గుంటూరు, మార్చి 19: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో సర్వెలెన్స్, వీడియో వ్యూయింగ్ బృందాలతో జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో నియమావళిని అతిక్రమించి ఏ సంఘటన జరిగి నా తప్పక వీడియో తీయాలని ఆదేశించారు. వీడియో సర్వెలెన్స్ బృందంలో ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్, వీడియో వ్యూయింగ్ బృందంలో ఒక అధికారి, ఇద్దరు గుమస్తాలు ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఈ రెండు బృందాలు ఎన్నికల సంఘానికి కళ్లు, చెవులుగా పని చేయాలన్నారు. నమూనా ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన ప్రతి కార్యకలాపాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని, నిర్భయంగా, నిష్పక్షపాతంగా వీడియో గ్రఫి చేయించాలన్నారు. అన్ని రకాల వీడియో సిడిలను రిటర్నింగ్ అధికారికి నివేదిక అందించాలన్నారు. వీడియో సిడిలలో గల అంశాలు ఎన్నికల ఖర్చు వివరాలు కూడా పరిశీలించే అవకాశం ఉందన్నారు. ప్రతి మండలానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వీడియో గ్రాఫర్ తీసే వీడియలో తప్పక సమయం, తేదీ రికార్డు అయ్యేలా సెట్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ పార్టీ, ఏ అభ్యర్థిపై వీడియో తీసే విషయంలో ప్రాంతం పేరు, మాట్లాడుతున్న వాయిస్‌రికార్డు చేయాలని అలాగే బ్యానర్లు, కటౌట్లు వాటి సైజులు, ఎన్ని వాహనాలు, ఎటువంటి వాహనాలు వినియోగించినవి వీడియో రికార్డు చేయించాలని ఆయన సూచించారు. నమూనా ప్రవర్తనా నియమావళి అతిక్రమించిన వారిపై లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించినట్లయితే రిప్రజెంటేటివ్ పీపుల్ చట్టం కింద, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినట్లయితే మున్సిపల్ చట్టం కింద, ఎంపిటిసి, జడ్పీటీసి ఎన్నికలకు సంబంధించినట్లయితే పంచాయతీరాజ్ చట్టం కింద చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మెప్మా పిడి కృష్ణకపర్తి వీడియో సర్వెలెన్స్, వ్యూయింగ్ బృందాలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. అలాగే పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ శ్రీరామచంద్రమూర్తి పలు సూచనలు, సలహాలు బృందాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెసి వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల బలోపేతానికి టిడిపి కృషి
గుంటూరు (కొత్తపేట), మార్చి 19: స్థానిక సంస్థల బలోపేతానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల హామీ పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ 73,74 రాజ్యాంగ సవరణలో పేర్కొన్న 11వ షెడ్యూల్ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు చెందిన 29 అంశాలను స్థానిక సంస్థలకు తెలుగుదేశం ప్రభుత్వం బదిలీ చేస్తుందన్నారు. క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాల కొకసారి ఎన్నికలను విధిగా నిర్వహిస్తుందని, అధికార వికేంద్రీకరణ జరిపి, నిధులు, విధులను బదిలీ చేస్తుందన్నారు. ఎంపిటిసిలు, జడ్పీటీసీలకు ప్రాతినిధ్యం కల్పించటం, గౌరవ వేతనం పెంచడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాస్టారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి 1000 నుండి 2000 వరకు పెంచడం, వృద్ధులు, వితంతువులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 450 రూపాయలకే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్ల మంజూరు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు స్వామినాధన్, హుడా కమిటీల సిఫారసులను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వట్టికూటి హర్షవర్ధన్, షేక్ లాల్‌వజీర్, శ్రీరాం రాజీవ్ ఆనంద్, సగ్గెల రూబెన్, చంద్రగిరి ఏడుకొండలు, పగడాల శ్రీనివాసరావు, గుడిమెట్ల దయారత్నం, కొప్పాకుల నారాయణ, పరుచూరి కి షోర్, మైనం లక్ష్మీనారాయణ, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్యుడు
కుమారస్వామి సస్పెన్షన్
మాచర్ల, మార్చి 19: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని మాచర్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులు నెల్లూరి కుమారస్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా నియమావళికి విరుద్ధంగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఫిర్యాదులు రావటంతో విచారణ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ కుమారస్వామిపై వేటు వేసింది.
జిల్లాలో ఇంతవరకు కోటి నగదు స్వాధీనం
* 300 మందిపై బైండోవర్ కేసులు నమోదు
* రూరల్ ఎస్‌పి సత్యనారాయణ వెల్లడి
పొన్నూరు, మార్చి 19: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అక్రమంగా తరలిస్తున్న నగదును అరికట్టే చర్యలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టు ద్వారా కోటి రూపాయల నగదును, 300 గ్రాముల బంగారం, 20 కేజీల వెండి, 42 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా రూరల్ ఎస్‌పి సత్యనారాయణ వెల్లడించారు. 300 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. పొన్నూరులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు పనితీరును బుధవారం ఉదయం సత్యనారాయణ పరిశీలించారు. చెక్‌పోస్టు వద్ద పటిష్ఠతకు చేపట్టాల్సిన చర్యలను స్థానిక పోలీసు అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్, రూరల్ సిఐలు ఎండి హుస్సేన్, ఎం వీరయ్య, అర్బన్ ఎస్‌ఐలు చరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బకాయిదారుల ఇళ్ల ముందు దండోరా
గుంటూరు (కార్పొరేషన్), మార్చి 19: అధికమొత్తంలో ఆస్తిపన్ను చెల్లించాల్సిన బకాయిదారుల ఇళ్ల ముందు నగరపాలక సంస్థ అధికారులు బుధవారం డప్పుల మోత వినిపించారు. నగరపాలక సంస్థ కమిషనర్ నాగవేణి, ఎసి సాయిశ్రీకాంత్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌లు 5,6,7 డివిజన్ల పరిధిలోని పాత గుంటూరు పార్కు ఏరియా, ఎల్‌బి నగర్, క్రిస్టియన్‌పేట, బాలాజీ నగర్, నందివెలుగు రోడ్డు వీరయ్య చౌదరి నగర్, జాకీర్ హుస్సేన్‌నగర్, లాంచెష్టర్ రోడ్డు, ఓల్డ్ క్లబ్ రోడ్డులలో బకాయిదారుల ఇళ్ల ఎదుట డప్పులు వాయిస్తూ వెంటనే పన్ను చెల్లించాలని తెలియజేశారు. ఆర్‌ఆర్ యాక్టు ప్రకారం పన్ను చెల్లించకపోతే నగర ప్రధాన కూళ్లలో బకాయి దారుల పేర్లను ప్రదర్శిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఎస్‌ఎన్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వర్లు, జాన్‌బాబు, సాదక్ పాషా, బిల్ కలెక్టర్‌లు పాల్గొన్నారు.
పెదకాకాని ఆలయ పాలకమండలి
చైర్మన్‌గా సాంబశివరావు
పెదకాకాని, మార్చి 19: మండల కేంద్రమైన పెదకాకానిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివారి దేవస్థానానికి పాలకమండలి నూతన చైర్మన్‌గా బుధవారం కరణం సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ చైర్మన్ కాజా అంకమ్మరావు గత ఆరు నెలలుగా చైర్మన్ పదవి నిర్వహించారు. కాగా ఒప్పందం ప్రకారం మిగిలిన 18 నెలలకు కరణం సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఇఒ ఆదేశాలు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ధర్మకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల పరిశీలకుని పర్యటన
మంగళగిరి, మార్చి 19: పట్టణంలో ఈనెల 30న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అబ్జర్వర్ పి లక్ష్మీనరసింహం బుధవారం పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఏర్పాట్లను, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ తరువాత ఇవిఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూంను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అబ్జర్వర్ లక్ష్మీ నరసింహం పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. ఏప్రిల్ 2వ తేదీన మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘంలో పోలైన ఓట్లను పట్టణంలోని విటిజెయం అడ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో లెక్కించనున్నారు.
రక్తదానాన్ని అందరూ ప్రోత్సహించాలి
గుంటూరు (పట్నంబజారు), మార్చి 19: రక్తదానంపై విద్యార్థులు అపోహలను వీడి అందరూ రక్తదానం చేసే విధంగా ప్రోత్సహించాలని ఆర్‌విఆర్ బిఇడి కళాశాల కార్యదర్శి గద్దె మంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ దిగుమర్తి భాస్కరరావు మాట్లాడుతూ అన్నిదానాల్లోకెల్లా రక్తదానం ఎంతో విశిష్ఠమైందన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు కన్వీనర్ డాక్టర్ ఎం రవికుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఎన్‌టిఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ షమీనా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.