విశాఖపట్నం, మార్చి 17: సీనియర్ రాజకీయ నాయకులకు గడ్డుకాలం వచ్చింది. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులకు ఈ ఎన్నికలు సవాలుగా నిలిచాయి. ఉత్తరాంధ్రలో ఈ రెండు పార్టీల్లోని సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి కూడా ఇష్టపడడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టిడిపి, వైకాపాలో బెర్త్‌లు ఖాళీ లేకపోవడంతో కొందరు నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఎన్నికల్లో విధిలేని పరిస్థితుల్లో బరిలోకి దిగాల్సి వస్తోంది. వీరంతా ఏటి ఎదురీదడం తప్ప, చేసేది లేదు. వైకాపా సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవు. ఆయన ముందు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆ తరువాత యలమంచిలి నియోజకవర్గంపై కనే్నశారు. పార్టీ ఆయనను అనకాపల్లి లోక్‌సభకు వెళ్లమంది. ఎక్కడికక్కడ ప్రత్యర్థులు బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతుండటంతో ఆయన పోటీ నుంచి వెనక్కు తగ్గాలని భావిస్తున్నారు. ఆయన సోదరుడు రఘును అనకాపల్లి అసెంబ్లీ నుంచి బరిలోకి దించుతున్నారు. టిడిపిలో సీనియర్ నాయకునిగా ఉండి, విధానమండలి ప్రతిపక్ష నాయకునిగా పనిచేసి, ఇప్పుడు వైకాపాలోకి వచ్చిన దాడి వీరభద్రరావు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబానికి జిల్లాలో తీవ్ర ప్రతికూలత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పోటీ చేయడానికి ధైర్యం సరిపడకపోయినా, పిసిసి అధ్యక్షునిగా పనిచేసినందువలన విధిగా బరిలోకి దిగాలి. ప్రస్తుతం బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన అనుచరులంతా వైకాపాలో చేరిపోయారు. వేస్తున్నారు. ఇక బొత్స బంధువులు ఇద్దరు ఇప్పుడు గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వీరిద్దరి భవిష్యత్ కూడా ప్రశ్నార్థంగా మారనుంది.
సీనియర్ రాజకీయ నాయకులకు గడ్డుకాలం వచ్చింది
english title:
seniors
Date:
Tuesday, March 18, 2014