ఖమ్మం, మార్చి 19: ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో గడిచిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఈ సారి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొనటంతో ఎవరికి వారు తమకు అధిష్ఠానం టిక్కెట్ ఇస్తుందా లేదా అనే దానిపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ శాసనసభ్యులుగా పాలేరులో ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క, అశ్వారావుపేటలో ఒగ్గెల మిత్రసేన, భద్రాచలంలో కుంజా సత్యవతి, పినపాకలో రేగా కాంతారావులున్నారు. అయితే ఇందులో భట్టి మినహా మిగిలిన వారి పోటీ విషయంలో స్పష్టత రాలేదు. పాలేరులో రాంరెడ్డివెంకటరెడ్డికి బదులుగా కందాళ ఉపేందర్‌రెడ్డి గాని, రాంరెడ్డి వారసుడు గాని పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆశ్చర్యకరంగా దీనిపై మంత్రి సైతం నోరుమెదపటం లేదు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అందులో తానే పోటీ చేయాలని మిగిలిన నేతలంతా స్పష్టం చేసినప్పటికీ తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని స్పష్టంగా చెప్పలేకపోయారు. మధిర నియోజకవర్గంలో తిరిగి భట్టి విక్రమార్క పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇంక అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ నేతల నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. పినపాక నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై ఆ నియోజకవర్గానికి చెందిన నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఏకంగా పరిశీలకులకే ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని, ఇస్తే తాము కూడా పోటీ చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యవతికి అక్కడున్న ఇతర నేతలకు మధ్య విభేధాలు రాష్టస్థ్రాయికి చేరాయి. భద్రాచలం పట్టణ కమిటీ ఎంపిక విషయంలో వచ్చిన విభేధాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీస్ జారీ చేసే స్థాయికి చేరింది. దీంతో సత్యవతి వ్యతిరేకవర్గమంతా ఏకమై ఆమెకు టిక్కెట్ ఇవ్వొద్దని, వేరే పేరును సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంక అశ్వారావుపేట విషయంలో ఐదేళ్ళపాలనలో మిత్రసేన ప్రజలతో సత్సంబంధాలు నెరపలేదని, ఆయనకు టిక్కెట్ ఇవ్వటం వల్ల పార్టీ గెలిచే సీటును పొగొట్టుకుంటుందంటూ ఆ నియోజకవర్గానికిచెందిన నేతలు మరో వ్యక్తి పేరును తెరపైకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్సేతర పార్టీలకు చెందిన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, వైరా నియోజకవర్గాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో రోజుకో పేరు విన్పిస్తుండటంతో అక్కడున్న స్థానిక నేతల్లో అయోమయం నెలకొంది. స్పష్టంగా ఫలానా వ్యక్తి పోటీ చేస్తాడని చెప్పకపోవటంతో ఎవరికి వారు తామేపోటీ చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. అటు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట వచ్చే సమస్యలే లేని చోట కూడా వస్తుండటంతో అగ్రనేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. దీనిపై పలువురు సీనియర్ నేతలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, తద్వారా ప్రచారానికి సమయం ఉంటుందని, పార్టీ నిర్ణయాన్ని విభేధించే వారిని బుజ్జగించేందుకు కూడా అవకాశం ఉంటుందని వారు ఆయనకు సూచించగా ఆయన సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
శ్రీ సీతారాముల కల్యాణోత్సవ టిక్కెట్లు సిద్ధం
భద్రాచలం టౌన్, మార్చి 19: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ టిక్కెట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు దేవస్థానం అధికారులు బుధవారం తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టిక్కెట్ల అమ్మకాన్ని ముందుగానే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఉభయదాతల టిక్కెట్లకు రూ.3016లు (1250 టిక్కెట్లు), 2 వేల రూపాయల టిక్కెట్లు 1425 సిద్ధం చేశారు. అలాగే రూ.1116ల టిక్కెట్లు 950, రూ.500ల టిక్కెట్లు 1500, రూ.200ల టిక్కెట్లు 7768, రూ.100ల టిక్కెట్లు 6032లు ఉన్నాయన్నారు. అలాగే 9న పట్ట్భాషేకం టిక్కెట్లు రూ.250లవి 1425, రూ100లవి 2500లు విక్రయించనున్నట్లు తెలిపారు. ఉభయదాతల టిక్కెట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. మరో రెండు రోజుల్లో మిగిలిన కేటగిరిల టిక్కెట్లు విక్రయించబడునని పేర్కొన్నారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
* గన్‌మెన్‌లతో ఓఎస్‌డి రమణకుమార్
* పిస్టల్, కార్బన్ వెపన్‌లలో శిక్షణ
ఖమ్మం(స్పోర్ట్స్), మార్చి 19: గన్‌మెన్‌లు తమ విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, అలసత్వం ప్రదర్శించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఓఎస్‌డి(పరిపాలన) వైవి రమణకుమార్ అన్నారు. బుధవారం రఘనాథపాలెం మంచుకొండలో పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగిన శిక్షణలో అంగ రక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న 60మంది పోలీస్ సిబ్బంది పిస్టల్, కార్బన్ వెపన్‌లతో ఫైరింగ్ సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రానున్న మున్సిపల్, ఎంపిటిసి, జడ్పీటిసి, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపధ్యంలో అధికారులకు రాజకీయ నాయకులకు ఉండే గన్‌మెన్‌లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఫైరింగ్‌లో పూర్తి పరిజ్ఞానం, నైపుణ్యం కలిగి ఉన్న వారినే గన్‌మెన్‌లుగా నియమించడం జరుగుతుందని అన్నారు. అధికారులకు, రాజకీయ నాయకులకు కేటాయించిన గన్‌మెన్‌లకు అందరు తప్పని సరిగా వారి వెంటనే ఉండాలని, వారి రక్షణకై ఎలా మెలగాలో పర్యవేక్షించుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న గన్‌మెన్‌లు తమ టీమ్‌లోని ఇతర సభ్యులతో సంభాషించటం గాని, బయట వ్యక్తులతో మాటల్లో పడటం గాని చేయకూడదన్నారు. అనుమానితులను సునిశితంగా పరిశీలించారని, రాజకీయ పార్టీల సభలు, సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేసే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లకు సమాచారం ఇచ్చినట్లయితే అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శిక్షణలో తీసుకున్న జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు పునః పరిశీలించుకోవాలన్నారు. అలసత్వం లేకుండా తమ వద్ద ఉన్న ఆయుదాలను వినియోగించటానికి అనువుగా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే క్రమ శిక్షణ చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శంకర్, ఆర్‌ఎస్‌ఐలు నాగేశ్వరరావు, నర్సయ్య, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోటాపోటీగా నామినేషన్లు
ఖానాపురం హవేలి, మార్చి 19: జిల్లాలోని 46జడ్పీటిసి స్థానాలకు ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సాయంత్రం సమయంలో మాత్రం ఊపందుకుంది. 5గంటలకు నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ పదుల సంఖ్యలో అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి గదిలో ఉండటంతో వారందరి నామినేషన్లు కూడా రాత్రి 10గంటల వరకు స్వీకరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసీ, టిఆర్‌ఎస్ అభ్యర్థులతో పాటు జనసేన పార్టీ తరుపున కూడా ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయటం గమనార్హం. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎర్రుపాలెంకు పంభి సాంబశివరావు, రఘునాథపాలెంకు బాణోతు తారాదేవి, కూనవరానికి కన్యకా పరమేశ్వరి, జమున, చండ్రుగొండకు గాదే శివప్రసాద్, నరుకుళ్ళ సత్యనారాయణ, విఆర్‌పురానికి ముత్యాల కుసుమాంబ, కామేపల్లికి పుచ్చకాయల సత్యనారాయణ, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, కల్లూరుకు గుగులోతు నాగమణి, జర్పుల లీలావతి, వేంసూరుకు గుగులోతు పాషా, గుగులోతు రాధాకృష్ణ, సత్తుపల్లికి బొల్లా రజిని, గార్లకు మీగడ మమత, తోట విజయకుమారి, చింతకానికి పెంట్యాల భారతమ్మ, వంకాయలపాటి అంజలి, తిరుమలాయపాలెంకు బోడా హైమావతి, బోడా జయ, నేలకొండపల్లికి తేజావత్ అరుణాభాయ్, ధారావత్ శాంతి, ఏన్కూరుకు కొపెళ్ళ శ్యామల, కొపెళ్ళ రామారావు, రఘునాథపాలెంకు వీరు అజ్మీర, వైరాకు చప్పిడి స్వరూపరాణి, ఖమ్మం రూరల్‌కు ధారావత్ భారతి, బాదవత్ వినోదలు నామినేషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి అశ్వారావుపేట నుంచి తుమ్మా రాంబాబు, టేకులపల్లి నుంచి లక్కినేని సురేంద్రరావు, భుక్యా పాపా నాయక్, గుండాలకు షామీమ్, అంతోజు పద్మావతి, సింగరేణికి తోటకూరి పిచ్చయ్య, తోటకూరి శ్రీనివాసరావు, పగడాల మంజుల, బయ్యారంకు చేకూరి రవి, గార్లకు కోటా అనసూర్య, షేక్ పాషాబేగం, గంటే గాయత్రి, ఎద్దు మాధవి, ఖమ్మం రూరల్ నుంచి ధారావత్ రాంబాయి, వాజేడుకు సోడెపొంగు లక్ష్మి, ఇల్లెందుకు యనమద్ది ధనమ్మ, అశ్వాపురంకు వెన్నా అశోక్‌కుమార్, వేంసూరుకు వాసం రాములు, కొణిజర్లకు ధారావత్ బాబులాలు, మధిరకు ఎం ప్రియాంక, మూడు చంద్రిక, నేలకొండపల్లికి భుక్యా శైలజ, కొత్తగూడెంకు గిడ్లు పరంజ్యోతిరావు, బూర్గంపాడుకు బాణోతు మురళీకృష్ణ, రఘునాథపాలెంకు భుక్యా లక్ష్మయ్య, కామేపల్లికి సీతకోటి వీరనాగులు, మేకల మల్లిబాబు యాదవ్, చింతకానికి కూరపాటి తిరీషలు జడ్పీటిసి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సింగరేణి జడ్పీటిసి స్థానానికి విష్ణువర్థన్‌రెడ్డి, వైరా నుంచి బొర్రా ఉమాదేవి, తిరుమలాయపాలెం నుంచి బాణోతు స్వప్న, ఇల్లెందు నుంచి గీతపల్లి జానకీ, టేకులపల్లి నుంచి ఏలూరి కోటేశ్వరరావు, పెనుబల్లి నుంచి మాలోతు రాధ, పినపాక నుంచి పంతగాని సంధ్యారాణి, వేంసూరు నుంచి బాణోతు నాను, అశ్వారావుపేట నుంచి దండబత్తుల వెంకటనర్సయ్య, పానుగంటి లక్ష్మణ్‌రావు, అశ్వాపురం నుంచి జీవరత్నం, దుమ్ముగూడెం నుంచి నిడమనూరు మోహన్‌రావు, ఎర్రుపాలెం నుంచి అంకసాల శ్రీనివాసరావు, కల్లూరు నుంచి బాణోతు ఝాన్సీ, కొణిజర్ల నుంచి గుగులోతు లక్ష్మిభాయిలు ఆయా మండలాలకు జడ్పీటిసి స్థానాలకు దాఖలు చేశారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నుంచి జడ్పీటిసి స్థానానికి ఇల్లెందుకు బాయా శారద, అరుణ, గుండాల నుంచి గొగ్గెళ్ళ లక్ష్మి, కోరం కళావతి, ములకలపల్లి నుంచి యర్రగొర్ల రామారావు, తిరుమలాయపాలెం నుంచి బోడా జ్యోతి, సత్తుపల్లి నుంచి పుచ్చ కృష్ణవేణి, చండ్రుగొండ నుంచి ఎస్‌కె ఉమర్‌మియా, టేకులపల్లి నుంచి ధర్మపురి వీరబ్రహ్మాచారి, బయ్యారం నుంచి నూతక్కి మధుసూధన్‌రావులు నామినేషన్లు దాఖలు చేశారు.
సిపిఐ నుంచి జడ్పీటిసి స్థానాలకు కూనవరం నుంచి లంబు వెంకటలక్ష్మి, గార్ల నుంచి రాగం ధనలక్ష్మి, ములకలపల్లి నుంచి నారటి ప్రసాద్, పువ్వాడ మంగపతి, కొణిజర్ల నుంచి మూడు రమేష్, మణుగూరు నుంచి తాటి సీత, బూర్గంపాడు నుంచి సప్పం నాగేశ్వరరావు, పొదెం కాంతిలు నామినేషన్లు దాఖలు చేశారు.
సిపిఎం నుంచి జడ్పీటిసి స్థానాలకు గార్ల మండలంకు కందునూరి సుజాత, కందునూరి కవిత, అశ్వారావుపేట మండలం నుంచి బుడితి చిరంజీవిలు ఆయా మండలాల జడ్పీటిసి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.
టిఆర్‌ఎస్ పార్టీ నుంచి జడ్పీటిసి స్థానానికి ముదిగొండ మండలం నుంచి వనం సీతారామయ్య, నేలకొండపల్లి నుంచి తేజావత్ నాగమ్మలు నామినేషన్లు దాఖలు చేశారు.
జనసేన పార్టీ నుంచి కూసుమంచి మండలానికి చెందిన బాణోతు పద్మ జడ్పీటిసికి నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా ఖమ్మం రూరల్ మండలం నుంచి బాణోతు రాజేశ్వరి, దుమ్ముగూడెం నుంచి పాతర్లపాటి వెంకట సత్యనారాయణ రాజు, వేలేరుపాడు నుంచి మామిళ్ళపల్లి శ్యామల, భద్రాచలం నుంచి ముద్దా పిచ్చయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు.
తెలుగుదేశం పార్టీ తరుపున జడ్పీటిసి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి స్వర్ణకుమారిలు హాజరయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను దాఖలు చేసేందుకు మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఏఎంసి చైర్మన్ రాధాకిషోర్, నేలకొండపల్లి ఏఎంసి చైర్మన్ వున్నం బ్రహ్మయ్యలు హాజరయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులతో ఆ పార్టీ పార్లమెంటరి నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్లను దాఖలు చేయించారు. అదే విధంగా సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు నామినేషన్లు దాఖలు చేయించారు. సిపిఐ నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు జడ్పీటిసి స్థానాలకు నామినేషన్లను దాఖలు చేయించారు. ఇదిలా ఉండగా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తుండగా, ఖమ్మం డిఎస్పీ బాలకిషన్‌రావు నామినేషన్ కేంద్రాలను సందర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించే వారినే ఎన్నుకుందాం
ఖానాపురం హవేలి, మార్చి 19: ప్రభుత్వపాఠశాలల అభివృద్ధికి సహకరించే వారిని ఎంపిటిసి, జడ్పీటిసి, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని విస్మరించి ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వాలు మద్దతునిస్తూ అభివృద్ధి చేయిస్తున్నాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించే వారిని గెలిపించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని పార్టీలు మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలన్నారు. రాష్ట్రంలో 58వేల పాఠశాలలుండగా, అందులో 42వేల పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులే పని చేస్తున్నారని, 7,715పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచటంతో పాటు వౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. అదే విధంగా రాష్ట్రంలో సుమారు 900ఎంఇఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిన భర్తీ చేయాలని కోరారు. పాలకులు, ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించటంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా జిల్లాలో మహిళా ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు ఎన్నికల విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉపాధ్యాయినులకు సుదూర ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చి ఖమ్మంకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు ఎన్నికల విధులు కేటాయించాలని కోరారు. అదే విధంగా పదో తరగతి పరీక్షలకు ప్రాథమిక, ప్రాథమికొన్నత ఉపాధ్యాయులను కాకుండా ఎస్‌జిటిలకు అవకాశం కల్పించాలని సూచించారు.
విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, వీరబాబు, చావా రవి, నాయకులు ఉద్దండు, కృష్ణారావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం అసెంబ్లీ టికెట్ మైనార్టీలకే కేటాయించాలి
ఖమ్మం(ఖిల్లా), మార్చి 19: మైనార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజక వర్గం టిక్కెట్ ఇవ్వాలని, అభ్యర్థిని అత్యిధిక మెజార్టీతో గెలిపిస్తామని పలు ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మానేర్ లా కాలేజీ ఆవరణలో ముస్లిం జెఎసి, మైనార్టీ ఉద్యోగ సంఘం, రిటైర్డ్ ముస్లిం మైనార్టీస్ ఎంప్లాయిస్ అసోసీయేషన్, జిల్లా ఆర్‌ఎంపి ముస్లిం మైనార్టీ సంఘం తదితర ముస్లిం మైనార్టీ సంఘ నాయకుల సమావేశం ఖమ్మం మాజీ శాసనసభ్యుడు యూనిస్‌సుల్తాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ప్రతి సారి ఒక మైనార్టీ అభ్యర్థికి పార్టీ టిక్కెట్ ఇస్తుందన్నారు. అలాగే ఇసారి కూడా ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గానికి ముస్లిం మైనార్టీ అభ్యర్థికే టిక్కెటు కేటాయించాలన్నారు. ఖమ్మం అసెంబ్లీ పరిధిలో ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారని, తమ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ముస్లింలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని దాన్ని దృష్టిలో ఉంచుకొని ముస్లిం మైనార్టీలకే పార్టీ టిక్కెట్ ఇవ్వాలన్నారు. జిల్లాలోని 10అసెంబ్లీ, పార్లమెంటు నియోజక వర్గాల్లో గెలుపు ఓటములపై తమ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వౌలానా సరుూద్‌ఖాస్మి, మహ్మద్ యాకూబ్‌సాహేబ్, అక్బర్‌మూసా, యాకూబ్‌పాషా, ఇక్బాల్ ఉద్దిన్, నజీర్, మక్బుల్, అబ్థుల్‌నబీ, సాజిద్, సాబిర్, హకీం తదితరులు పాల్గొన్నారు.
10 అసెంబ్లీ, 2పార్లమెంట్ స్థానాలకు టిఆర్‌ఎల్‌డి పోటీ
ఖమ్మం(ఖిల్లా), మార్చి 19: జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 10 అసెంబ్లీ, 2పార్లమెంట్ స్థానాలకు తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెత్తందారి, దొరల పాలనను తెచ్చేందుకు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. అభివృద్ధికి నోచుకోని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పిన టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మాటలుగానే మిగిలిపోతున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు సీట్లు ఇచ్చి గెలిపించాలని, ఆ దిశగా తాము ప్రయత్నిస్తామన్నారు. కోరుకుంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లికి తమ పార్టీ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తామని పేర్కొన్నారు. అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. అయితే అలా జరగడం లేదని అధికారం కోసం ఆరాటపడుతూ, ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకులకే నేటి రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై నిజమైన ఉద్యమకారులను తమ అభ్యర్థులుగా పోటీలో ఉంచి ఓడిస్తామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎల్‌డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, చెన్నోజు వెంకటరమణాచారి, శేషగిరిరావు, హన్మంతరావు, వీరబాబు, వీరభద్రం , పాషా, సాయి, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా నామినేషన్లు దాఖలు
కొణిజర్ల, మార్చి 19: పొత్తులు కుదరటంతో పాటు ముహూర్త బలం ఉండటంతో మూడవ రోజు బుధవారం ఎంపిటీసి స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీల నుంచి నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. మొత్తం 59 నామినేషన్ వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి బాబురావు తెలిపారు. సిపిఎం-15, వైఎస్‌ఆర్‌సిపి-5, తెలుగుదేశం-15, కాంగ్రెస్-13, సిపిఐ అభ్యర్థులు 10చోట్ల నామినేషన్లు వేశారు. సిపిఎం అభ్యర్థులు సింగరాయపాలెంలో వడ్లముడి ఉమారాణి, కొండవనమాల దొబ్బల కృష్ణవేణి, లింగగూడెం పాసంగులపాటి గన్నయ్య, లాలాపురం బాణోత్ శ్రీను, పల్లిపాడు తాటిపల్లి జయలక్ష్మి, అమ్మపాలెం షేక్ హసీనాబేగం, చిన్నగోపతి లింగాల దానమ్మ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున గుబ్బగుర్తి వత్సవాయి వెంకటరమణ, పెద్దమునగాల పఠాన్ మదార్‌ఖాన్, పెద్దగోపతి తాళ్ళూరి చిన పుల్లయ్య, కొణిజర్ల కాశీమళ్ళ జీవయ్య, గుండ్రాతి మడుగు పాముల వెంకటేశ్వర్లు, తనికెళ్ళ చల్లా మోహన్‌రావు, చిన మునగాల కొమ్ము ధనమ్మ, కొండవనమాల గోసు నాగమణి, పెద్దమునగాల తుప్పతి కోటయ్య, చిన గోపతి తడికమళ్ళ ఉమారాణి, పెద్దగోపతి కొల్లి నాగభూషణం, లింగగూడెం ఇంజం పిచ్చయ్య తెలుగుదేశం పెద్దగోపతి రామ మల్లయ్య, పల్లిపాడు నంజాల నాగమణి, లింగగూడెం దొండపాటి లక్ష్మి, అమ్మపాలెం కిలారు ఉమారాణి, పెద్దమునగాల షేక్ లాల్‌జాని నామినేషన్లు దాఖాలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు కొణిజర్ల-2 రొంటే జయమ్మ, గుబ్బగుర్తి దంతాల, సింగరాయపాలెం అనుమోలు, అమ్మపాలెం కోసూరి శ్రీను, తనికెళ్ళ ముప్పిడి జనార్ధన్, లింగగూడెం కోసూరి సీతారాములు, మల్లుపల్లి రాపోలు వెంకన్న నామినేషన్‌లు వేశారు. జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ(జడ్పీటీసి)కి కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా అమ్మపాలానికి చెందిన మూడ్ రమేష్, డమ్మిగా బాణోత్ వెంకన్న, సిపిఎం మద్దతుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాలెబంజర గ్రామానికి చెందిన బాణోత్ నరసింహారావు, డమ్మిగా గుగులోత్ లక్ష్మీబాయి నామినేషన్ వేశారు.
చర్ల మండలంలో విషజ్వరాలు
చర్ల, మార్చి 19: చర్ల మండల పరిధిలోని వెంకటచెరువు గ్రా మంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పది రోజులుగా అనేక మంది గిరిజనులు జ్వరాల బారిన పడ్డారు. గత ఆదివారం నుంచి మరో ఎనిమిది మంది వరకు విషజ్వరాన పడ్డారు. మరో వైపు గిరిజనులు జ్వరాల బారిన పడుతున్నా కనీసం వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి వైద్యసేవలందించకపోవడం విచారకరం. మండల పరిధిలోని వెంకటచెరువు గ్రామంలో 50 ఆదివాసీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పదిరోజులుగా వీరికి విషజ్వరాలు సోకుతున్నాయి. వీరు చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రాకుండా నాటు వైద్యంను ఆశ్రయిస్తున్నారు. దీంతో జ్వరాలు తగ్గుముఖం పట్టకపోగా సంఖ్య పెరుగుతోంది. బుధవారం విలేఖరుల బృందం వెంకటచెరువు గ్రామాన్ని సందర్శించగా ఇంటికొకరు చొప్పున జ్వరాలతో మూల్గుతున్నారు. కనీసం వారు లేవలేని పరిస్థితి ఉందంటే విషజ్వరాలు ఏ మేరకు సోకాయో ఇట్టే అర్థవౌతోంది. సోడి చిలకమ్మ, కట్టం పవన్, మిడియం స్వామి, కట్టం శేఖర్, కట్టం భూమిక, సురేష్, అనీత, భీమయ్యలు ఉన్నారు. ఇందులో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు. పదిరోజులుగా ఇక్కడ విషజ్వరాలు సోకుతున్నా చర్ల ప్రభుత్వ వైద్యాధికారు గానీ సంబంధిత ఏఎన్‌ఎంలుగా గానీ ఇటుగా కనె్నత్తి చూడటం లేదని వాపోతున్నారు. ఈ విషయాన్ని విలేఖరులు అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓకు ఫోనులో సమాచారం ఇవ్వగా విషజ్వరాల బారిన పడిన సంగతి తన దృష్టికి రాలేదన్నారు. చర్ల ప్రభుత్వ వైద్యులకు తెలిపి గురువారం ఆగ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు.