గుంటూరు, మార్చి 17: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్‌గా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలు పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారయ్యాయి. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 12 మున్సిపాల్టీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రావడంతోనే 11 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం దాదాపు తేలిపోనుంది. దీంతో అభ్యర్థులు తాము ఎదుర్కోవాల్సిన అసెంబ్లీ ఎన్నికలంటే ముందు మున్సిపాల్టీలపై దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగనుండగా, మిగిలిన 10 మున్సిపాల్టీలు ఒక్కొక నియోజకవర్గ పరిధిలో అంతర్భాగంగా ఉన్నాయి. గుంటూరు నగర పరిధిలో ఎన్నికలు వాయిదా పడటంతో ఇక్కడి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఒకింత ఊపిరిపీల్చుకున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళగిరి, తెనాలి, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు తేలిపోనుంది. బాపట్ల పార్లమెంటు పరిధిలోని గుంటూరు జిల్లాలో రేపల్లె, బాపట్ల మున్సిపాల్టీలు ఉండగా, ప్రకాశం జిల్లాలో చీరాల, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తి నగర పంచాయతీల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. బాపట్ల పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడింట 5 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం మున్సిపల్ ఎన్నికలతో తేలిపోనుంది. ఇక తెలుగుదేశం, వైసిపిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, పల్నాడులో నర్సరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గ పరిధిలోని పిడుగురాళ్లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 4 చోట్ల టిడిపి, మాచర్లలో వైసిపి, సత్తెనపల్లిలో కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల తర్వాతో లేదా బాగా ముందుగానో జరిగితే అసెంబ్లీ అభ్యర్థులు ఈ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. మున్సిపల్ ఫలితాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు అతి తక్కువ రోజులు ఉన్నందున ఈ ఫలితాలు ఆ ఎన్నికలపై పడే అవకాశాలు అధికంగా ఉంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్‌గా భావిస్తున్న మున్సిపల్
english title:
testing times
Date:
Tuesday, March 18, 2014