రాజమండ్రి, మార్చి 17: సినిమాల్లో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం సాధ్యమవుతుందిగానీ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల నిర్వహణలో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం ఎలా సాధ్యమవుతుంది? ఏకకాలంలో రెండు లేదా మూడు ఎన్నికల బాధ్యతలు నిర్వహించటం సాధ్యంకాదు మహోప్రభో అని వివిధ స్థాయిల్లోని అధికారులు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఒక ఎన్నికను నిర్వహించాలంటేనే నానా తిప్పలుపడాల్సిన నేపథ్యంలో రెండు నెలల్లో మూడు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి జిల్లా అధికార యంత్రాంగంపై పడిన సంగతి విదితమే. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏకకాలంలో రెండు లేదా మూడు బాధ్యతలను ఎలా నిర్వహించాలో తెలియక అధికార యంత్రాంగం తల పట్టుకుంటోంది.
జిల్లాల్లో కొంత మంది అధికారులకు మున్సిపల్ ఎన్నికల్లో జోనల్ అధికారులుగాను, ఎంపిటిసి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులుగాను, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులుగాను బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ ఎన్నికల్లో జోనల్ అధికారులకు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులకు దాదాపు ఒకే విధమైన ఎన్నికల బాధ్యతలు, అధికారాలు ఉంటాయి. మున్సిపల్ ఎన్నికలయినా, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలయినాగానీ, ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పటి నుండి జోనల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు తమ అప్పగించిన జోన్ లేదా సెక్టార్‌లో పర్యటిస్తూ ఎన్నికలు సజావుగా జరగడానికి కీలక బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జోనల్ అధికారులుగా నియమితులైన అధికారులు తమకు అప్పగించిన వార్డుల్లో పర్యటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాలి. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే అభ్యర్ధులు వ్యవహరిస్తున్నారా? ఎవరైనా ఉల్లంఘిస్తున్నారా? మద్యం, డబ్బు పంపిణీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఉంటే, వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవటంతో పాటు పోలింగ్ బూత్‌ల్లో ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత జోనల్ అధికారులపై ఉంటుంది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలయింది. అందువల్ల జోనల్ అధికారుల అసలు బాధ్యతలు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది మున్సిపల్ జోనల్ అధికారులకు ఎంపిటిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా కూడా బాధ్యతలు అప్పగించారు. దాంతో ఏకకాలంలో అటు మున్సిపల్ జోనల్ అధికారులుగా, ఇటు ఎంపిటిసి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులుగా పనిచేయాల్సి వస్తోంది. మరోపక్క ఈ రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న మరికొంత మంది అధికారులకు ఈ రెండూ చాలవన్నట్టు మూడో బాధ్యతగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సెక్టోరల్ అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో ఇప్పటి నుండే సెక్టోరల్ అధికారులు బాధ్యతలు మొదలయినట్టే లెక్క. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే, ‘మాకేం తెలియదు. డ్యూటీ వేశాం, పనిచేయాల్సిందే’ అని అధికారులు హుకుం జారీచేస్తున్నట్టు తెలుస్తోంది. పోనీ అసాధారణమైన పరిస్థితుల్లో అరుదైన ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారా? అంటే అదీ లేదు. ఇంత వరకు వాహన సౌకర్యాన్ని కూడా ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఎంపిటిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి, 50కిలోమీటర్ల దూరంలో ఉన్న మున్సిపాలిటీలో జోనల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించాలంటే ఎంత కష్టమో రాష్ట్ర ఎన్నికల సంఘమే ఆలోచించాలని అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మున్సిపాల్టీల్లో జోనల్, మండల పరిషత్తుల్లో రిటర్నింగ్ బాధ్యతలు అసెంబ్లీ, లోక్‌సభలకు సెక్టోరల్‌గా విధులు.. వరుస ఎన్నికలతో బెంబేలు
english title:
triple action
Date:
Tuesday, March 18, 2014