ఒంగోలు, మార్చి 19: జిల్లాలో తొలివిడత జరిగే మున్సిపల్ ఎన్నికలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీలకు చావోరేవోగా మారడంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ముమ్మర ప్రచారంలో మునిగి తేలుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 142 వార్డుల్లో 592 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు. మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 92 మంది, చీరాల మున్సిపాలిటీ పరిధిలో 161 మంది, అద్దంకి నగర పంచాయతీలో 68 మంది, చీమకుర్తి నగర పంచాయతీలో 78 మంది, కనిగిరి నగర పంచాయతీలో 105 మంది, గిద్దలూరు నగర పంచాయతీలో 88 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ప్రధానంగా 145 వార్డులు ఆయా మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఉండగా తెలుగుదేశం పక్షాన రెండు వార్డులు, వైకాపా తరపున ఒక వార్డు ఏకగ్రీవమైంది. వాటి పరిధిలో వైకాపా తరుపున 140 మంది, తెలుగుదేశం పార్టీ తరుపున 135మంది, కాంగ్రెస్ పార్టీ తరుపున 49 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్, గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు, అద్దంకి మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్యలు స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల బరిలో దించారు. వారు కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ సత్తా చాటేందుకు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల వ్యవహారం కోర్టులో ఉన్నందున వాటిని వాయిదా వేశారు. చీరాల మున్సిపాలిటీ జనరల్, మార్కాపురం మున్సిపాలిటీ జనరల్ మహిళ, అద్దంకి నగర పంచాయతీ ఎస్‌సి మహిళ, గిద్దలూరు నగర పంచాయతీ బిసి జనరల్, చీమకుర్తి నగర పంచాయతీ బిసి జనరల్, కనిగిరి నగర పంచాయతీ బిసి జనరల్‌కు కేటాయించారు. చీమకుర్తి నగర పంచాయతీని బిసి జనరల్‌కు కేటాయించినప్పటికీ ఆ ఎన్నికలను మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సి శిద్దా రాఘవరావులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగా ఈ నగర పంచాయతీ పరిధిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ ఉండటం, కోట్లాది రూపాయల మేర ప్రభుత్వానికి సీనరేజి రూపంలో వస్తుంది. దీంతో ఈ నగర పంచాయతీపై నేతలు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రధానంగా నియోజకవర్గ కేంద్రాలైన చీరాల, మార్కాపురం, అద్దంకి, కనిగిరిల్లోని వైకాపా, తెలుగుదేశం, ఇండిపెండెంట్ల అభ్యర్థులకు ఈ ఎన్నికలు సవాల్‌గా నిలిచాయి. ఈ ఎన్నికల ప్రభావం త్వరలో జరగనున్న జడ్‌పిటిసి, ఎంపిటిసి, అసెంబ్లీ, పార్లమెంటుపై పడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏమాత్రం ఆయా రాజకీయపక్షాలు అశ్రద్ధ చేసినా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఏర్పడటంతో ఆయా పార్టీలకు చెందిన జిల్లా పార్టీ, నియోజకవర్గ ఇన్‌చార్జులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆయా మున్సిపాలిటీలు, వార్డుల్లో పోటీచేసే అభ్యర్థులకు నగదు, మద్యం పంపిణీ చేసేందుకు అసెంబ్లీ, పార్లమెంటు తరుపున పోటీచేసే ఆశావహులు సిద్ధంగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. మొత్తంమీద అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
వేడెక్కిన మండల రాజకీయాలు
ఎంపిపి పదవిపై ప్రధాన పార్టీల కన్ను
అద్దంకి, మార్చి 19: మండల పరిషత్ ఎన్నికల నామినేషన్లతో మండలంలోని గ్రామాల్లో కూడా ఎన్నికల వేడి రగిలింది. ఎంపిపి పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అద్దంకి పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న తరుణంలో ఎంపిటిసిల నామినేషన్లు జరుగుతుండడంతో పట్టణంలో ఎన్నికల సెగ పెరిగింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్దకు టిడిపి, వైసిపి జెండాలతో కార్యకర్తలు ట్రాక్టర్లపై వచ్చి అభ్యర్ధుల చేత నామినేషన్లు వేయించారు. ఇరుపార్టీల కార్యకర్తలతో మండల పరిషత్ కార్యాలయం రహదారి కిటకిటలాడింది. 17వ తేది నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికి మూడవరోజైన బుధవారం ఎంపిటిసిల నామినేషన్లు వేశారు. మిగిలిన అభ్యర్ధులంతా గురువారం నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మొత్తం 14 ఎంపిటిసి ప్రాదేశికాలుండగా వాటిలో ధేనువుకొండ, మోదేపల్లి, కొటికలపూడి, రామాయపాలెం, శింగరకొండపాలెం, వెంపరాల, చినకొత్తపల్లి, ధర్మవరం, శంఖవరప్పాడు, కలవకూరు, బొమ్మనంపాడు, జార్లపాలెం, నాగులపాడు, మణికేశ్వరం ఉన్నాయి. బుధవారం 14 ప్రాదేశికాలకు గాను 23మంది అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. గత మూడు రోజులుగా టిడిపి, వైసిపి కార్యాలయాల్లో నాయకులు కసరత్తు చేసిన అనంతరం ఎంపిక చేసిన అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపాలిటీ, ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ప్రామాణికం కానున్నాయి. ఈఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరుపార్టీల నాయకులు తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభ్యర్ధులకు ఆర్ధిక తోడ్పాటు కూడా అందించేందుకు హామీలిచ్చారు. గ్రామాల్లో తమవర్గాలను కాపాడుకునేందుకు ఎన్నికల్లో విజయమే పరమావధిగా పెట్టుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
మున్సిపల్ పోరుతో వేడెక్కుతున్న రాజకీయాలు
మార్కాపురం, మార్చి 19: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నేతలు ప్రచారబాట పట్టారు. వార్డులస్థాయిలో ఏ అభ్యర్థికి ఆ అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాన నాయకులు మాత్రం ఉదయం 8గంటలలోపే రోజుకు రెండు నుంచి మూడువార్డుల్లో పర్యటించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నామినేషన్లు ముగిసేవరకు స్తబ్దతగా ఉన్న పట్టణ రాజకీయాలు ప్రచారపర్వం ప్రారంభం కాగానే వేడెక్కాయి. ఇప్పటికే టిడిపికి రెండువార్డులు ఏకగ్రీవం కావడం, ఎమ్మెల్యే ఓటు ఉండటంతో మరో 14స్థానాలు కైవసం చేసుకుంటే చైర్మన్ పదవి దక్కించుకోవచ్చునని టిడిపి నేతలు భావిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు మాత్రం డాక్టర్‌గా అభ్యర్థికి ఉన్న మంచిపేరు, ఆమె భర్త స్వర్గీయ కిశోర్‌రెడ్డి మైస్ సంస్థ ద్వారా పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పథకాలు, కెపి కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డిలకు ప్రజల్లో బలం తమకు గెలుపుతెచ్చి పెడుతుందనే భావనతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఇరుపార్టీలు ఈ పర్యాయం చైర్మన్ పదవి తమదంటే తమదంటూ ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాగా గత ఎన్నికల్లో సిపిఐ పొత్తు కాంగ్రెస్‌పార్టీకి కలిసి రాగా ప్రస్తుతం సిపిఐ టిడిపితో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం. పొత్తులో భాగంగా టిడిపి సిపిఐకి 13, 17వార్డులను కేటాయించగా 13వార్డులో ఇప్పటికే తమ గెలుపు ఖాయమని, 17వార్డులో కూడా సీనియర్ సిపిఐ నేత అందె నాసరయ్య విజయం సాధిస్తారని టిడిపి నేతలు భావిస్తున్నారు. కాగా ఈ సారి సిపిఎంపార్టీ టిడిపితో పొత్తుపెట్టుకొని 14వార్డు నుంచి పోటీ చేయడం ఆ వార్డులో కూడా సిపిఎం విజయం సాధించే అవకాశాలు ఉండటంతో కొంత బలం పెరిగింది. ఈ దశలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు మరో 10రోజుల్లో ఎన్నికలు ఉన్నందున పట్టణంలో తమ సత్తా ఏమిటో చూపుతామని, ఆ పార్టీకి విజయం అంత సులువుకాదని భావిస్తున్నారు.
విభజించి పాలించే మనస్తత్వం మాదికాదు
* అన్నిసామాజికవర్గాల అండతోనే రాజకీయాల్లో పనిచేశాం
* టిడిపి నేతల మాటలు విని మోసపోవద్దు
* వైఎస్‌ఆర్‌సిపి నేతలు కెపి, జంకె, వెన్నా
మార్కాపురం, మార్చి 19: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విషయంలో తాము ఒక సామాజికవర్గాన్ని విస్మరించినట్లు తెలుగుదేశంపార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీఎమ్మెల్యేలు కెపి కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము వైశ్య సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయత్నించామని, అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ కనకదుర్గాను పోటీ చేయించాల్సి వచ్చిందని, ఈవిషయాన్ని టిడిపి నేతలు చిలవలుపలవలుగా చేసి ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని పట్టణప్రజలను కోరారు. ఐదేళ్ళపాటు శాసనసభ్యునిగా ఉండి పట్టణానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని వారు కందులను ప్రశ్నించారు. మాజీఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రస్తుత ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీలు అత్యధికశాతం గెలుచుకోవడం జరుగుతుందని, రానున్న శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో అధికారం చేపట్టడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ విద్యావంతురాలై నిత్యం ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన డాక్టర్‌ను వైఎస్‌ఆర్‌సిపి తరుపున పోటీ చేయించామని, ప్రజలు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మార్కాపురం పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈవిలేఖరుల సమావేశంలో పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డి, మొగుళ్ళూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ నష్టం రూ. 160కోట్లు
- ఇడి సూర్యచంద్రరావు వెల్లడి
కందుకూరు రూరల్, మార్చి 19: రాయలసీమ ఆర్టీసీ రీజనల్ పరిధిలోని 32 డిపోల్లో 2013 మార్చి నుండి 2014 ఫిబ్రవరికి 160 కోట్లు నష్టం వచ్చినట్లు ఆర్టీసీ రాయలసీమ రీజనల్ ఇడి సూర్యచంద్రరావు వెల్లడించారు. బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోను సాధారణ తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో 80 కోట్లు నష్టం వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ఆర్టీసీ మనుగుడకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 50శాతం ఇఆర్ ఉన్న బస్సు సర్వీసులు నడపటంలో లాభనష్టాలు బేరిజు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ వలన ప్రయోజనాలను ప్రయాణికులకు వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాద బీమా, ప్రమాదంలో గాయపడితే వైద్యఖర్చులు ఆర్టీసీ భరిస్తుందని, ప్రయివేటు వాహనాలు ఎలాంటి హామీ ఇవ్వవన్నారు. ఆర్టీసీ ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించనున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీ డిఎంలు ప్రతిరోజు కొంత సమయం బస్టాండ్‌లో కేటాయించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో డిఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేయండి
డిసిసి అధ్యక్షుడు ఉగ్ర పిలుపు
పొదిలి, మార్చి 19: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని డిసిసి అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పొదిలి మండలం నుండి ప్రాదేశికాలకు పోటీచేయనున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఆయన పార్టీ కార్యాలయంలో బి ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేద, బలహీన వర్గాల అభివృద్ధి జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎం సుల్తాన్ మొహిద్దీన్, ఎం బడే, జి రవితేజ, ఎస్ నసురుద్దీన్ తదితరులను పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు.
పోలీస్ సిబ్బందికి ఎస్‌పి అభినందనలు
ఒంగోలు, మార్చి 19: ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 47వ రాష్టస్థ్రాయి పోలీస్ క్రీడల్లో పాల్గొని గెలుపొందిన జిల్లా పోలీసులను జిల్లా ఎస్‌పి పి ప్రమోద్‌కుమార్ బుధవారం అభినందించారు. బహుమతులు గెలుచుకున్న సిబ్బందికి నగదు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ఈనెల 11 నుండి 15వ తేది వరకు విశాఖ నగరంలో 47వ రాష్టస్థ్రాయి పోలీస్ క్రీడలు నిర్వహించారని తెలిపారు. ఈ క్రీడల్లో గుంటూరు రేంజి పరిధిలోని జిల్లా పోలీసులు ఎక్కువ పతకాలు సాధించినట్లు తెలిపారు. కబాడ్డీలో మూడో స్థానాన్ని సాధించారన్నారు. బాక్సింగ్‌లో కందుకూరుకు చెందిన పి గోపి, వెయిట్ లిఫ్టింగ్‌లో గీత, ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో వరలక్ష్మీ అనే హెడ్ కానిస్టేబుల్ మూడో స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. 400 మీటర్ల పరుగు పందెంలో పెద్దారవీడుకు చెందిన మధురవాణి ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. 400 మీటర్ల పరుగు పందెంలో జె అనీల్‌కుమార్ బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. 110 బై హార్డ్ లెస్ ద్విడీయ స్థానం ,400 హార్డ్‌లెస్‌లో ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. ఫుట్‌బాల్‌లో కెప్టెన్ డి రాజేంద్ర 6వ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. గెలుపొందిన సిబ్బందిని జిల్లా ఎస్‌పి ప్రమోద్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
నేటి నుండి జిల్లాలో షర్మిల ప్రచార భేరి
ఒంగోలు, మార్చి 19 : వైకాపా రాష్ట్ర నాయకురాలు షర్మిల ఈనెల 20 నుండి 22వ తేది వరకు జిల్లాలో జరిగే ప్రచారభేరి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ బుధవారం విలేఖర్లకు తెలిపారు. ఈనెల 20వ తేదిన చీమకుర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రచారభేరి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు కనిగిరి, 21న గిద్దలూరులో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలోనూ, సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో జరిగే ప్రచార భేరి కార్యక్రమంలోనూ, రాత్రి 7 గంటలకు వెలిగండ్లలో జరిగే ప్రచార భేరి కార్యక్రమంలోనూ షర్మిల పాల్గొంటారని తెలిపారు. ఈనెల 22వ తేదిన ఉదయం పది గంటలకు అద్దంకిలో జరిగే ప్రచారభేరి కార్యక్రమంలోనూ, చీరాలలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే ప్రచార భేరి కార్యక్రమంలో షర్మిల పాల్గొని మాట్లాడనున్నట్లు వైకాపా జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ తెలిపారు.
జడ్‌పిటిసిలకు భారీగా నామినేషన్లు
నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం
వైకాపా జడ్‌పి చైర్మన్ అభ్యర్థిగా నూకసాని నామినేషన్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మార్చి 19: జిల్లాలోని 56 జడ్‌పిటిసి, 790 ఎంపిటిసిలకు బుధవారం భారీగా అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లాలోని 56 మండలాల నుండి ఆయా పార్టీలకు చెందిన నాయకులు జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పాత జిల్లాపరిషత్ హాలులో ఏర్పాటుచేసిన కేంద్రం వద్దకు తరలివచ్చారు. అభ్యర్థుల సౌకర్యార్ధం ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లకు సంబంధించిన నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా కౌంటర్ల వద్ద రాత్రి పొద్దుపోయే వరకు అభ్యర్థుల నుండి ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా పాత జిల్లాపరిషత్ కార్యాలయం వద్ద ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన అభ్యర్థులే భారీగా నామినేషన్లను దాఖలు చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం నామినేషన్లు వేసే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్కక్క మండలం నుండి ఎంపిటిసిలకు 30 నుండి 50 మంది వరకు నామినేషన్లను దాఖలు చేశారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున జిల్లాపరిషత్ చైర్మన్ రేసులో ఉన్న వైకాపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ పుల్లలచెరువు జడ్‌పిటిసి తరపున నామినేషన్ దాఖలు చేశారు. మంచిరోజు కావటంతో నామినేషన్లు వేసేందుకు నేతలు బారులు తీరటంతో అధికారులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. గురువారం చివరిరోజు కావటంతో భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి.
ఓటుహక్కుపై విస్తృత ప్రచారం:కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మార్చి 19: జిల్లాలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల నమోదు, ఓటుహక్కు వినియోగించుకునేందుకు విస్తృతంగా కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టినట్లు జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్ అక్షయ్‌రౌత్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ హైదరబాదు నుండి జిల్లాకలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటుహక్కు వినియోగంపై చేపట్టనున్న, చేపట్టిన వివరాలను వెల్లడించారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణతోపాటు ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరవిజయం ద్వారా సుమారు ఆరులక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అందులోభాగంగా మొదటి దశ ఈనెల 9వ తేదీన పూర్తయిందని, రెండవదశ కార్యక్రమంలో ఓటరు నమోదు, ఓటుహక్కును వినియోగించటంలో గ్రామస్థులందరికీ అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ర్యాలీలు, గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా సమైక్య సభ్యులచే ఓటుహక్కు, నైతిక ఓటుపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో 86 శాతం ఓటింగ్ జరిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత గ్రామ పంచాయతీల్లో 89 శాతం ఓటింగ్ జరిగిందన్నారు. భారత ఎన్నికల కమిషన్ డైరెక్టర్ జనరల్ అక్షయ రౌత్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెయిడ్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోకాని, సామాజిక నెట్‌వర్క్‌లు, సినిమా థియేటర్లు, రేడియోలో వచ్చే రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రకటనలను పరిశీలించాలన్నారు. ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలతోపాటు ఓటరు నమోదు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిసారించి ఓటరు నమోదుకు, ఓటింగ్ ప్రపక్రియ పెరిగేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఓటరు తమ ఓటును సద్వినియోగం చేసుకునేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులు ఉత్తరాలు రాయాలన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లాలవారీగా సమీక్షించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
................
ప్రజ