ఖమ్మం, మార్చి 17 : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ నాయకుల్లో విభేదాల కారణంగా వారంతా నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. గడచిన ఎన్నికల్లోనూ ఖమ్మం ఎంపి స్థానంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను కూడా పార్టీకి కట్టబెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగా పార్టీలోని వారే ఒకరికొకరు ప్రతిపక్షంగా మారిన పరిస్థితి నెలకొంది. ఎంపి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వర్గాల మధ్య పోరు గ్రామస్థాయికి చేరింది. ఈ విషయం అనేకసార్లు అధినాయకత్వం దృష్టికి వెళ్ళినప్పటికీ ఇద్దరూ అగ్ర నాయకులు కావటంతో ఎవరికి వారు దాటవేసే దోరణిని అవలంభించారు. మొన్న ఖమ్మంలో జరిగిన ప్రజాగర్జనకు చంద్రబాబు హాజరైనప్పటికీ ఇద్దరు నేతల మధ్య విభేదాలను పరిష్కరించటంలో విఫలమయ్యారు. ప్రజాగర్జన సభకు ప్రజలను సమీకరించటంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల నాగేశ్వరరావు సభావేదికపై మాత్రం అంటీముట్టనట్లుగానే కనిపించారు. బాబు కూడా ఆయనకు పెద్దగా ప్రాధాన్యమిచ్చినట్లు కన్పించలేదు. చివరకు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు హాజరైనప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు గైర్హాజరై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సమావేశానికి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు, ఒక ఎమ్మెల్సీ హాజరుకాలేదని సమాచారం. కేవలం ఎంపి నామ నాగేశ్వరరావు వర్గంలో ఉన్న ఇల్లెందు ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాత్రమే ఈ సమావేశానికి హాజరై జిల్లాలోని పరిస్థితిని వివరించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. అనారోగ్య కారణంతోపాటు ఇతర కారణాలు చూపుతూ తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ హాజరుకాలేదని, ఈ విషయాన్ని అగ్రనేతలకు కూడా సమాచారం అందించారని పార్టీ నేతలు అంటున్నారు. చంద్రబాబు అన్ని జిల్లాల నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి జిల్లాలో పరిస్థితిని తెలుసుకొని పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందిస్తుండగా ఇక్కడ మాత్రం అమలుకావటం లేదు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎంపి నామ నాగేశ్వరరావు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా బాబుకు అందించినట్లు సమాచారం. అందులో ఖమ్మం శాసనసభ సీటుకు తుమ్మల నాగేశ్వరరావు మినహా మిగిలిన వారంతా తన అనుయాయుల పేర్లే చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యేలను కూడా కాదని ఇతరుల పేర్లు అందులో సూచించినట్లు సమాచారం. దీంతో జిల్లాలోని పార్టీ అగ్రనేతల మధ్య వివాదం మరింతగా ముదిరింది. స్థానిక ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతుండటం, మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందని సీనియర్ నాయకులు, కార్యకర్తలు వాపోతుండటం గమనార్హం. ఇద్దరు నాయకులు కలిసి పార్టీని బలోపేతం చేయాలని, లేనిపక్షంలో ఈసారి పార్టీకి మరింత నష్టం జరుగుతుందని పలువురు నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు నందమూరి బాలకృష్ణకు జిల్లాలోని పార్టీ పరిస్థితిని వివరించగా, మరికొందరు లోకేష్‌కు కూడా నివేదించినట్లు సమాచారం.
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ నాయకుల్లో విభేదాల
english title:
khammam tdp
Date:
Tuesday, March 18, 2014