశీలనలోనూ ఉంది. ప్రస్తుతం తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు కలిపి దక్కన్ గ్రామీణ బ్యాంక్ (డిజిబి) నడుస్తోంది. డిజిబిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్పాన్సర్ చేస్తోంది. మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఎపిజివిబి) ఏర్పాటు చేశారు. దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తోంది. డిజిబిని, ఎపిజివిబిని కలిపి ‘తెలంగాణ గ్రామీణ బ్యాంక్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయతే ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్ విలీనం జరిగే ప్రతిపాదన ఒకటి ఇప్పటికే పరిశీలనలో ఉంది. దాంతో తెలంగాణలో ఈ రెండు బ్యాంకుల నేతృత్వంలో ఒకే గ్రామీణ బ్యాంకు ఏర్పాటు కావడం పెద్దగా ఇబ్బంది కాదని స్పష్టమవుతోంది. మరోవైపు సీమాంధ్రలో ప్రస్తుతం మూడు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. గుంటూరుతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు కలిపి చైతన్య-గోదావరి గ్రామీణ బ్యాంక్ నడుస్తోంది. దీన్ని ఆంధ్రాబ్యాంక్ స్పాన్సర్ చేస్తోంది. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు కలిపి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఎపిజిబి) నడుస్తోంది. దీన్ని సిండికేట్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తోంది. ఇక చిత్తూరు, కృష్ణా జిల్లాలకు కలిపి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నడుస్తోంది. దీనిని ఇండియన్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తోంది. సీమాంధ్రకు ప్రస్తుతానికి రెండు గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. ఎపిజివిబి ఆధ్వర్యంలో ఉన్న శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలను చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో కలుపుతూ, ప్రస్తుతం ఈ బ్యాంకు పరిధిలో ఉన్న ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాను కూడా ఈ బ్యాంకు పరిధిలోకి తేవాలని భావిస్తున్నారు. దీని వల్ల కృష్ణా జిల్లాలోని గ్రామీణ బ్యాంకులకు పరిపాలనా సౌలభ్యం ఏర్పాటవుతుందని భావిస్తున్నారు. అంటే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు పరిధిలోకి ఏడు జిల్లాలు వస్తాయి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను అలాగే ఉంచి, సప్తగిరి పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లాను కూడా ఇదే బ్యాంకు పరిధిలోకి తేవాలని భావిస్తున్నారు. అంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలోకి ఆరు జిల్లాలు వస్తాయి. సీమాంధ్రలోని పరిస్థితి పరిశీలిస్తే కొంత క్లిష్టంగా కనిపిస్తోంది. నాలుగు వేర్వేరు బ్యాంకులు (ఆంధ్రాబ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్‌బిఐ) కలిసి తమ పరిధిలోని గ్రామీణ బ్యాంకుల పునరేకీకరణ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.