హైదరాబాద్, మార్చి 17: బిజెపి, టిడిపిల మధ్య పొత్తు ఏర్పడితే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం అనే చర్చ రెండు పార్టీల్లోనూ జోరుగా సాగుతోంది. పొత్తుపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా రెండు పార్టీల్లో ఈ అంశంపై అంతర్గతంగా చర్చ సాగుతోంది. బిజెపి జాతీయ నాయకులు జైట్లీ, జవదేకర్ తదితరులు హైదరాబాద్‌లోని బిజెపికి కార్యాలయంలో తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల నాయకులతో పొత్తు వ్యవహారాలపై అభిప్రాయ సేకరణ జరిపారు. పొత్తుకు మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. పొత్తుపై తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సీమాంధ్రలో బిజెపికి పెద్దగా బలం లేదు, ఆ పార్టీతో పొత్తు వల్ల పార్టీకి కలిగే ప్రయోజనం ఏముందని సీమాంధ్ర టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో ఆలోచించి చంద్రబాబు పొత్తుపై నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర దేశం నాయకులు చెబుతున్నారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో విశాఖ, చిత్తూరు జిల్లాల్లో బిజెపి ఎంపి అభ్యర్థులు విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. 99 వరకు బిజెపి పరిస్థితి బాగానే ఉన్నా, తరువాత 2004 నాటికి టిడిపితో పొత్తు పుణ్యామా అని బిజెపి పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం బిజెపిలో బలంగా ఉంది. బలహీనంగా ఉన్న పార్టీతో పొత్తు అవసరం ఏమిటనేది టిడిపి నాయకుల వాదన. అయితే పార్టీ నాయకత్వం ఆలోచన మరో విధంగా ఉంది. సీమాంధ్రలో బిజెపి సొంతంగా విజయం సాధించలేకపోవచ్చు కానీ టిడిపికి ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి, ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేలు సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి, కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో సన్నిహితంగా ఉండడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగితే బిజెపితో పొత్తు వల్ల సీమాంధ్రలో టిడిపికి ప్రయోజనం కలుగుతుంది అనేది పార్టీ నాయకత్వం వాదన.
అయితే రాష్ట్ర విభజన అంశంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, విభజనకు కాంగ్రెస్ ఏ విధంగా కారణమో, బిజెపి సైతం అదే విధంగా కారణమని సీమాంధ్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది, మనం బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఆ వ్యతిరేకత మనపై కూడా పడుతుంది అని కొందరు టిడిపి నాయకులు వాదిస్తున్నారు. అయితే ఈ అంశాన్ని పార్టీ అధ్యక్షుడు దృష్టిలో పెట్టుకున్నాడని అందుకే వెంటనే పొత్తు గురించి ప్రకటన చేయలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. విభజన ముగిసిపోయిన అంశం, ఇప్పుడు దాని గురించి ఆలోచించి వృధా, ప్రస్తుతం ప్రజలు విభజన గురించి కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంటే సాధ్యం అవుతుందనే అభిప్రాయం జనంలోకి తీసుకు వెళితే రెండు పార్టీలకు ప్రయోజన కరంగా ఉంటుందని నాయకులు చెబుతున్నారు. పొత్తు వల్ల రెండు పార్టీలకు ఉపయోగకరంగా ఉంటుందని కొందరి వాదన. ఏ పార్టీ అయినా తమ పార్టీకి ప్రయోజనం లేకుంటే పొత్తు పెట్టుకోదని, పొత్తు వల్ల కొంత నష్టం ఉంటుంది, కొంత లాభం ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు. మా అభిప్రాయం మేం చెబుతాం, అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని టిడిపి నాయకులు చెబుతున్నారు.
బిజెపి, టిడిపిలో ఎడతెగని చర్చ
english title:
evariki entha laabham
Date:
Tuesday, March 18, 2014