పుట్టపర్తి, మార్చి 17: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. విభజన నేపధ్యంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో అదీ సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన అనంతపురం జిల్లాలో బోణీ చేయడం గమనార్హం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డును కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. వైకాపా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం, టిడిపి అభ్యర్థి పోటీనుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఓబులేసు ఎన్నిక ఇక లాంఛనమే. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పుట్టపర్తి నగర పంచాయతీ ఎన్నికల్లో 20 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలిపింది. 1వ వార్డులో 1051 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వైకాపా అభ్యర్థి నరసింహులు నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే టిడిపి అభ్యర్థి బావక్క సోమవారం నామినేషన్ ఉపసంహరించుకుంది. దీంతో పోటీలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఓబులేసు(్ఫటోసాయి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అధికారికంగా ఓబులేసు ఎన్నికను మంగళవారం ప్రకటిస్తారు. ఈ వార్డు గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. సత్యసాయి సోదరుడు జానకిరామయ్య మరణానంతరం వార్డు ఓటర్లు ఆయన కుమారుడు రత్నాకర్ కనుసన్నలలో మెలుగుతున్నారు.
- పుట్టపర్తి ఒకటో వార్డు ఏకగ్రీవం -
english title:
unanimous
Date:
Tuesday, March 18, 2014